Shanmukhapriya
-
ప్రియా సిస్టర్స్‌కు జీవన సాఫల్య పురస్కారం...
ప్రముఖ సంగీత విద్వాంసులు, ప్రియా సిస్టర్స్‌గా పేరొందిన అక్కాచెల్లెళ్లు హరిప్రియా, షణ్ముఖప్రియలకు జీవన సాఫల్య పురస్కార ప్రదానం చేస్తున్నారు. శ్రీ వాసవీ ఆర్ట్స్ ఆధ్వర్యంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, కె.రోశయ్య 91వ జయంతి సందర్భంగా నగరంలోని రవీంద్రభారతిలో సాయంత్రం 5.45గంటల నుంచి ఈ కార్యక్రమం జరుగనుంది. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. -
indian idol season 12: విజేత ఎవరు?
తెలుగమ్మాయి షణ్ముఖ ప్రియ సంగీత అభిమానులకు ఉత్కంఠనిస్తోంది. ఇండియన్ ఐడెల్ సీజన్ 12 టాప్ 6లో ఉన్న షణ్ముఖప్రియ ఆగస్టు 15న జరిగే ఫైనల్స్‌కు చేరినట్టే లెక్క. షో నిర్వాహకులు ఎలిమినేషన్స్ ఆపేసి ముగ్గురు గాయనులు, ముగ్గురు గాయకులతో ఫైనల్స్‌కు వెళ్లనున్నారని సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటివరకూ ఇండియన్ ఐడెల్‌ను ముగ్గురు స్త్రీలు గెలిచారు. ఈసారి ఫైనల్స్‌కు వెళుతున్న ముగ్గురిలో ఒకరు నాలుగోసారి టైటిల్ గెలుస్తారా? ఇంటర్ పాసైన షణ్ముఖ ప్రియ సంగీత ప్రియుల రివార్డులను డిగ్రీలుగా లెక్క వేస్తే చాలా డిగ్రీలు పాసైనట్టే లెక్క. వైజాగ్ మధురవాడలో నివాసం ఉండే తల్లిదండ్రులు శ్రీనివాస కుమార్, రత్నమాలల ఏకైక కూతురు షణ్ముఖ ప్రియ బహు భాషలలో చిన్నప్పటి నుంచి పాడటం ప్రాక్టీసు చేసింది. టీవీ షోస్‌లో పాల్గొని లెక్కకు మించి ప్రైజులు కొట్టింది. కాని అవన్నీ ఒకెత్తు. ఇప్పుడు ఇండియన్ ఐడెల్‌లో పాల్గొనడం ఒకెత్తు. ఒక్కసారి ఇండియన్ ఐడెల్ వేదికనెక్కితే దాదాపుగా భారతీయులు నివసించే అన్నీ దేశాలకు ఆ గాయకులు తెలిసి పోతారు. అంత పెద్ద వేదిక అది. భారీ కాంపిటీషన్‌ను ఎదుర్కొని పోటీలోకొచ్చిన షణ్ముఖ ప్రియ, ఆమెతో పాటు టాప్ సిక్స్‌లో నిలిచిన మరో ఇద్దరు గాయనులు అరుణిమ, సాయిలీ మేల్ సింగర్స్ పవన్‌దీప్, మహమ్మద్ దానిష్, నిహాల్ తౌరోకు గట్టి పోటీ ఇస్తున్నారు. సవాళ్లను ఎదుర్కొన్న షో నవంబర్ 28, 2020న సోనీ టీవీలో ఇండియన్ ఐడెల్ సీజన్ 12 అనేక వడపోతల తర్వాత మిగిలిన 15 మంది కంటెస్టెంట్లతో మొదలైంది. సాధారణంగా ఆరు నెలల్లో ముగిసే ఈ షో లాక్డౌన్ కారణాల రీత్యా, బయట మరో వినోదం లేకపోవడం వల్ల మరో మూడు నెలలు పొడిగింప బడింది. మధ్యలో గాయనీ గాయకులు కరోనా బారిన పడినా, షూటింగ్ లొకేషన్ ‘డమన్’ (గోవా) కు షిఫ్ట్ అవడం వల్ల జడ్జిలు మారినా ఒక్క వారం కూడా నాగా లేకుండా కొనసాగింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన గాయనీ గాయకుల్లో తెలుగు నుంచి శిరీష భాగవతుల, షణ్ముఖ ప్రియ గట్టి పోటీని ఇచ్చారు. శిరీష 11వ కంటెస్టెంట్‌గా ఎలిమినేట్ కాగా షణ్ముఖప్రియ టాప్ 6లో చేరింది. యోడలింగ్ క్వీన్ యోడలింగ్ చేయడంలో గాయకుడు కిశోర్ కుమార్ దిట్ట. యోడలింగ్ను గాయనులు చేయరు. అందుకు గొంతు అంతగా వీలు కాదు. కాని షణ్ముఖప్రియ యోడలింగ్లో మహామహులు దిగ్భ్రమ చెందే ప్రతిభను వ్యక్త పరిచింది. యోడలింగ్ చేస్తూ కిశోర్ కుమార్ పాడిన హిట్ సాంగ్ ‘మై హూ ఝుమ్ఝుమ్ ఝుమ్రు’ పాటను షణ్ముఖప్రియ అద్భుతంగా పాడి అందరినీ ఆకట్టుకుంది. షోకు గెస్ట్లుగా హాజరైన ఏ.ఆర్. రహమాన్, ఉదిత్ నారాయణ్, ఆశా భోంస్లే లాంటి పెద్దలు ఎందరో షణ్ముఖప్రియను అభినందించారు. స్టేజ్ మీదే సినిమా ఆఫర్లు కూడా ఇచ్చారు. అయితే అంతమాత్రాన ఆమెకు పోటీ లేదని కాదు. ఉంది. పవన్‌దీప్ మహమ్మద్ దానిష్ నిహాల్ తౌరో బెంగాల్, మహారాష్ట్రల పోటీ షణ్ముఖ ప్రియకు బెంగాల్ గాయని అరుణిమ, ముంబై గాయని సాయిలీ సమవుజ్జీలుగా ఉన్నారు. ముఖ్యంగా అరుణిమ దాదాపు లతా వారసురాలిగా పాడుతూ ఓట్లు పొందుతోంది. మరోవైపు సాయిలీ స్పీడ్, స్లో పాటలు కూడా ప్రతిభావంతంగా పాడుతూ అభిమానులను సంపాదించుకుంది. ముగ్గురూ ముగ్గురేగా వేదికపై సవాలు విసురుతుండటంతో జడ్జీలు ఎవరిని ఎలిమినేట్ చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. మన షణ్ముఖ ప్రియకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచ దేశాలలో ఉన్న తెలుగువారి నుంచి ఓట్ల మద్దతు రావాల్సి ఉంది. 12 గంటల పాటు ఫైనల్స్ ఆగస్టు 15న కనీవినీ ఎరగని స్థాయిలో 12 గంటల పాటు ఇండియన్ ఐడెల్ ఫైనల్స్ జరగనున్నాయి. అతిరథ మహారథులు ఈ ఫైనల్స్‌కు హాజరయ్యే అవకాశం ఉంది. ఆ వేదిక మీదనే ఈ ఆరు మంది ఫైనలిస్ట్‌లు ప్రతిభ చూపుతారు. లోకమంతా ఈ వేడుక వీక్షించనుంది. విజేతలకు 25 లక్షల నగదు బహుమతి ఉంటుంది. తెలుగు నుంచి గతంలో శ్రీరామచంద్ర ఈ టైటిల్ మొదటగా సాధించి తెలుగు ప్రతిభను చాటాడు. షణ్ముఖప్రియది తర్వాతి పేరు కావాలని ఆశిద్దాం. మగవారూ తక్కువ కాదు ఈసారి ఇండియన్ ఐడెల్ కిరీటాన్ని తన్నుకుపోతాడని అందరూ ఊహిస్తున్న పేరు ఉత్తరాఖండ్‌కు చెందిన పవన్ దీప్ది. ఇతను పాడటమే కాదు సకల వాద్యాలు వాయిస్తూ కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇతనికి ముంబై సెలబ్రిటీలందరూ ఫిదా అయిపోయారు. ఉత్తరాఖండ్ ఆహార్యంలో వినమ్రంగా కనిపించే పవన్ దీప్ పాటలో సోల్ ఉంటుంది. ఆ సోల్ అతనికి కిరీటం తెచ్చి పెట్టవచ్చని ఒక అంచనా. ఇతను కాకుండా ముజఫర్ నగర్‌కు చెందిన మహమ్మద్ దానిష్, మంగళూరుకు చెందిన నిహాల్ తోరో గట్టి ప్రతిభను చూపుతున్నారు. -
