కర్రపెత్తనం!
జన్మభూమి కమిటీలు... రాజ్యాంగేతర శక్తులు, షాడో లీడర్లు ఇలా ఏ పేరుపెట్టినా తక్కువే అనేట్లుగా తయారయ్యాయి! జిల్లా కలెక్టరు నుంచి బిల్లు కలెక్టరు వరకూ ఎవ్వరైనా వారి మాట వినాల్సిందే! వినకపోతే పంతం నెగ్గించుకునేందుకు మంత్రి, ముఖ్యమంత్రి వరకైనా వెళ్లగలరు! అలా మాట వినని అధికారిని, చివరకు వారు ఉద్యోగ విరమణ చేసినా కక్ష సాధించే వరకూ వదిలిపెట్టరంతే! మరి అలాంటి జన్మభూమి కమిటీల్లో సభ్యుల నియామకంలో మంత్రి అచ్చెన్న మాటే వినకపోతే వదిలేస్తారా? వదలనే వదలరు! రిటైర్డ్ ఎంపీడీవో వి.రామలింగేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యల నిమిత్తం విచారణకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులే దీనికి నిదర్శనం! ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్న నానుడిని నిరూపిస్తూ... సంతకవిటి మండలంలో గౌరీశంకరరావు అనే పంచాయతీ కార్యదర్శిపై ఓ టీడీపీ కార్యదర్శి దాడికి పాల్పడ్డాడు. ఈ దుందుడుకు వైఖరిని నిరసిస్తూ అధికారులు గళమెత్తినా ప్రభుత్వం నుంచి స్పందనే కరువైంది!
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: జిల్లాలో అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికార యంత్రాంగంపై దూకు డు పెంచారు. చివరకు దాడులకు తెగబడుతున్నారు. అధికారులు, ప్రభుత్వ సిబ్బందిపై కర్రపెత్తనం చేయడంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముందువరసలో ఉన్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన పంచాయితీలన్నీ తన స్వగ్రామం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయంలోనే నిర్వహిస్తున్నారు. అక్కడ ఆయన హెచ్చరి కలు, బెదిరింపులకు భయపడి సొమ్మసిల్లిపోయిన అధికారులు కూడా ఉన్నారంటే అవి ఏ స్థాయిలో సాగుతున్నాయో అర్థమవుతోందని ప్రభుత్వ ఉద్యోగులే గుసగుసలాడుకుంటున్నారు. పైకి మాట్లాడి తే ఎక్కడ బదిలీ చేస్తారేమోననే భయంతో గొంతు పెగలట్లేదని చె బుతున్నారు. ఇక ఏడాదిన్నర ఓపిక పడితే చాలనే ఆలోచనతోనూ కొం తమంది సరిపెట్టుకుంటున్నారు.
జన్మభూమి కమిటీల పెత్తనానికే సై...
గ్రామాల్లో, పట్టణాల్లో జన్మభూమి కమి టీల మాటే పైమాట అవుతోంది. సంక్షేమ పథకాలకు అర్హులను ఎంపిక చేసేదీ వారే. ఈ విషయంలో మండల, జిల్లాస్థాయి అధికారులు సైతం వారి మాట వినా ల్సిందే. కాదని ముందుకెళ్లలేని పరిస్థితి. ఈ అలుసుతోనే పథకాల నిబంధనలకు సైతం గండి కొడుతున్నారు. తమకు కావాల్సిన వారికి లేదా చేయి తడిపిన వారికి అర్హత లేకపోయినా లబ్ధిదారుల జాబితాలో చోటు ఇచ్చేస్తున్నారు. వారి దుందుడుకు వైఖరి సంక్షేమ పథకాలతోనే ఆగిపోలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో విధుల్లోనూ జోక్యం చేసుకుంటున్నారు. లేదంటే వెంటనే జిల్లాస్థాయి నాయకులకు, కాదం టే ముఖ్యమంత్రికి సైతం ఫిర్యాదు చేయడానికి వెనుకాడట్లేదు. ఈ విషయంలో పోలాకి మండలంలోని రహిమాన్‌పురం పంచాయతీ కార్యదర్శి హెచ్ త్రివేణికి ఎదురైన అనుభవమే ఒక ఉదాహరణ. ఓ టీడీపీ కార్యకర్త మరణ ధ్రువీకరణపత్రం విషయంలో తాము చెప్పినట్లు ఇవ్వలేదనే కక్షతో జన్మభూమి కమిటీ సభ్యులు ఆమెపై మంత్రి అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేశారు.
దీంతో ఆయన గత ఏడాది జనవరి 19న ఆమెను నిమ్మాడ క్యాంప్ ఆఫీస్‌కు పిలిపించారు. అక్కడ బెదిరింపులకు ఆమె సొమ్మసిల్లి పడిపోయింది. హుటాహుటిన ఆమెను నరసన్నపేట ఆసుపత్రిలో చేర్పిస్తే తేరుకునేసరికి రాత్రి 9 గంటలైన సంగతి అందరికీ తెలి సిందే. ఇలా ఎంత దారుణంగా బెదిరించినా అధికారులు కిమ్మనకుండా వెళ్లిపోతారనే ఉద్దేశంతోనే మంత్రి తన క్యాంపు కార్యాలయాన్ని స్వగ్రామంలో ఏర్పాటు చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికితోడు మంత్రి నిమ్మాడలో ఉంటే ప్రభుత్వాధికారులంతా ఫైళ్లు పట్టుకొని అక్కడికే వెళ్లిపోతున్నారు.
దీంతో పేరుకు జిల్లా కేంద్రం శ్రీకాకుళమే అయినా మంత్రి జిల్లాలో ఉన్నన్ని రోజులూ కార్యాలయాన్నీ బోసిపోతున్నాయి. నిమ్మాడలో జరిగే పంచాయతీల్లో ఎక్కువ ఫిర్యాదులు జన్మభూమి కమిటీల నుంచి వచ్చేవే. అలాంటిదే రేగిడి ఆమదాలవలస టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటవేణుగోపాలనాయుడు కూడా గత ఏడా ది మంత్రి అచ్చెన్నకు ఫిర్యాదు చేశారు. మంత్రి సిఫారసు చేసిన వ్యక్తులను సైతం మండలంలోని జన్మభూమి కమిటీల్లో నియమించలేదంటూ ఎంపీడీవో వి.రామలింగేశ్వరరావుపై ఆరోపణలు చేశారు. ఈ తర్వాత రామలింగేశ్వరరావు ఉద్యోగ విరమణ చేసి వెళ్లిపోయినా ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
యంత్రాంగంపై దాడుల పరంపర...
ప్రభుత్వ సిబ్బందిపై టీడీపీ నాయకులు, కార్యకర్తల దాడులు జిల్లాలో అనేకం చోటుచేసుకున్నాయి. వాటిలో పోలీసు ఫిర్యాదు వరకూ వచ్చినవి చాలా తక్కువ. రెండ్రోజుల క్రితం సంతకవిటి మండల పరిషత్ కార్యాలయంలో వాసుదేవపట్నం పంచాయతీ కార్యదర్శి వి.గౌరీశంకరరావుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త గురుగుబెల్లి రాజు దాడి చేశాడు. ఇది ఏకంగా ఎంపీడీవో చాంబర్లోనే జరిగినా సదరు కార్యకర్తపై తగిన చర్యలు తీసుకోలేదని జిల్లా అంతటా ఆందో ళనలు చోటుచేసుకున్నాయి. పలాస మున్సిపల్ కార్యాలయంలో ఏప్రిల్ 26న ఏకంగా కమిషనర్ జగన్మోహన్రావు పై టీడీపీ నాయకులు దాడి చేశారు. ఈ ఘటనలో పలాస మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు, 18వ వార్డు కౌన్సలర్ పాతాళ ముకుంద, 12వ వార్డు కౌన్సలర్ భర్త బళ్లా శ్రీనివా స్లపై కేసు కూడా నమోదైంది.
కేవలం రాజకీయ కక్షలతో ఎమ్మెల్యే గౌతు శివాజీ తనపై బనాయించారని టీడీపీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత కోత పూర్ణచంద్రరావు చెప్పుకున్నా లాభం లేకపోయింది. వంగర మండలంలో రెండు వారాల క్రితం ఇసుక అక్రమ రవాణా చేస్తున్న టీడీపీ కార్యకర్త శ్రీనివాసరావును ఆర్ఐ వెంకటగిరి అడ్డుకున్నందుకు దాడి జరిగింది. ఈ ఘటనలో కేసు నమోదైనప్పటికీ అధికార పార్టీ నాయకులు నిందితుడివైపే మొగ్గు చూపించడం గమనార్హం. శ్రీకాకుళం మండలం శిలగాం సింగివలస గ్రామ సర్పంచ్ కె.దశరథరావు ఇటీవల ఆ గ్రామ వీఆర్వో, వీఆర్ఏలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నిరసనలు వెల్లువెత్తడంతో అప్పటి జిల్లా కలెక్టరు లక్ష్మీనరసింహం స్వయంగా ఇరువర్గాలకు రాజీ కుదిర్చాల్సి వచ్చింది. కానీ తర్వాత సర్పంచ్‌కు అదనపు నిధులు కేటాయించడం చర్చనీయాంశమైంది.
