సాంకేతిక సమస్యతో ఈ–ఆఫీస్‌కు బ్రేక్
అనంతపురం అర్బన్ : సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ–ఆఫీస్ ప్రక్రియకు బ్రేక్ పడింది. వారం రోజులుగా ఈ–ఆఫీసు సేవలు ఆగిపోయాయి. కలెక్టరేట్లో ఫైళ్ల ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఈ–ఆఫీసుని అమలు చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోనే సాంకేతిక సమస్య రావడంతో ప్రక్రియ నిలిచినట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ప్రతి ఫైలు ఈ– ఆఫీసు ద్వారానే రావాలని కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నుంచి సిబ్బందికి కచ్చితమైన ఆదేశాలు ఉన్నాయి. మాన్యువల్‌గా పంపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అయితే వారం రోజులుగా ఈ–ఆఫీసు ప్రక్రియ నిలిచిపోవడంతో ఫైళ్లు ఎలా పంపించాలో అర్థం కాక సిబ్బంది అయోమయంలో పడ్డారు. ఫైళ్లను మాన్యువల్‌గా సిద్ధం చేసి తమ వద్ద ఉంచుకున్నారు. అయితే అధికారులు మాత్రం ఈ–ఆఫీసు ద్వారా వస్తేనే పరిశీలిస్తామని చెప్పడంతో వాటిని సిబ్బంది తమ వద్దనే ఉంచుకున్నారు. ఇదే పరిస్థితి ఈ–ఆఫీసు అమలు చేస్తున్న ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఉన్నట్లు తెలిసింది. ఈ–ఆఫీసు నిలిచిపోయిన విషయంపై అధికారులను వివరణ కోరితే ప్రతి రోజు రాజధానిలోని అధికారులతో మాట్లాడుతున్నామని, మంగళవారం కూడా ఇదే విషయంపై మాట్లాడామని, ఒకటి రెండు రోజులు సమస్య పరిష్కారమవుతుందని చెబుతున్నారని సమాధానమిచ్చారు.