సమైక్య తీర్మానం, ఓటింగ్‌తోనే పరిష్కారం
ఒంగోలు కలెక్టరేట్/మార్కాపురం/కందుకూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చించాలన్న తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పాలకుల వాదనపై జిల్లాలోని సమైక్యవాదులు భగ్గుమంటున్నారు. అసెంబ్లీలో సమైక్య తీర్మానంతోగానీ, విభజన బిల్లుపై ఓటింగ్ ప్రక్రియతోగానీ ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని వారంతా స్వాగతిస్తున్నారు. బిల్లుపై చర్చ పేరుతో రాష్ట్రాన్ని విభజించేందుకు సీఎం కుట్రచేస్తున్నారని విమర్శిస్తున్నారు. అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లుపై జిల్లావాసుల మనోభావాలు ఈ విధంగా ఉన్నాయి...
ఓటింగ్‌తో నిజమైన
సమైక్యవాదులు తేలుతారు
రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి వచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి ఓటింగ్ పెట్టాలి. ఓటింగ్‌తోనే నిజమైన సమైక్యవాదులు తేలుతారు. సమైవాదుల ముసుగులో కొంతమంది పబ్బం గడుపుకుంటున్నారు. కాలయాపన కోసమే చర్చను తెరపైకి తీసుకువచ్చారు. - శెట్టి గోపి,ప్రభుత్వ డ్రైవర్ల సంఘ రాష్ట్రనేత
ప్రభుత్వంతో అశోక్‌బాబు కుమ్మక్కు
రాష్ట్ర విభజనపై ప్రజలు రగులుతుంటే ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు. ఉద్యోగులు 66 రోజులపాటు సమ్మె చేస్తే దానికి సరైన ఫలితం లేకుండానే ముగించేశారు. విభజనను వ్యతిరేకించే రాజకీయ పార్టీలను కలుపుకోలేదు. సీఎం డెరైక్షన్‌లో సమైక్యాంధ్ర పోరాటం చేశారు. సమైక్యాంధ్ర కోసం నిలబడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇళ్లను చర్చల్లో పాల్గొనకుంటే ముట్టడిస్తామనడం అశోక్‌బాబు అవివేకం.
- మాంటిస్సోరి ప్రకాష్, సమైక్యాంధ్ర ట్యుటోరియల్స్ నేత
చర్చించినా పరిష్కారం లభించదు
రాష్ట్ర విభజన బిల్లు గురించి చర్చించినా ఎలాంటి పరిష్కారం లభించదు. ఎన్ని రోజులు చర్చించినా ఉపయోగం ఉండదు. చర్చ అంశాన్ని పక్కనపెట్టి ఓటింగ్ కోసం సీమాంధ్రలోని అన్ని రాజకీయ పార్టీలు పట్టుబట్టాలి. ఓటింగ్ ద్వారా విభజనను వ్యతిరేకిస్తున్నట్లు తేలుతోంది. వైఎస్ విజయమ్మ సూచనకు అన్ని పార్టీలు సహకరించాలి.
- సాంబశివరావు, విద్యుత్ జేఏసీ జిల్లా కన్వీనర్