తెలుగు లేడీ కిశోర్ కుమార్
ఇండియన్ ఐడెల్ టాప్ 13కు చేరుకున్న తెలుగు అమ్మాయి షణ్ముఖప్రియ తాజా ‘ఆర్.డి.బర్మన్ – కిశోర్ కుమార్’ ఎపిసోడ్లో ‘దమ్ మారో దమ్’ పాట పాడింది. దాంతోపాటు కిశోర్ కుమార్ తన పాటల్లో చేసే యోడలింగ్ కూడా చేసింది. ప్రత్యేక ఆహ్వానితుడిగా వచ్చిన కిశోర్ కుమార్ తనయుడు అమిత్ కుమార్ షణ్ముఖప్రియ టాలెంట్‌ను చూసి అవాక్కయ్యాడు. ఆమెకు తన తండ్రి ఇష్టంగా తినే రబ్డీని స్వహస్తాలతో తినిపించాడు. విశేషాలు... ఇండియన్ ఐడల్ అంటే భారతీయ యువ సింగర్లకు అతి పెద్ద ప్లాట్‌ఫామ్. ఆ రియాలిటీ షోలో ఎంట్రీ దొరకడమే పెద్ద కష్టం. అలాంటిది టాప్ లిస్ట్‌లో నిలవడం ఇంకా కష్టం. ఆ కష్టాన్ని సాధ్యం చేశారు మన వైజాగ్‌కు చెందిన ఇద్దరు తెలుగు అమ్మాయిలు షణ్ముఖప్రియ, శిరీష భాగవతుల. ప్రస్తుతం వీరు టాప్ 13కు చేరుకున్నారు. టాప్ 10 చేరుకుంటారన్న ఆశను కూడా కలిగిస్తున్నారు. కాగా శనివారం (జనవరి16) జరిగిన ఎపిసోడ్లో షణ్ముఖ ప్రియ విశేషంగా అందరినీ ఆకర్షించింది. దానికి కారణం ఆ ఎపిసోడ్‌ను కిశోర్ కుమార్ – ఆర్.డి.బర్మన్ పాటలతో తీర్చిదిద్దారు. కిశోర్ కుమార్, అమిత్ కుమార్ ఈ ఎపిసోడ్‌కు స్పెషల్ గెస్ట్‌గా కిశోర్ కుమార్ కుమారుడు అమిత్ కుమార్ హాజరయ్యారు. ఆయన ముందు షణ్ముఖ ప్రియ ఆర్.డి.బర్మన్ కంపోజ్ చేసిన ‘దమ్ మారో దమ్’ పాడింది. ఆ తర్వాత కిశోర్ కుమార్ చేసే యోడలింగ్ ప్రదర్శించింది. ‘యోడలే.. యోడలే... యోడలే’ అని పాడేదే యోడలింగ్. అందులో షణ్ముఖ ప్రియ దాదాపు ఐదు నిమిషాల సేపు యోడలింగ్ చేసి అమిత్ కుమార్‌ను అవాక్కు చేసింది. ఆయన షణ్ముఖ ప్రియను మెచ్చుకున్నారు. ‘మా నాన్నకు రబ్డి తినడం అంటే చాలా ఇష్టం. ఆయన చనిపోవడానికి మూడు నాలుగు గంటల ముందు కూడా ఫ్రిజ్‌లో నుంచి రహస్యంగా రబ్డీ తీసి తినేశారు. ముంబైలోని ఒక షాప్ నుంచి ఆ రబ్డీని కొనేవారు. ఇవాళ అదే షాప్ నుంచి నేను తీసుకొచ్చిన రబ్డీని నీకు తినిపిస్తాను. ఆయన ఆశీర్వాదం నీకు తప్పక అందుతుంది’ అని షణ్ముఖ ప్రియకు రబ్డీ తినిపించారు అమిత్ కుమార్. ఈ సందర్భంగా ఆయన కిశోర్ కుమార్ గురించి కొన్ని ఆసక్తికరమైన విశేషాలు చెప్పారు. ‘నాన్న తన గొంతు కోసం అప్పుడప్పుడు ఎండిన తమలపాకులు తినేవారు. గొంతు డ్రైగా ఉంటే బాగా పాడొచ్చు అనుకునేవారు. పాట పాడాక చవన్‌ప్రాశ్ పుచ్చుకుని ఎంత తొందరగా రికార్డింగ్ థియేటర్ నుంచి బయటపడదామా అని చూసేవారు’ అన్నారు అమిత్ కుమార్. ఇక్కడ చవన్ ప్రాశ్ అంటే డబ్బులు. ప్రస్తుతం ఇండియన్ ఐడెల్ సీజన్ 12లోని టాప్ 13 కంటెస్టెంట్స్‌లో ఆరు మంది అమ్మాయిలు ఉన్నారు. వారిలో ఇద్దరు తెలుగువారు