shakapuram
-
సాగుబడిపై ప్రదర్శన
శాఖాపురం(నిడమనూరు) : సాగుబడిపై బొమ్మలద్వారా ప్రదర్శనను ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు గురువారం మండలంలోని శాఖాపురంలో ఏర్పాటు చేశారు. వ్యవసాయ విద్యాలయంలో బీఎస్సీ 4వ సంవత్సరం విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా మండలంలోని శాఖాపురంలో మూడునెలల పాటు రైతులతో కలిసి పని చేయనున్నారు. ఇందులో భాగంగా గ్రామ స్పరూపం, పొలాలకు సంబంధించిన వివిధ అంశాలను అందులో చేర్చారు. కార్యక్రమంలో విద్యార్థులు శివ, సంతోష్, శివకుమార్, ప్రశాంత్, రాజేష్, నాగరాజు పాల్గొన్నారు. -
శాఖపురంలో తాగు నీటి కష్టాలు
నిడమనూరు : మండలంలోని శాఖాపురంలో తాగు నీటి ఇబ్బందులు తీవ్రమయ్యాయి. స్కీం బోరులో నీటిలెవల్ తగ్గడం, గేట్ వాల్వ్ సక్రమంగా లేక పోవడంతో సమస్య తలెత్తింది. దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఇతరుల బోర్ల నుంచి తాగునీరు.. వర్షాలు లేక గ్రామంలో చేద బావులు అడుగంటాయి. బావుల్లో నీరు లేక పోవడంతో నివాస గృహాల్లో బోర్లు వేయించుకున్నారు. వాటిలో సైతం నీరు అందక మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. ఎంతో వ్యయం చేసి వేయించుకున్న బోర్లలో నీరు తగ్గడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గత రెండు కార్లుగా సాగు నీటికి నీటి విడుదల చేయకపోవడంతో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటాయి. ఇతరుల బోర్ల నుంచి నీటిని తీసుకుంటున్నారు. గ్రామ కంఠంలో వ్యవసాయబోర్లు.. మూలిగే నక్కమీద తాటికాయపడ్డట్లుగా గ్రామకంఠంలోనే వ్యవసాయాధారిత బోర్లను వేశారు. ఈ బోర్లను వ్యవసాయానికి వినియోగించుకుంటుండడంతో గ్రామంలో బావులు, బోర్లలో నీరు తగ్గిపోయాయి. గ్రామంలో సింగిల్ ఫేజ్ విద్యుత్‌తో బోర్లను నడిపించడంతో నిరంతరం నీటిని తోడుతున్నాయి. దీంతో ఇళ్లలో వేసుకున్న బోర్లలో మోటార్లకు నీరు అందకుండా పోతుంది. వ్యవసాయ బోర్లకు విద్యుత్ బిల్లులు సైతం లేక పోవడంతో విచ్చలవిడిగా వాడుతున్నారు. ఇంట్లో వేసిన బోరులో నీరు తగ్గింది : చిన్నాల రామకృష్ణ, శాఖాపురం గ్రామం చుట్టూ వ్యవసాయ బోర్ల కారణంగా ఇళ్లలో తాగు నీటి కోసం వేసుకున్న బోర్లలో నీరు తగ్గింది. ఇళ్లలో వాడుకోవడానికి నీరు సైతం లేక ఇతరుల బోర్ల నుంచి తెచ్చుకుంటున్నాం. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే తాగునీటి సమస్యను పరిష్కరించాలి.