ఇక సర్కారీ ‘నిషా’
మద్యం షాపుల ఏర్పాటుకు కసరత్తు
అవుట్సోర్సింగ్ సిబ్బందితో షాపుల నిర్వహణ
విజయవాడ : ఎక్సైజ్‌శాఖ జిల్లాలో ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ ప్రకియలో భాగంగా గత లాటరీలో మిగిలిపోయిన వైన్‌షాపుల స్థానంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను తెరచి విక్రయాలు సాగించాలని నిర్ణయించింది. దీంతో జిల్లాలో మిగిలిపోయిన 32 షాపుల ప్రాంతాల్లో 15 సర్కారు వైన్ షాపులను తొలుత ఏర్పాటు చేసి విక్రయాల స్థాయిని పరిశీలించి అవసరమైతే దానికి అనుగుణంగా షాపుల సంఖ్యను పెంచుకోవాలని నిర్ణయించింది. దీంతో జిల్లా ఎక్సైజ్ అధికారులు షాపులు ఏర్పాటు చేయటానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. జిల్లాలో 335 వైన్‌షాపులున్నాయి. వీటిలో ఇప్పటి వరకు నిర్వహించిన ఐదు గజిట్ల ద్వారా 301 వైన్ షాపులకు రెండేళ్ల కాలపరిమితితో లెసైన్స్‌లు మంజూరు చేశారు. ఇప్పటికే రెండు నెలలుగా కొత్త లెసైన్సుల కాలపరిమితి మొదలయింది. మిగిలిన 34 షాపుల్లో రెండు షాపుల వ్యవహారం కోర్టులో పెండింగ్‌లో ఉంది. దీంతో రెండు షాపులు మినహా మిగిలిన 32 షాపులను మళ్లీ గజిట్ ద్వారా కేటాయింపులు చేయాలని నిర్ణయించింది.
అయితే చివరి రెండు గజిట్లకు స్పందన రాకపోవడంతో ప్రభుత్వమే మద్యం షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే విజయవాడలో రెండు మద్యం దుకాణాలను గత కొన్నేళ్లుగా ప్రభుత్వమే నిర్వహిస్తోంది బందరురోడ్డులోని చోడవరం, గొల్లపూడి సమీపంలోని గుంటుపల్లిలో ఇప్పటికే ప్రభుత్వ షాపులున్నాయి. వైన్‌షాపుల నిర్వహణ కోసం అవసరమైతే అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన సిబ్బందిని నియమించుకోవాలని అధికారులు యోచిస్తున్నారు. షాపుల పర్యవేక్షణ బాధ్యతలను బేవరేజ్ అధికారులతో పాటు స్థానిక ఎక్సైజ్ స్టేషన్ సీఐలకు అప్పగించనున్నారు. సర్కారు ఏర్పాటు చేసే షాపులకు అనువైన ప్రాంతం గుర్తించే బాధ్యతను సీఐలపైనే పెట్టారు.
ఈ పరిణామాల క్రమంలో తొలుత 15 షాపులు ఏర్పాటు చేసి విక్రయాల స్థాయి అధికంగా ఉంటే మిగిలిన షాపులు ఏర్పాటు చేయాలని లేదంటే అప్పటి పరిస్థితికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని భావించారు.మరో 15 రోజుల వ్యవధిలో జిల్లాలో షాపులు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
షాపులు ఇవే....
విజయవాడ డివిజన్ పరిధిలో 10 షాపులు, మచిలీపట్నం డివిజన్ పరిధిలో 24 షాపులు ఖాళీలున్నాయి. విజయవాడ నగరంలోని 3, 14, 15, 16 డివిజన్లల్లో నాలుగు షాపులు ఖాళీ ఉన్నాయి. అలాగే పెనమలూరు, గంగూరుతో పాటు మరో నాలుగు ప్రాంతాల్లో షాపులు ఖాళీ ఉన్నాయి. వీటి స్థానంలో సుమారు 7 షాపులు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. మచిలీపట్నం డివిజన్ పరిధిలోని అవనిగడ్డలో ఒక షాపు, మొవ్వ మండలంలో రెండు, గుడివాడలో నాలుగు షాపులు, కైకలూరులో ఏడు షాపులు, మండవల్లిలో నాలుగు షాపులు, గన్నవరంలో ఐదు షాపులు, ఉయ్యూరులో ఒక షాపు ఖాళీ ఉన్నాయి.