కావడం గొప్ప విషయం. మిగిలిన నలుగురు అంజలి గైక్వాడ్ (మహరాష్ట్ర), అరుణిత (పశ్చిమ బెంగాల్), శైలి కాంబ్లె (మహారాష్ట్ర), అనుష్క బెనర్జీ (చండీగఢ్). శిరీష భాగవతుల ఈ పోటీలో చిత్ర పాటలను పాడి ఆకట్టుకుంటూ ఉండగా షణ్ముఖప్రియ ఎనర్జీ నిండిన గీతాలతో ప్రతిభ చూపుతోంది. వీరిలో ఒకరైనా టాప్ 5కు చేరుకుంటే ప్రపంచ వ్యాప్తంగా ఈ షో చూస్తున్న భారతీయులలో వైజాగ్ పేరు రెపరెపలాడినట్టే. -
అమ్మానాన్నలే ఆదిగురువులు
ముద్దుముద్దు మాటలు... చిలకపలుకులను పోలిన సరిగమలతో సంగీత సంద్రాన్ని అలవోకగా దాటే ప్రయత్నం చేస్తోంది చిన్నారి షణ్ముఖప్రియ. సినీ సంగీత వినీలాకాశంలో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ సంగీత దర్శకులు, గాయకుల మన్ననలు పొందింది. పార్వతీపురం ఏరియాకు చెందిన సంగీత రంగ ప్రముఖులు సత్యం మాస్టారు, గణేష్‌పాత్రో, వంగపండు ప్రసాదరావు, ఆర్పీ పట్నాయిక్ తదితరుల తర్వాత ఈ ప్రాంతానికి పేరు తెచ్చేవారి జాబితాలో అతి చిన్న వయసులోనే చేరింది. బుల్లితెర గాయనిగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో వేలాది ప్రదర్శనలిస్తూ... అనేక మంది అభిమానుల్ని సంపాదించుకుంది. శాస్త్రీయ సంగీతంలోని ఓ రాగాన్నే తన పేరుగా మార్చుకున్న ఈ చిన్నారి వర్థమాన గాయనిగా రాణిస్తూనే, సీఏ చదవాలన్న లక్ష్యానికి అనుగుణంగా ముందుకుసాగుతోంది. ఇటీవల తన సొంత ఊరు పార్వతీపురం వచ్చిన ఆమె కొద్దిసేపు ‘సాక్షి’తో ముచ్చటించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... - పార్వతీపురం * గాయనిగా రాణిస్తున్న షణ్ముఖప్రియ * పన్నెండేళ్లకే ప్రత్యేక గుర్తింపు పొందిన పార్వతీపురం చిన్నారి * పోటీలో పాల్గొంటే విజయం ఖాయం * బుల్లితెర సింగర్‌గా ఎన్నో అవకాశాలు * ప్రముఖ సంగీత దర్శకులు, గాయకుల మన్ననలు సూర్యపీఠంతో ప్రారంభం పార్వతీపురంలోని సూర్యపీఠంలో నాలుగేళ్ల వయసులోనే అన్నమాచార్య కీర్తనలు ఆలపించాను. అక్కడి నుంచి నా రాగాలాపన కొనసాగుతూ వచ్చింది. జీ తెలుగు చానెల్ 2008లో నిర్వహించిన ‘జీ సరిగమప లిటిల్ చాంప్’లో విజేతగా నిలవడంతో వెలుగులోకి వచ్చాను. మా టీవీ సూపర్‌సింగర్-4(2008)లో ఫైనలిస్ట్‌గా నిలిచాను. తమిళ చానెల్ ‘స్టార్ విజయ్’ తమిళ్ జూనియర్ సూపర్ స్టార్స్ టైటిల్‌ను 2010లో పొందాను. ఇంట్లోనే శిక్షణ మొదలు నా తల్లిదండ్రులు రత్నమాల, శ్రీనివాసకుమార్ శాస్త్రీయ సంగీతంలో ఎంఏ పట్టాలు పొందారు. వారే నా తొలి గురువులు. మా నాన్న వయోలిన్, వీణా వాయిద్యంలో నిష్ణాతులు. నా అభిరుచిని గుర్తించి నాలుగేళ్ల వయసులో సంగీతంలో శిక్షణ ప్రారంభించారు. కర్ణాటక , కేరళ, తమిళనాడు చిన్నారులకు నిర్వహించిన జూనియర్ సూపర్‌స్టార్ సింగర్ పోటీలో టైటిల్ పొందాను. ప్రస్తుతం మా టీవీలో ప్రసారమవుతున్న సూపర్‌సింగర్ పోటీలో ఉన్నాను. ఈ పాటల వల్లే ప్రత్యేక గుర్తింపు.. బుల్లితెరపై పాటల పోటీల్లో నాకు కొన్ని పాటలు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. వాటిలో తమిళంలో ఇంజీఖరుపడగా.. (సన్నజాజీ...) ఇందమిసీమినిక్(ఈ ఎర్ర గులాబీ), కాదళ్ అనుగళి(రోబో), ‘పాడుతా తీయగా’లో గోపమ్మ చేతిలో గోరుముద్ద... నిదురపోరా తమ్ముడు.., ఎన్నెన్నో జన్మలబంధం తదితర పాటలతోపాటు గులాం అలీ గజల్స్ ఉన్నాయి. ఎంతటక్కరివాడో.. చాంగురే బంగారు రాజా... మొక్కజొన్నతోటలో.. నాగమల్లి కోనలోన... తదితర జానపద గీతాలు కూడా మంచి పేరు తెచ్చాయి. ప్రముఖుల ప్రశంసలు తమిళనాడు గవర్నర్ రోశయ్య, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డితోపాటు ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావుతోపాటు అనేక మంది ప్రముఖులు అభినందించడం మరువలేను. ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, చిత్ర, మాల్గడి శుభ, రమణ గోగుల, ఆర్పీ పట్నాయిక్ తదితరులెందరో ఆశీర్వదించడం అనిర్వచనీయమైన అనుభూతి. ఉపాధ్యాయుల సహకారం బాగుంది ప్రస్తుతం విశాఖలోని ఓ కార్పొరేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. పాటల పోటీల కారణంగా స్కూలుకు హాజరుకాలేకపోతే ఉపాధ్యాయులు ప్రత్యేకంగా పాఠాలు బోధిస్తున్నారు. చక్కగా సహకరిస్తున్నారు. అవార్డులు... రివార్డులు స్టార్ విజయ్ పోటీల్లో టైటిల్ సాధించడంతో పుదుచ్చేరిలో విల్లా ఇచ్చారు. దాదాపు 20 పోటీల్లో నగదు బహుమతులు పొందాను. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆత్మీయ పురస్కారం దక్కడం గొప్ప విషయం. సికింద్రాబాద్‌లో జరిగిన చిల్డ్రన్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్లో బెస్ట్ సింగర్ అవార్డు దక్కింది. వీటితోపాటు ఎక్కడ పోటీల్లో పాల్గొన్నా ఒక బహుమతి పొందడం ఆనందంగా ఉంది. సీఏ చదవాలని ఉంది భవిష్యత్‌లో సంగీత కళామతల్లికి సేవలో తరించాలని ఉంది. ప్లేబ్యాక్ సింగర్‌గా స్థిరపడాలని, సీఏ కోర్సు కూడా చేయాలని ఉంది. నా ఇష్టప్రకారం తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు. పార్వతీపురం మరచిపోలేని ప్రోగ్రాం చేస్తా నా సొంత ఊరు పార్వతీపురం మరచిపోలేని ప్రోగ్రాం చేస్తాను. పార్వతీపురం పెద్దలు సహకరిస్తే. సినీ ప్రముఖులను ఇక్కడికి తీసుకొచ్చి పెద్ద ప్రోగ్రాం చేస్తాను. త్వరలోనే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాను.