shadikhana
-
షాదీఖానా ఇంతేనా..?
సాక్షి, భద్రాచలంటౌన్: ప్రజల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రభుత్వం ప్రవేశపెడుతున్నా అవి కొంతమంది అధికారుల అలసత్వంతో ఆ పథకాలు నీరుగారిపోతున్నాయి. సుమారు 16 ఏళ్ల క్రితం సుమారు రూ. 7.5లక్షలతో ముస్లీంలు వివాహాది శుభకార్యాలు నిర్వహించుకోవడానికి మండల పరిషత్ నిథులతో పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీలో షాదీఖానా నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు షాదీఖానా గురించి పట్టించుకున్న నాథుడే లేడు. అనంతరం మరో రూ. 5లక్షలు వెచ్చించి ఆధునీకరించారు. ఫంక్షన్లు జరుపుకునేందుకు ఒక హాలు, వేదిక, ఇరువైపులా రెండు గదులు, రెండు స్నానాల గదులు నిర్మించారు. అధికారులు తమ లక్ష్యాన్ని మరవడంతో లక్షలాది రూపాయలతో నిర్మించిన షాదీఖానా నేడు పశువులకు నిలయంగా మారింది. అధికారుల పర్యవేక్షణ శూన్యం... ట్రాక్టర్, బండి నిలిపి ఉంచిన దృశ్యం షాదీఖానా నిర్మించిన నాటినుండి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇంతవరకు షాదీఖానాలో పెళ్లిబాజా మోగలేదు. నిర్మించిన నాటినుండి అధికారులు ముస్లీం కమిటీలకు కూడా నిర్వహణ బాధ్యతలను అప్పగించకపోవడంతో నేడు అది దీనస్థితిలో ఉంది. షాదీఖానా చుట్టుపక్కల నివశిస్తున్న వారు తమ గేదెలను షాదీఖానాలోని హాలు, గదుల్లో కట్టి వేసి వాటికి గడ్డి, కుడితి పెడుతుండటంతో పాటు వాటి వ్యర్థాలను కూడా ఖాళీస్థలంలో వేస్తున్నారు. దీంతో దుర్గంథం వెదజల్లుతొంది. షాదీఖానా రోడ్డు పక్కనే ఉండటంతో దారిన పోయే వారు ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. షాదీఖానా స్థలం కబ్జా... షాదీఖానా నిర్మాణానికి ప్రభుత్వ అధికారులు 39సెంట్ల స్థలాన్ని కేటాయించారు. అధికారులు పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో అది కబ్జా కు గురయ్యింది. సుమారు 17సెంట్లు మాత్రమే మిగిలిందని ముస్లీం కమిటీ నాయకులు వాపోతున్నారు. షాదీఖానా నిర్మించిన అధికారులు ప్రహరీ నిర్మించకపోవడంతో షాదీఖానలో విద్యు త్ మీటరు, బోరు మోటారు చోరీకి గురయ్యాయి. ఫంక్షన్‌హాల్స్ ధరలు ఆకాశంలో... సాధారణంగానే ఫంక్షన్‌హాల్స్ ధరలు అధికంగానే ఉంటున్నాయి. సామాన్య ముస్లీం కుటుంబాలు వేలు పోసి తమ ఇంట్లోని శుభకార్యాలను ఫంక్షన్‌హాల్స్‌లో నిర్వహించుకోలేని పరి స్థితి ఉంది. దీంతో అప్పులు చేసి ఫంక్షన్‌హాల్స్‌లో శుభకార్యాలను నిర్వహించుకోవాల్సి వస్తుంది. ఇది తమకు ఎంతో భారంగా మారిందని వారు వాపోతున్నారు. షాదీఖానాను ఆధునికరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్, ఐటీడీఏ పీఓలతో పాటు స్థానిక అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినా ఎవరూ స్పందించడం లేదని జామా మసీదు అధ్యక్షుడు షఫీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలంలోనే ఈ దుస్థితి జిల్లాలో ఏ మండల కేంద్రంలో చూసినా ముస్లీంలకు ఏర్పాటు చేసిన షాదీఖానాలు ఆధునాతన సదుపాయాలతో కూడి ఉన్నాయి. కేవలం భద్రాచలంలోనే ఇటువంటి పరిస్థితి దాపురించింది. ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉన్నా షాదీఖాను గురించి ఎవరు పట్టించుకోక పోవడం దారుణం. ఇప్పటికైనా అధికారులు స్పందించి షాదీఖానాను అందుబాటులోకి తీసుకు వచ్చి ముస్లీం కమిటీకి అప్పగించాలి. -ముస్లీం మైనార్టీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్కే ఖదీర్ దుర్గంధం భరించలేకపోతున్నాం గేదెలను షాదీఖానా ముందు, లోన కట్టి వేస్తున్నారు. పేడను కూడా అక్కడే వేస్తుండటంతో దుర్గంధంతో పాటు విపరీతమైన దోమలతో రాత్రిళ్లు నిద్ర కూడా పోలేని పరిస్థితి ఉంది. ఆదివారం 12 ట్రక్కుల పేడను తీసుకు వెళ్లారు. అధికారులు స్పందించి షాదీఖానా చుట్టూ ప్రహరీ గోడనైనా నిర్మిస్తే బాగుంటుంది. -లక్ష్మీ, స్థానికురాలు -
మంత్రి ఫరూక్‌కు నిరసన సెగ
సాక్షి, కర్నూలు : ఆత్మకూరులో షాదీఖానా నిర్మాణం కోసం చేపట్టిన భూమి పూజ కార్యక్రమం రసాభాసగా మారింది. భూమి పూజ చేసేందుకు వచ్చిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎన్.ఎమ్.డీ ఫరూక్‌ను హజ్ కమిటీ చైర్మన్ అహ్మద్ హుస్సేన్ అడ్డుకున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ అహ్మద్ కుమారుడితో సహా పలువురు నిరసనకు దిగారు. ఫరూక్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి మైనార్టీలను అణగదొక్కాలని చూస్తున్నారంటూ ఆందోళన చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సమస్యలు ఉంటే మాట్లాడి పరిష్కరించుకోవాలే గానీ పార్టీకి నష్టం కలిగేలా ప్రవర్తించడం సరికాదంటూ మంత్రి ఫరూక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఉర్దూ అకాడమీ చైర్మన్ నౌమన్, బుడ్డా రాజశేఖరరెడ్డి, అహ్మద్ హుస్సేన్ తదితరులతో కలిసి షాదీఖానా భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. -
అసంపూర్తిగా షాదిఖానా
దౌల్తాబాద్‌లో పిల్లర్ల స్థాయిలోనే నిలిచిన పనులు 12 ఏళ్లుగా ముస్లిం మైనారిటీల ఎదురుచూపులు పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు హత్నూర: మైనార్టీల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నామని ప్రకటిస్తున్న ఫ్రభుత్వాలు క్షేత్రస్తాయిలో అమలు చేయకపోవడంతో ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడె’ అన్న చందంగా మారింది. హత్నూర మండలం దౌల్తాబాద్‌లో ముస్లింల సంక్షేమం కోసం 2004 జులై 23న అప్పటి ప్రభుత్వం రూ.7.50 లక్షలతో షాదీఖానా భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. అప్పటి ఎమ్మెల్యే సునీతారెడ్డి భవన నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్ ఎంతో ఉత్సాహంతో కొన్ని రోజుల్లోనే పిల్లర్ల స్థాయి వరకు చకచకా నిర్మించారు. అనంతరం అధికారుల పర్యవేక్షణ లోపం, ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా కొన్ని నెలలకే భవన నిర్మాణం పనులు నిలిచిపోయాయి. భవన నిర్మాణం పనులను పూర్తి చేయాలని 12 ఏళ్లుగా ప్రజాప్రతినిధులకు, అధికారులకు స్థానిక మైనార్టీ నాయకులు విన్నవిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అసంపూర్తి నిర్మాణంలో పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు ఏపుగా పెరిగాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్పుకుంటున్నా... అసంపూర్తిగా ఉన్న షాదీఖానా భవన నిర్మాణంపై దృష్టి పెట్టడంలేదని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. రంజాన్ పండుగ రోజు మాత్రం అన్ని పార్టీల నాయకులతో పాటు తాజా మాజీ ఎమ్మెల్యేలు సైతం ఈద్గాల వద్దకు వచ్చి రంజాన్ ముబారక్ చెబుతూ దౌల్తాబాద్ మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తామని ప్రకటిస్తున్నా... ఆచరణలో చూపడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని పూర్తిస్థాయిలో షాదీఖానా భవనం నిర్మిస్తే పరిసర గ్రామాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పట్టించుకోవడం లేదు షాదీఖానా భవన నిర్మాణం పనులు నిలిచిపోయి 12 ఏళ్లు గడుస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదు. ఇప్పటికైనా అధికారులు , ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని అసంపూర్తి పనులను పూర్తి చేయించాలి. - అతిక్హైమద్ ఖాన్, దౌల్తాబాద్ చర్య తీసుకోవాలి అసంపూర్తిగా ఉన్న షాదీఖానా పనులను వెంటనే ప్రారంభించేలా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యానికి మా షాదీఖానే నిదర్శనం. షాదీఖానా నిర్మాణం పూర్తయితే ఎందరో పేద ముస్లింలకు ఉపయోగకరంగా ఉంటుంది. అధికారులు స్పందించాలి. - అజీజ్ఖురేషి