ఒకేరోజు రెండు ప్రేమ జంటల ఆత్మహత్య
ఒకే రోజు రెండు ప్రేమజంటలు ఆత్మహత్యకు పాల్పడ్డాయి. ఈ హృదయ విదారక ఘటనలు రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్నాయి. కుటుంబ సభ్యులు మందలించారన్న బాధతో ఇరు జంటలు బలవన్మరణానికి పాల్పడ్డాయి.
– షాబాద్, కేశంపేట
ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని..
షాబాద్ మండలం లింగారెడ్డిగూడకు చెందిన కర్రె పల్లవి (19), పోచమోళ్ల మహేందర్ (21) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సంవత్సరం కిందట వీరిద్దరూ శంషాబాద్‌లో కలసి ఉండటాన్ని గమనించిన పల్లవి కుటుంబసభ్యులు మహేందర్ కుటుంబీకులను మందలించారు. అప్పుడే శంషాబాద్ పోలీసుస్టేషన్‌లోనూ ఫిర్యాదుచేశారు. పల్లవికి పెళ్లి సంబంధం చూడగా.. తనకు పెళ్లి ఇష్టం లేదని పల్లవి చెప్పింది. దీంతో పల్లవి, మహేందర్‌లు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆదివారం అర్ధరాత్రి ఇద్దరూ గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ బావి వద్దకు వెళ్లి, అక్కడ మామిడి చెట్టుకు పల్లవి చున్నితో ఇద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. సోమవారం ఉదయం తన పొలానికి వెళ్తున్న స్వరూప అనే మహిళ వీరిని గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహేందర్ పని మానేసి ఇంటి వద్దే ఉంటుండగా.. పల్లవి కుట్టు శిక్షణా కేంద్రంలో శిక్షణ తీసుకుంటోంది.
కులాలు వేరు కావడంతో..
కలసి జీవించాలనుకున్నారు. అందుకు పెద్దలు అడ్డు చెప్పారు. దీంతో కేశంపేట మండల పరిధిలోని తొమ్మిదిరేకులకు చెందిన నాగిళ్ల శ్రీరాములు(23) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గ్రామానికి చెందిన బత్తిని సుశీల (18) పదో తరగతి వరకు చదివి గ్రామంలో కూలీ పనులకు వెళ్తోంది. వీరిద్దరూ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం సుశీల కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో వారు సుశీలను నీలదీశారు. కులాలు వేరు కావడంతో వారు పెళ్లికి నిరాకరించినట్లు తెలిసింది. దీంతో సుశీల ఇంట్లోనే ఆదివారం రాత్రి చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సుశీల మృతి విషయం తెలుసుకున్న శ్రీరాములు గ్రామలోని మర్రిచెట్టు వద్దకు వెళ్లి తన స్నేహితుడికి ఫోన్ చేశాడు. తన ప్రేమికురాలు మరణించిందని, అందుకే తానూ చనిపోతున్నట్లు చెప్పి తమ వ్యవసాయ భూమి లోని మర్రిచెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.