ఇక ఉన్నది రెండు రోజులే!
ప్రభుత్వం పారిపోతోందని ప్రతిపక్షం, అసలు తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని, నవంబర్ 16వ తేదీ నుంచే చర్చ మొదలై దాని మీద అన్ని పార్టీలూ మాట్లాడుతున్నా.. ప్రతిపక్షమే చర్చను సజావుగా సాగనివ్వడం లేదని ప్రభుత్వం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు మరొక్క రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కనీసం ఇప్పటికైనా పెద్దనోట్ల రద్దు, ఇతర అంశాల మీద చర్చ సజావుగా సాగుతుందో లేదో అనుమానంగానే కనిపిస్తోంది. వాస్తవానికి నాలుగు రోజుల విరామం తర్వాత లోక్‌సభ బుధవారం సమావేశమైనప్పుడు ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. ఇతర సీనియర్ నాయకులంతా హాజరయ్యారు. ప్రధాని కూడా చర్చలో పాల్గొంటారని, ఆయన తన వాదన వినిపించేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ నాయకులు ఉదయం నుంచి చెబుతూ వస్తున్నారు.
కానీ బుధవారం పార్లమెంటులో పరిస్థితి యథాతథంగా కనిపించింది. లోక్‌సభ సమావేశమైన కొద్దిసేపటికే తీవ్ర వాగ్వాదాలు, నినాదాలతో మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. తిరిగి సమావేశమైన తర్వాత సభను సజావుగా నిర్వహించేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ విశ్వప్రయత్నాలు చేశారు. కానీ అగస్టా వెస్ట్‌లాండ్ కుంభకోణం వ్యవహారం తెరమీదకు రావడం, దానిపై తీవ్రస్థాయిలో వాదోపవాదలు జరగడంతో సభ వేడెక్కింది. ఈ వ్యవహారంలో వైమానిక దళ మాజీ ప్రధానాధికారి త్యాగిని అరెస్టు చేసిన విషయాన్ని అధికార పక్షం ప్రస్తావించగా.. దాన్ని రాజకీయం చేయొద్దని బీజేడీ తదితర పక్షాలు మండిపడ్డాయి.
ఇంతలో.. అసలు తనకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని, పెద్దనోట్ల రద్దు అంశం మీద చర్చను ఎందుకు సాగనివ్వడం లేదని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ప్రశ్నించారు. అదే సమయంలో సభాధ్యక్షురాలు సుమిత్రా మహాజన్ మీద కూడా ఆయన ఆరోపణలు చేయడంతో.. మంత్రి అనంతకుమార్ తీవ్రంగా స్పందించారు. చర్చకు తాము సిద్ధమన్న విషయాన్ని ఎప్పుడో చెప్పామని.. అనవసరంగా ప్రతిపక్షమే దీనిపై గందరగోళం సృష్టిస్తూ సభను సాగనివ్వడం లేదని.. ప్రధానమంత్రి సైతం దానిపై మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. ఈ సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తీవ్ర గందరగోళ పరిస్థితి సృష్టించారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు స్పీకర్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో .. ఆమె సభను గురువారానికి వాయిదా వేశారు. శుక్రవారంతో పార్లమెంటు శీతాకాల సమావేశాలు కూడా ముగిసిపోతాయి. అది కూడా అయిపోతే ఇక చర్చించడానికి పార్లమెంటు వేదిక అంటూ ఉండదు.. కేవలం బహిరంగ సభలు, ప్రెస్మీట్లతోనే కాలం గడిపేయాల్సి వస్తుంది. అధికార, ప్రతిపక్ష సభ్యులు ఇప్పటికైనా ఈ విషయాన్ని గుర్తించి పార్లమెంటులో పెద్దనోట్ల రద్దు అంశంపై చర్చ కొనసాగనిస్తారేమో చూడాలి!!