doulthabad
-
ప్రేమజంట బలవన్మరణం
దౌల్తాబాద్: ప్రేమ పెళ్లికి అబ్బాయి కుటుంబీకులు నిరాకరించడం, ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం ఖరారు కావడంతో జీర్ణించుకోలేని ప్రేమజంట చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన సోమవారం వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోల్కంపల్లి గ్రామానికి చెందిన కోటం అనంతప్ప, నర్సమ్మల పెద్ద కుమారుడు కోట్టం ప్రవీణ్‌కుమార్(21) రెండేళ్ల క్రితం ఐటీఐ పూర్తి చేసి హైదరాబాద్‌లో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన భీమప్ప, బుగ్గమ్మలకు ఏకైక కుమార్తె ఎర్రోళ్ల మంజుల(18) ఇంటర్ పూర్తి చేసి ఇంట్లో ఉంటోంది. ఏడాదిగా ప్రవీణ్‌కుమార్, మంజుల ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం కొద్ది నెలల క్రితం ప్రవీణ్ ఇంట్లో విషయం తెలిసింది. తాము కుదిర్చిన పెళ్లి చేసుకోవాలని అతడిని మందలించారు. అయితే మంజులకు వారం రోజుల క్రితం కొడంగల్ మండలం రావల్‌పల్లికి చెందిన ఓ వ్యక్తితో వివాహం కుదిరింది. మరో మూడు రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకున్నారు. ఈ విషయం మంజుల హైదరాబాద్‌లో ఉన్న ప్రవీణ్‌కు చెప్పడంతో ప్రవీణ్ ఆదివారం రాత్రి 9గంటలకు పోల్కంపల్లి గ్రామానికి వచ్చాడు. ఇంట్లో రాత్రికి భోజనం చేసి బయటపడుకుంటానని చెప్పి వెళ్లిపోయాడు. మంజుల కూడా కుటుంబసభ్యులు పడుకున్న తర్వాత రాత్రి 11గంటల వరకు టీవీ చూసి బయటకు వెళ్లిపోయింది. అయితే కుమారుడు కనిపించకపోవడంతో ఉదయం 4గంటలకు ప్రవీణ్ తండ్రి పొలం వద్దకు వెళ్లగా.. వారిద్దరూ చెట్టుకు ఉరేసుకుని కనిపించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై చంద్రశేఖర్ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
రోడ్డుపై రాస్తారోకో, ధర్నా, వంటావార్పు
- పాలమూరులో కలిపే వరకు ఉద్యమం ఆగదంటున్న అఖిలపక్ష నాయకులు దౌల్తాబాద్: పాలమూరు జిల్లాలో దౌల్తాబాద్ మండలాన్ని కలిపే వరకు ఉద్యమాన్ని ఆపేదిలేదని అఖిలపక్ష నాయకులు హెచ్చరించారు. జిల్లాలు, మండలాల పునర్విభజన నేపథ్యంలో దౌల్తాబాద్ మండలాన్ని వికారబాద్ జిల్లాలో కలపడం పట్ల మండల అఖిలపక్ష నాయకులు, విద్యావంతులు, విద్యార్థులు, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు, ప్రజాప్రతినిధులు చేపట్టిన నిరసన కార్యక్రమం మంగళవారం నాటికి ఎనిమిదో రోజుకు చేరింది. ఈ సందర్భంగా మండలంలోని పలు గ్రామల్లో నిరసనలు చేపట్టారు. గోకఫసల్వాద్ గ్రామంలో రోడ్డుపై రాస్తారోకోతో పాటు వంటావార్పులు చేపట్టారు. తిమ్మారెడ్డిపల్లిలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. మండల కేంద్రంలో ఉదయం 11గంటల నుంచి మండలంలోని అన్ని గ్రామాల అఖిలపక్ష నాయకులతో నారాయణపేట-కొడంగల్ రహదారిపై ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. 60కి.మీ దూరంలో ఉన్న పాలమూరును వదిలి ఎక్కడో 90కి.మీ దూరంలో ఉన్న అనంతగిరి గుట్టల్లో మండలాన్ని కలపడం అన్యాయమన్నారు. అయితే రాత్రికి రాత్రి మండలాన్ని వికారాబాద్‌లో కలిపిన నాయకులకు పుట్టగతులుండవని అన్నారు. కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు మహిపాల్‌రెడ్డి, కూరవెంకటయ్య, రెడ్డిశ్రీనివాస్, భీములు, సతీష్, రాజు, తదితరులున్నారు. -
