సాక్షి, భద్రాచలంటౌన్: ప్రజల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రభుత్వం ప్రవేశపెడుతున్నా అవి కొంతమంది అధికారుల అలసత్వంతో ఆ పథకాలు నీరుగారిపోతున్నాయి. సుమారు 16 ఏళ్ల క్రితం సుమారు రూ. 7.5లక్షలతో ముస్లీంలు వివాహాది శుభకార్యాలు నిర్వహించుకోవడానికి మండల పరిషత్ నిథులతో పట్టణంలోని రాజీవ్‌నగర్ కాలనీలో షాదీఖానా నిర్మించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు షాదీఖానా గురించి పట్టించుకున్న నాథుడే లేడు. అనంతరం మరో రూ. 5లక్షలు వెచ్చించి ఆధునీకరించారు. ఫంక్షన్లు జరుపుకునేందుకు ఒక హాలు, వేదిక, ఇరువైపులా రెండు గదులు, రెండు స్నానాల గదులు నిర్మించారు. అధికారులు తమ లక్ష్యాన్ని మరవడంతో లక్షలాది రూపాయలతో నిర్మించిన షాదీఖానా నేడు పశువులకు నిలయంగా మారింది.
అధికారుల పర్యవేక్షణ శూన్యం...
ట్రాక్టర్, బండి నిలిపి ఉంచిన దృశ్యం
షాదీఖానా నిర్మించిన నాటినుండి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇంతవరకు షాదీఖానాలో పెళ్లిబాజా మోగలేదు. నిర్మించిన నాటినుండి అధికారులు ముస్లీం కమిటీలకు కూడా నిర్వహణ బాధ్యతలను అప్పగించకపోవడంతో నేడు అది దీనస్థితిలో ఉంది. షాదీఖానా చుట్టుపక్కల నివశిస్తున్న వారు తమ గేదెలను షాదీఖానాలోని హాలు, గదుల్లో కట్టి వేసి వాటికి గడ్డి, కుడితి పెడుతుండటంతో పాటు వాటి వ్యర్థాలను కూడా ఖాళీస్థలంలో వేస్తున్నారు. దీంతో దుర్గంథం వెదజల్లుతొంది. షాదీఖానా రోడ్డు పక్కనే ఉండటంతో దారిన పోయే వారు ముక్కు మూసుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.
షాదీఖానా స్థలం కబ్జా...
షాదీఖానా నిర్మాణానికి ప్రభుత్వ అధికారులు 39సెంట్ల స్థలాన్ని కేటాయించారు. అధికారులు పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో అది కబ్జా కు గురయ్యింది. సుమారు 17సెంట్లు మాత్రమే మిగిలిందని ముస్లీం కమిటీ నాయకులు వాపోతున్నారు. షాదీఖానా నిర్మించిన అధికారులు ప్రహరీ నిర్మించకపోవడంతో షాదీఖానలో విద్యు త్ మీటరు, బోరు మోటారు చోరీకి గురయ్యాయి.
ఫంక్షన్‌హాల్స్ ధరలు ఆకాశంలో...
సాధారణంగానే ఫంక్షన్‌హాల్స్ ధరలు అధికంగానే ఉంటున్నాయి. సామాన్య ముస్లీం కుటుంబాలు వేలు పోసి తమ ఇంట్లోని శుభకార్యాలను ఫంక్షన్‌హాల్స్‌లో నిర్వహించుకోలేని పరి స్థితి ఉంది. దీంతో అప్పులు చేసి ఫంక్షన్‌హాల్స్‌లో శుభకార్యాలను నిర్వహించుకోవాల్సి వస్తుంది. ఇది తమకు ఎంతో భారంగా మారిందని వారు వాపోతున్నారు.
షాదీఖానాను ఆధునికరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్, ఐటీడీఏ పీఓలతో పాటు స్థానిక అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినా ఎవరూ స్పందించడం లేదని జామా మసీదు అధ్యక్షుడు షఫీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
భద్రాచలంలోనే ఈ దుస్థితి
జిల్లాలో ఏ మండల కేంద్రంలో చూసినా ముస్లీంలకు ఏర్పాటు చేసిన షాదీఖానాలు ఆధునాతన సదుపాయాలతో కూడి ఉన్నాయి. కేవలం భద్రాచలంలోనే ఇటువంటి పరిస్థితి దాపురించింది. ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఉన్నా షాదీఖాను గురించి ఎవరు పట్టించుకోక పోవడం దారుణం. ఇప్పటికైనా అధికారులు స్పందించి షాదీఖానాను అందుబాటులోకి తీసుకు వచ్చి ముస్లీం కమిటీకి అప్పగించాలి.
-ముస్లీం మైనార్టీ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్కే ఖదీర్
దుర్గంధం భరించలేకపోతున్నాం
గేదెలను షాదీఖానా ముందు, లోన కట్టి వేస్తున్నారు. పేడను కూడా అక్కడే వేస్తుండటంతో దుర్గంధంతో పాటు విపరీతమైన దోమలతో రాత్రిళ్లు నిద్ర కూడా పోలేని పరిస్థితి ఉంది. ఆదివారం 12 ట్రక్కుల పేడను తీసుకు వెళ్లారు. అధికారులు స్పందించి షాదీఖానా చుట్టూ ప్రహరీ గోడనైనా నిర్మిస్తే బాగుంటుంది.
-లక్ష్మీ, స్థానికురాలు
Comments
Please login to add a commentAdd a comment