టీడీపీ ధోరణితో విసిగిపోయి... టీడీపీ నాయకుల వేధింపులకు తాళలేక కొన్ని నెలల క్రితం నరసన్నపేట మండలం లుకలాం గ్రామ వీఆర్వో మట్ట జోగారావు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంగతి అప్పట్లో సంచలనం కలిగించింది. అతను నందిగాం వీఆర్వోగా పనిచేసినప్పుడు టీడీపీ కార్యకర్తలు దొంగ పాసుపుస్తకాల తయారీ కోసం ఒత్తిడి తెచ్చారని, ఆ మాట విననందుకే మంత్రి అచ్చెన్నాయుడికి చెప్పి నరసన్నపేట మండలానికి బదిలీ చేయించారనే ఆరోపణలు వినిపించాయి. బదిలీల వెనుక కక్షసాధింపు... ఎచ్చెర్ల ఎంపీడీవో పంచాది రాధ జిల్లా నీటి యాజమాన్య సంస్థకు డిప్యూటేషన్‌పై వచ్చారు. కానీ ఇటు జెడ్పీ చైర్‌పర్సన చౌదరి ధనలక్ష్మి వర్గం, మరోవైపు మంత్రి కళావెంకటరావు వర్గం మధ్య పోరుతో ఇరువైపుల ఒత్తిళ్లను తట్టుకోలేక బదిలీ చేయించుకున్నారు.
తర్వాత పోస్టులోకి వచ్చిన నేతాజీ సైతం డిప్యూటేషన్‌పై వెళ్లిపోయారు. జి.సిగడాం మండలంలో మంత్రి కళా వర్గానికి చెందిన నాయకు ల ఒత్తిళ్ల కారణంగా జిల్లా ఎంపీడీవోల సంఘం అధ్యక్షుడుగా ఉన్న కొత్తకోట హేమసుందర్రావు పంచాయతీరాజ్ విభాగానికి డిప్యూటేషన్‌పై వెళ్లి పోయారు. రణస్థలం ఎంపీడీవో అలివేలు మంగమ్మ కూడా ఎంపీపీ గొర్లె విజయ్‌కుమార్ ఒత్తిడికి తట్టుకోలేక డిప్యూటేషన్‌పై పోలాకి వెళ్లిపోయారు. రణస్థలం ఎస్సై వినోద్‌బాబు స్థానిక టీడీపీ నాయకుడు ఈశ్వరరావు మాట వినలేదని బదిలీ చేయించారు. లావేరు తహశీల్దారు పప్పల వేణుగోపాలరావును మంత్రి కళా అనుచరులు బదిలీ చేయించారు.
అప్పటికి వేణుగోపాలరావు జిల్లా రెవెన్యూ సర్వీసుల సంఘం నాయకుడు కూడా. తన మాట వినలేదని ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ కంచిలి మండల వ్యవసాయాధికారి కె.సుకుమార్‌ను వజ్రపుకొత్తూరు మండలానికి బదిలీ చేయించారు. తహశీల్దార్ కళ్యాణచక్రవర్తిని పలాస మం డలానికి పంపిం చారు. ఆయన ఒత్తిళ్లకు తట్టుకోలేక ఎంఈవో బాలకృష్ణ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. కవిటి మండలంలో హౌసింగ్ ఇంజినీర్ కృష్ణమూర్తి, ఇచ్ఛాపురం మున్సిపల్ కమిషనర్ సీహెచ్ సత్యనారాయణ ఇలాంటి అనుభవాలతోనే బదిలీపై వెళ్లిపోయారు. మిగతా నియోజకవర్గాల్లోనూ అధికార పార్టీ నాయకుల వేధింపులు ఇదే స్థాయిలో ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.