దౌల్తాబాద్‌లో ముళ్ల పొదలతో దర్శనమిస్తున్న భవనం
- దౌల్తాబాద్‌లో పిల్లర్ల స్థాయిలోనే నిలిచిన పనులు
- 12 ఏళ్లుగా ముస్లిం మైనారిటీల ఎదురుచూపులు
- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
హత్నూర: మైనార్టీల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నామని ప్రకటిస్తున్న ఫ్రభుత్వాలు క్షేత్రస్తాయిలో అమలు చేయకపోవడంతో ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడె’ అన్న చందంగా మారింది. హత్నూర మండలం దౌల్తాబాద్‌లో ముస్లింల సంక్షేమం కోసం 2004 జులై 23న అప్పటి ప్రభుత్వం రూ.7.50 లక్షలతో షాదీఖానా భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది.
అప్పటి ఎమ్మెల్యే సునీతారెడ్డి భవన నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్ ఎంతో ఉత్సాహంతో కొన్ని రోజుల్లోనే పిల్లర్ల స్థాయి వరకు చకచకా నిర్మించారు. అనంతరం అధికారుల పర్యవేక్షణ లోపం, ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా కొన్ని నెలలకే భవన నిర్మాణం పనులు నిలిచిపోయాయి.
భవన నిర్మాణం పనులను పూర్తి చేయాలని 12 ఏళ్లుగా ప్రజాప్రతినిధులకు, అధికారులకు స్థానిక మైనార్టీ నాయకులు విన్నవిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అసంపూర్తి నిర్మాణంలో పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు ఏపుగా పెరిగాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండేళ్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్పుకుంటున్నా... అసంపూర్తిగా ఉన్న షాదీఖానా భవన నిర్మాణంపై దృష్టి పెట్టడంలేదని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
రంజాన్ పండుగ రోజు మాత్రం అన్ని పార్టీల నాయకులతో పాటు తాజా మాజీ ఎమ్మెల్యేలు సైతం ఈద్గాల వద్దకు వచ్చి రంజాన్ ముబారక్ చెబుతూ దౌల్తాబాద్ మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తామని ప్రకటిస్తున్నా... ఆచరణలో చూపడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని పూర్తిస్థాయిలో షాదీఖానా భవనం నిర్మిస్తే పరిసర గ్రామాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.
పట్టించుకోవడం లేదు
షాదీఖానా భవన నిర్మాణం పనులు నిలిచిపోయి 12 ఏళ్లు గడుస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదు. ఇప్పటికైనా అధికారులు , ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని అసంపూర్తి పనులను పూర్తి చేయించాలి. - అతిక్‌హైమద్ ఖాన్, దౌల్తాబాద్
చర్య తీసుకోవాలి
అసంపూర్తిగా ఉన్న షాదీఖానా పనులను వెంటనే ప్రారంభించేలా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యానికి మా షాదీఖానే నిదర్శనం. షాదీఖానా నిర్మాణం పూర్తయితే ఎందరో పేద ముస్లింలకు ఉపయోగకరంగా ఉంటుంది. అధికారులు స్పందించాలి. - అజీజ్‌ఖురేషి