నేపాల్లో ఏడుగురు.. భారత్లో 12 మంది మృతి
మరోసారి వచ్చిన భారీ భూకంపం కారణంగా నేపాల్లో ఏడుగురు మరణించారు, మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు. భారతదేశంలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్లోని చౌతారా పట్టణంలో భూకంప ప్రభావానికి ఓ భవనం కుప్పకూలిపోవడంతో నలుగురు అక్కడికక్కడే మరణించగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. రాజధాని కఠ్మాండు నగరంలో మరో ముగ్గురు మరణించారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని పోలీసు అధికార ప్రతినిధి కమల్ సింగ్ బామ్ తెలిపారు. ఇంకా చాలా భవనాలు కుప్పకూలినట్లు సమాచారం అందుతోందని ఆయన చెప్పారు.
ఇక మన దేశంలో.. బీహార్ రాజధాని పాట్నా నగరంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడంతో 10 మంది కార్మికులు మరణించారు. ఉత్తరప్రదేశ్లో కూడా మరో ఇద్దరు మరణించినట్లు సమాచారం అందింది. దీంతో భారతదేశంలో భూకంప మృతుల సంఖ్య 12కు చేరుకుంది.