దౌల్తాబాద్‌ను మండలకేంద్రం చేయాలి
అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన, రాస్తారోకో స్తంభించిన రాకపోకలు హత్నూర: మేజర్ గ్రామ పంచాయతీ దౌల్తాబాద్‌ను మండల కేంద్రం చేయాలంటూ బుధవారం గ్రామస్తులు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. దౌల్తాబాద్ సర్పంచ్ ఎల్లదాస్, కాసాల సర్పంచ్ భర్త పూసల సత్యనారాయణగౌడ్, ఎంపీటీసీ భర్త సురేందర్ గౌడ్ తెలంగాణతల్లి చౌరస్తా వద్ద ఆమరణ నిరాహారదీక్షలో పాల్గొన్నారు. ముందుగా వారు మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి అఖిలపక్షం నాయకుల ఆధ్వర్యంలో దౌల్తాబాద్ బంద్ నిర్వహిస్తూ తెలంగాణతల్లి చౌరస్తా వద్దకు చేరుకొని అంబేద్కర్, తెలంగాణతల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం హత్నూర మండలాన్ని రెండు మండలాలుగా విభజిస్తే దౌల్తాబాద్‌ను నూతన మండల కేంద్రం చేయాలంటూ ముగ్గురు టీఆర్ఎస్ నాయకులు ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నాయకులు సంఘీభావం ప్రకటిస్తూ సంగారెడ్డి-నర్సాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు రాస్తారోకో చేయడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. హత్నూర మండలాన్ని విడగొట్టొవద్దని, ఒక వేళ విడగొడితే దౌల్తాబాద్‌ను మండల కేంద్రం చేసి, సంగారెడ్డి జిల్లాలో కలపాలని అఖిలపక్షం నాయకులు డిమాండ్ చేశారు. సాయంత్రం ఎమ్మెల్యే మదన్‌రెడ్డి , టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కిషన్‌రెడ్డి, మరికొంత మంది నాయకులు ఆమరణ నిరాహారదీక్ష శిబిరం వద్దకు చేరుకొని దీక్ష విరమింపజేయాలని సూచించారు. దౌల్తాబాద్‌ను మండల కేంద్రం చేయడానికి తనవంతు కృషిచేస్తానని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి హామీ ఇచ్చి, నిమ్మరసం ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు. కార్యక్రమాల్లో అఖిలపక్షం నాయకులు కొన్యాల వెంకటేశం, హకీం, శ్రీనివాస్, ఇబ్రహిం, మహేష్, సాజిద్‌తోపాటు ఆయా పార్టీల నాయకులు వ్యాపారస్తులు స్వచ్ఛదంగా బంద్ పాటించి దీక్షకు మద్దతు పలికారు. దౌల్తాబాద్ చౌరస్తాలో నూతనంగా నిర్మిస్తున్న వాటర్‌ట్యాంక్‌పైకి ఆరుగురు యువకులు ఎక్కి దౌల్తాబాద్‌ను మండలంగా ప్రకటించాలని ఆందోళన చేపట్టడంతో ఎస్సై బాల్‌రెడ్డి వారికి నచ్చజెప్పి కిందకు దింపారు. చింతల్‌చెరువును మండలం చేయాలంటూ రాస్తారోకో మండలంలోని చింతల్ చెరువును మండల కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో వడ్డెపల్లి చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. హత్నూర మండలాన్ని విడగొట్టొవద్దని, ఒక వేళ విడదీస్తే చింతల్‌చెరువును మండల కేంద్రం చేయాలని డిమాండ్ చేస్తూ పటాన్చెరు, దౌల్తాబాద్ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేయడంతో భారీ సంఖ్యలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు జోక్యం చేసుకొని రాస్తారోకోను విరమింపజేశారు. సిరిపురను విడదీయొద్దు హత్నూర మండలంలో ఉన్న సిరిపుర గ్రామ పంచాయతీని నూతనంగా ఏర్పడే చిలిప్‌చెడ్ మండలంలో కలపవద్దని అఖిలపక్షం నాయకులు సిరిపురలో రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. -
అసంపూర్తిగా షాదిఖానా
దౌల్తాబాద్‌లో పిల్లర్ల స్థాయిలోనే నిలిచిన పనులు 12 ఏళ్లుగా ముస్లిం మైనారిటీల ఎదురుచూపులు పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు హత్నూర: మైనార్టీల సంక్షేమం కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నామని ప్రకటిస్తున్న ఫ్రభుత్వాలు క్షేత్రస్తాయిలో అమలు చేయకపోవడంతో ‘ఎక్కడ వేసిన గొంగడి అక్కడె’ అన్న చందంగా మారింది. హత్నూర మండలం దౌల్తాబాద్‌లో ముస్లింల సంక్షేమం కోసం 2004 జులై 23న అప్పటి ప్రభుత్వం రూ.7.50 లక్షలతో షాదీఖానా భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. అప్పటి ఎమ్మెల్యే సునీతారెడ్డి భవన నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. కాంట్రాక్టర్ ఎంతో ఉత్సాహంతో కొన్ని రోజుల్లోనే పిల్లర్ల స్థాయి వరకు చకచకా నిర్మించారు. అనంతరం అధికారుల పర్యవేక్షణ లోపం, ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా కొన్ని నెలలకే భవన నిర్మాణం పనులు నిలిచిపోయాయి. భవన నిర్మాణం పనులను పూర్తి చేయాలని 12 ఏళ్లుగా ప్రజాప్రతినిధులకు, అధికారులకు స్థానిక మైనార్టీ నాయకులు విన్నవిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అసంపూర్తి నిర్మాణంలో పిచ్చిమొక్కలు, ముళ్లపొదలు ఏపుగా పెరిగాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తున్నామని చెప్పుకుంటున్నా... అసంపూర్తిగా ఉన్న షాదీఖానా భవన నిర్మాణంపై దృష్టి పెట్టడంలేదని పలువురు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. రంజాన్ పండుగ రోజు మాత్రం అన్ని పార్టీల నాయకులతో పాటు తాజా మాజీ ఎమ్మెల్యేలు సైతం ఈద్గాల వద్దకు వచ్చి రంజాన్ ముబారక్ చెబుతూ దౌల్తాబాద్ మైనార్టీల సంక్షేమం కోసం కృషి చేస్తామని ప్రకటిస్తున్నా... ఆచరణలో చూపడం లేదు. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని పూర్తిస్థాయిలో షాదీఖానా భవనం నిర్మిస్తే పరిసర గ్రామాల ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పట్టించుకోవడం లేదు షాదీఖానా భవన నిర్మాణం పనులు నిలిచిపోయి 12 ఏళ్లు గడుస్తున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదు. ఇప్పటికైనా అధికారులు , ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా చొరవ తీసుకొని అసంపూర్తి పనులను పూర్తి చేయించాలి. - అతిక్హైమద్ ఖాన్, దౌల్తాబాద్ చర్య తీసుకోవాలి అసంపూర్తిగా ఉన్న షాదీఖానా పనులను వెంటనే ప్రారంభించేలా ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, అధికారులు చర్యలు తీసుకోవాలి. ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యానికి మా షాదీఖానే నిదర్శనం. షాదీఖానా నిర్మాణం పూర్తయితే ఎందరో పేద ముస్లింలకు ఉపయోగకరంగా ఉంటుంది. అధికారులు స్పందించాలి. - అజీజ్ఖురేషి -
దౌల్తాబాద్‌లో దోపిడి దొంగల బీభత్సం
మెదక్ : మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం రాయపోల్ గ్రామంలో ఆదివారం అర్థరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు. ఆదివారం ఉదయం స్థానికులు ఆ విషయాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బోనాల పండగ సందర్భంగా సదరు ఇళ్లలోని వారు హైదరాబాద్ వెళ్లారని స్థానికులు పోలీసులకు వెల్లడించారు. దీంతో చోరీలపై వారికి పోలీసులు సమాచారం అందించారు. అయితే చోరీలో ఎంత మొత్తంలో నగదు చోరీ అయిందనే విషయం మాత్రం తెలియరాలేదు. -
మొక్కజొన్నను దున్నేశాడు
దౌల్తాబాద్: వరుణుడి జాడ లేక.. వేసిన విత్తనాలు మొలకెత్తక .. రైతన్న ఆందోళన చెందుతున్నాడు. చేసేదిలేక పంటలను చెడిపేస్తున్నారు. మండలంలోని తిమ్మకపల్లి గ్రామానికి చెందిన రైతు కార్పాకుల జగపతిరెడ్డి తొలకరి వర్షానికే సుమారు 10 ఎకరాలలో మొక్కజొన్న విత్తనాలు వేశాడు. వర్షాధారంగా వేసిన విత్తనాలు బాగానే మొలకెత్తాయి. ఈ యేడు మొక్కజొన్న దిగుబడి బాగానే వస్తుందని ఆశించాడు. సుమారు 80 వేల రూపాయల వరకు ఇప్పటికే పెట్టుబడి పెట్టాడు. కానీ తర్వాత వాన చినుకు కరువైంది. దీంతో ఏపుగా పెరగాల్సిన మొక్కజొన్న మొలకలు వాడిపోయి ఎండిపోతున్నాయి. దీంతో చేను చాలా వరకు దెబ్బతిన్నది. ఇక వర్షం పడినా ఫలితంలేదని భావించిన ఆ రైతు గురువారం ట్రాక్టర్‌తో మొక్కజొన్న చేనును దున్నేశాడు. పెట్టినపెట్టుబడులు నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. -
మంత్రాల నెపంతో తాతను చంపిన మనవడు
తండ్రి కాష్టం వద్దనే గొడ్డలితో నరికి చంపిన వైనం దౌల్తాబాద్, న్యూస్‌లైన్ : మంత్రాలతో కుటుంబ సభ్యులను హతమారుస్తున్నాడనే అనుమానంతో తాతను పట్టపగలే మనవడు గొడ్డలితో నరికి చంపాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా దౌల్తాబాద్‌లో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ శేఖర్‌రెడ్డి కథనం మేరకు.. ఆవుల మల్లయ్య(80), మల్లమ్మ దంపతులు కుటుంబం కొన్నేళ్లుగా దౌల్తాబాద్‌లో స్థిరపడింది. కుమార్తె లింగమ్మ, అల్లుడు స్వామిలు మల్లయ్య పొరుగింటిలో నివాసం ఉంటున్నారు. మల్లయ్య మంత్రాలు వేస్తాడన్న అనుమానం ఇటు కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్తులకు కూడా ఉంది. ఈ క్రమంలో పదిరోజుల క్రితం మల్లయ్య అల్లుడు స్వామి మృతి చెందాడు. శనివారం ఆయన దశదినకర్మ జరగాల్సి ఉంది. తెల్లవారుజామున మల్లయ్య పెద్ద మనుమడు మహేష్ కుమార్తె మూడు నెలల రేవతి అకస్మాత్తుగా మృతి చెందింది. ఇదిలా ఉండగా.. శనివారం మధ్యాహ్నం పొలం వద్ద ఉన్న స్వామి కాష్టం పక్కన మల్లయ్య మృతదేహం రక్తపు మడుగులో పడి ఉంది. మృతుడి మెడపై గొడ్డలి గాయమైంది. మృతదేహం పక్కన నిమ్మకాయలు, పసుపు, కల్లు సీసాలు పడి ఉన్నాయి. కాగా.. మల్లయ్య చిన్న మనవడు గణేష్ ఇంటికెళ్లి ‘మీ నాన్నను, చిన్నారిని చంపిన విధంగా నిన్నూ చంపుతానని తాత బెదిరించాడు’ దీంతో తానే అతడిని హతమార్చానని తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.