మొక్కజొన్నను దున్నేశాడు
దౌల్తాబాద్: వరుణుడి జాడ లేక.. వేసిన విత్తనాలు మొలకెత్తక .. రైతన్న ఆందోళన చెందుతున్నాడు. చేసేదిలేక పంటలను చెడిపేస్తున్నారు. మండలంలోని తిమ్మకపల్లి గ్రామానికి చెందిన రైతు కార్పాకుల జగపతిరెడ్డి తొలకరి వర్షానికే సుమారు 10 ఎకరాలలో మొక్కజొన్న విత్తనాలు వేశాడు. వర్షాధారంగా వేసిన విత్తనాలు బాగానే మొలకెత్తాయి. ఈ యేడు మొక్కజొన్న దిగుబడి బాగానే వస్తుందని ఆశించాడు.
సుమారు 80 వేల రూపాయల వరకు ఇప్పటికే పెట్టుబడి పెట్టాడు. కానీ తర్వాత వాన చినుకు కరువైంది. దీంతో ఏపుగా పెరగాల్సిన మొక్కజొన్న మొలకలు వాడిపోయి ఎండిపోతున్నాయి. దీంతో చేను చాలా వరకు దెబ్బతిన్నది. ఇక వర్షం పడినా ఫలితంలేదని భావించిన ఆ రైతు గురువారం ట్రాక్టర్‌తో మొక్కజొన్న చేనును దున్నేశాడు. పెట్టినపెట్టుబడులు నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు.