అమ్మానాన్నలే ఆదిగురువులు | Singer Shanmukhapriya story | Sakshi
Sakshi News home page

అమ్మానాన్నలే ఆదిగురువులు

Published Tue, Apr 12 2016 1:21 AM | Last Updated on Sun, Sep 3 2017 9:42 PM

అమ్మానాన్నలే ఆదిగురువులు

అమ్మానాన్నలే ఆదిగురువులు

ముద్దుముద్దు మాటలు... చిలకపలుకులను పోలిన సరిగమలతో సంగీత సంద్రాన్ని అలవోకగా దాటే ప్రయత్నం చేస్తోంది చిన్నారి షణ్ముఖప్రియ. సినీ సంగీత వినీలాకాశంలో తనదైన ముద్ర వేసుకున్న ప్రముఖ సంగీత దర్శకులు, గాయకుల మన్ననలు పొందింది. పార్వతీపురం ఏరియాకు చెందిన సంగీత రంగ ప్రముఖులు సత్యం మాస్టారు, గణేష్‌పాత్రో, వంగపండు ప్రసాదరావు, ఆర్పీ పట్నాయిక్ తదితరుల తర్వాత ఈ ప్రాంతానికి పేరు తెచ్చేవారి జాబితాలో అతి చిన్న వయసులోనే చేరింది.

బుల్లితెర గాయనిగా రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో వేలాది ప్రదర్శనలిస్తూ... అనేక మంది అభిమానుల్ని సంపాదించుకుంది. శాస్త్రీయ సంగీతంలోని ఓ రాగాన్నే తన పేరుగా మార్చుకున్న ఈ చిన్నారి వర్థమాన గాయనిగా రాణిస్తూనే, సీఏ చదవాలన్న లక్ష్యానికి అనుగుణంగా ముందుకుసాగుతోంది. ఇటీవల తన సొంత ఊరు పార్వతీపురం వచ్చిన ఆమె కొద్దిసేపు ‘సాక్షి’తో ముచ్చటించింది. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...
 - పార్వతీపురం


* గాయనిగా రాణిస్తున్న షణ్ముఖప్రియ
* పన్నెండేళ్లకే ప్రత్యేక గుర్తింపు పొందిన పార్వతీపురం చిన్నారి
* పోటీలో పాల్గొంటే విజయం ఖాయం
* బుల్లితెర సింగర్‌గా ఎన్నో అవకాశాలు
* ప్రముఖ సంగీత దర్శకులు, గాయకుల మన్ననలు

 
సూర్యపీఠంతో ప్రారంభం
పార్వతీపురంలోని సూర్యపీఠంలో నాలుగేళ్ల వయసులోనే అన్నమాచార్య కీర్తనలు ఆలపించాను. అక్కడి నుంచి నా రాగాలాపన కొనసాగుతూ వచ్చింది. జీ తెలుగు చానెల్ 2008లో నిర్వహించిన ‘జీ సరిగమప లిటిల్ చాంప్’లో విజేతగా నిలవడంతో వెలుగులోకి వచ్చాను. మా టీవీ సూపర్‌సింగర్-4(2008)లో ఫైనలిస్ట్‌గా నిలిచాను. తమిళ చానెల్ ‘స్టార్ విజయ్’ తమిళ్ జూనియర్ సూపర్ స్టార్స్ టైటిల్‌ను 2010లో పొందాను.
 
ఇంట్లోనే శిక్షణ మొదలు
నా తల్లిదండ్రులు రత్నమాల, శ్రీనివాసకుమార్ శాస్త్రీయ సంగీతంలో ఎంఏ పట్టాలు పొందారు. వారే నా తొలి గురువులు. మా నాన్న వయోలిన్, వీణా వాయిద్యంలో నిష్ణాతులు. నా అభిరుచిని గుర్తించి నాలుగేళ్ల వయసులో సంగీతంలో శిక్షణ ప్రారంభించారు. కర్ణాటక , కేరళ, తమిళనాడు చిన్నారులకు నిర్వహించిన జూనియర్ సూపర్‌స్టార్ సింగర్ పోటీలో టైటిల్ పొందాను. ప్రస్తుతం మా టీవీలో ప్రసారమవుతున్న సూపర్‌సింగర్ పోటీలో ఉన్నాను.  
 
ఈ పాటల వల్లే ప్రత్యేక గుర్తింపు..
బుల్లితెరపై పాటల పోటీల్లో నాకు కొన్ని పాటలు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. వాటిలో తమిళంలో ఇంజీఖరుపడగా.. (సన్నజాజీ...) ఇందమిసీమినిక్(ఈ ఎర్ర  గులాబీ), కాదళ్ అనుగళి(రోబో), ‘పాడుతా తీయగా’లో గోపమ్మ చేతిలో గోరుముద్ద... నిదురపోరా తమ్ముడు.., ఎన్నెన్నో జన్మలబంధం తదితర పాటలతోపాటు గులాం అలీ గజల్స్ ఉన్నాయి. ఎంతటక్కరివాడో.. చాంగురే బంగారు రాజా... మొక్కజొన్నతోటలో.. నాగమల్లి కోనలోన... తదితర జానపద గీతాలు కూడా మంచి పేరు తెచ్చాయి.
 
ప్రముఖుల ప్రశంసలు
తమిళనాడు గవర్నర్ రోశయ్య, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, మాజీ సీఎం కిరణ్‌కుమార్ రెడ్డితోపాటు ‘దర్శకరత్న’ దాసరి నారాయణరావుతోపాటు అనేక మంది ప్రముఖులు అభినందించడం మరువలేను. ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి, చిత్ర, మాల్గడి శుభ, రమణ గోగుల, ఆర్పీ పట్నాయిక్ తదితరులెందరో ఆశీర్వదించడం అనిర్వచనీయమైన అనుభూతి.
 
ఉపాధ్యాయుల సహకారం బాగుంది
ప్రస్తుతం విశాఖలోని ఓ కార్పొరేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాను. పాటల పోటీల కారణంగా స్కూలుకు హాజరుకాలేకపోతే ఉపాధ్యాయులు ప్రత్యేకంగా పాఠాలు బోధిస్తున్నారు. చక్కగా సహకరిస్తున్నారు.  
 
అవార్డులు... రివార్డులు
స్టార్ విజయ్ పోటీల్లో టైటిల్ సాధించడంతో పుదుచ్చేరిలో విల్లా ఇచ్చారు. దాదాపు 20 పోటీల్లో నగదు బహుమతులు పొందాను. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆత్మీయ పురస్కారం దక్కడం గొప్ప విషయం. సికింద్రాబాద్‌లో జరిగిన చిల్డ్రన్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్‌లో బెస్ట్ సింగర్ అవార్డు దక్కింది. వీటితోపాటు ఎక్కడ పోటీల్లో పాల్గొన్నా ఒక బహుమతి పొందడం ఆనందంగా ఉంది.  
 
సీఏ చదవాలని ఉంది
భవిష్యత్‌లో సంగీత కళామతల్లికి సేవలో తరించాలని ఉంది. ప్లేబ్యాక్ సింగర్‌గా స్థిరపడాలని, సీఏ కోర్సు కూడా చేయాలని ఉంది. నా ఇష్టప్రకారం తల్లిదండ్రులు ప్రోత్సహిస్తారు.  
 
పార్వతీపురం మరచిపోలేని  ప్రోగ్రాం చేస్తా

నా సొంత ఊరు పార్వతీపురం మరచిపోలేని ప్రోగ్రాం చేస్తాను. పార్వతీపురం పెద్దలు సహకరిస్తే. సినీ ప్రముఖులను ఇక్కడికి తీసుకొచ్చి పెద్ద ప్రోగ్రాం చేస్తాను. త్వరలోనే ఆ దిశగా ప్రయత్నాలు చేస్తాను.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement