Shantipriya
-
ఎంతగానో ప్రేమించా, పెళ్లి చేసుకున్నా, కానీ నన్ను వదిలేసి..: నటి
ప్రముఖ నటి భానుప్రియ చెల్లెలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శాంతిప్రియ. తనదైన నటనతో కొద్దికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మహర్షి చిత్రంతో తెలుగు తెరపై అడుగుపెట్టిన ఆమె ఎన్నో సినిమాల్లో నటించింది. మహర్షి మూవీలో మాట రాని మౌనమిది.. పాటలో ఆమె పలికించిన హావభావాలు అందరినీ కట్టిపడేశాయి. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్ విశేషాలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంది. 'సౌత్‌లోనే కాకుండా హిందీలో కూడా నటించాను. బాలీవుడ్లో ఏడాదిన్నర కాలంలోనే ఐదారు సినిమాలు చేశా. ఆ సమయంలో సిద్దార్థ్ రాయ్‌తో ప్రేమలో పడ్డా, ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. పెళ్లి తర్వాత సినిమాలు చేయకూడదని ఎవరూ చెప్పలేదు, కానీ నేనే ఇక ఇల్లాలిగా ఉండిపోదామనుకున్నాను. భర్త చనిపోయాక నేనొక షాక్‌లో ఉండిపోయాను. ముంబైలో నాకంటూ ఎవరూ లేరు, దీంతో నేను ఇల్లు దాటి బయటకు రాలేదు. ఆ బాధలో నుంచి బయటకు రావడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. అమ్మ, అక్క, అన్నయ్య, నా పిల్లలు నాకు అండగా నిలబడ్డారు. చెన్నై వచ్చేయమన్నారు, కానీ నేను నా కాళ్ల మీద నేను నిలబడాలనుకున్నాను. అమ్మ కూడా సింగిల్ పేరెంట్ కావడంతో తనను చూసి ధైర్యంగా ఉండటం నేర్చుకున్నాను. ఈ మధ్యే ధారావి బ్యాంక్ అనే ఓటీటీ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాను. వెంకటేశ్‌తో ఒక్క సినిమా అయినా చేయాలనుకున్నాను, కానీ అది కుదరలేదు' అని చెప్పుకొచ్చింది శాంతిప్రియ. -
సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న భానుప్రియ చెల్లెలు
తమిళసినిమా: నటి నిశాంతి గుర్తుందా? భానుప్రియ సోదరి శాంతి ప్రియనే ఈ నిశాంతి. 1990 ప్రాంతంలో కోలీవుడ్‌లో కథానాయకిగా ఒక వెలుగు వెలిగిన నటి నిశాంతి. తన నటన, పాత్రధారణలతో పక్కింటి అమ్మాయి ఇమేజ్ను సొంతం చేసుకున్నారు. ఎంగ ఊరు పాటకారన్, నేరం నల్లా ఇరుక్కు, రైలుక్కు నేరమాచ్చు, సిగరెట్టు, తాళి వంటి పలు చిత్రాల ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే నటించినా తెలుగులోనూ పేరు తెచ్చుకున్నారు. కాగా వివాహానంతరం నటనకు దూరమై, సంసార జీవితంపై దృష్టి సారించిన నిశాంతి చాలా గ్యాప్ తరువాత మళ్లీ నటించడానికి సిద్ధమయ్యారు. ఇటీవల ధారవి బ్యాంక్ అనే వెబ్ సిరీస్‌లో నటించారు. ఇందులో బాలీవుడ్ నటుడు సునిల్శెట్టికి చెల్లెలిగా పొన్నమ్మ పాత్రలో ముఖ్యమైన పాత్రను పోషించారు. ఈ వెబ్‌సిరీస్ ఎంఎక్స్ ప్లేయర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ పాత్రలో తన నటనకు మంచి ప్రశంసలు అందుకోవడం ఆనందంగా ఉందని నిశాంతి పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం సరోజిని నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న సరోజిని నాయుడు ది అన్ సాంగ్ ప్రీడమ్ ఫైటర్ అనే చిత్రంలో టైటిల్ పాత్రను పోషిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇకపై తమిళం, తెలుగు భాషల్లో వరుసగా చిత్రాల్లో నటించనున్నట్లు వెల్లడించారు. -
అక్షయ్‌పై ఆరోపణలు.. నటి క్లారిటీ
ముంబై: బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ తన శరీర రంగుపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని నటి శాంతిప్రియ ఓ ఇంటర్యూలో చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో నటి స్పందిస్తూ సోమవారం ట్విటర్ వేదికగా స్పష్టత ఇచ్చారు. ‘అక్షయ్ నాకు మంచి స్నేహితుడు. ఎప్పుడు నాతో సరదాగా ఉంటాడు. ఈ క్రమంలోనే నాపై అలా సరదాగా కామెంట్ చేశాడు. అంతే తప్పా నన్ను బాధించాలని చేసిన వ్యాఖ్యలు కాదు. కానీ ఎదుటి వ్యక్తి రంగుపై సరదాగా వేసిన జోక్స్ కూడా వారిని అసౌకర్యానికి గురిచేస్తుందన్న విషయాన్ని మాత్రమే చెప్పాలనుకున్నాను. తప్ప అక్షయ్‌పై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. నేను ఎప్పుడు ఆయన మంచి కోరే వ్యక్తిని’ అని ట్వీట్ చేశారు. (బాలీవుడ్‌కీ హోమ్ డెలివరీ) కాగా శాంతిప్రియ ఇటీవల నవభారత్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ‘‘నేను ఎప్పుడు స్కిన్ కలర్ స్టోకింగ్స్(మేజోళ్లు) ధరించేదాన్ని. ఒకసారి షూటింగ్లో అక్షయ్ నా మోకాళ్ల ముందరి భాగం నల్లగా కనిపించడంతో నీకు అక్కడ రక్తం గడ్డకట్టిందా అని చమత్కరించారు. దీంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వారు. అయితే అవి సరదాగా చేసిన వ్యాఖ్యలని నాకు తెలుసు. కానీ అప్పుడు నాకు చాలా అసౌకర్యంగా అనిపించింది. అక్కడే గట్టిగా ఏడ్చాను కూడా’’ అని చెప్పారు. అంతేగాక ‘‘నేను బాలీవుడ్ పరిశ్రమకు వచ్చాక నా రంగే నాకు శత్రువైంది. ఇక్కడ నేను చాలా వివక్షను ఎదుర్కొన్నాను. నా ఆత్మవిశ్వాసం దెబ్బతింది, ఒత్తిడికి గురయ్యాను. కొంతకాలం తర్వాత, నా సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, చివరికి నా సినీ కెరీర్ ముగిసింది’’ అని చెప్పారు. కాగా శాంతిప్రియ, అక్షయ్ కుమార్‌లు కలిసి ‘ఇక్కే పె ఇక్కా’, ‘సౌగంధ్’ చిత్రాలలో నటించారు. (సినిమాలపై దావూద్ ప్రభావం) I want to make it clear, making those comments were @akshaykumar's way of being playful with me. Even though his comments stayed with me for a while, I believe he didn't mean to hurt me or cause me distress. I adore all of his work and wish him love & luck for his future! https://t.co/iISv0SVBno — shanthipriya (@iamshanthipriya) June 30, 2020 -
అత్తింటి ఆగడాలకు అబల బలి
ఆడపిల్ల పుట్టిందని వేధింపులు వివాహిత అనుమానాస్పద మృతి ఆత్మహత్య చేసుకుందంటున్న అత్తింటివారు హత్యే అంటున్న మృతురాలి కుటుంబసభ్యులు విజయవాడ క్రైం/గుణదల, న్యూస్‌లైన్ : ఆడపిల్ల పుట్టిందని అత్తింటివారు పెడుతున్న వేధింపులు ఓ వివాహితను బలిగొన్నాయి. ఆత్మహత్య చేసుకుందని అత్తింటి వారు చెబుతుంటే.. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తునారు. విజయవాడలో సంచలనం కలిగించిన ఈ ఘటన ఎల్ఐసీ కాలనీలో గురువారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ ఎల్ఐసీ కాలనీకి చెందిన ఇనుమల నరేష్‌బాబు ఆటోనగర్‌లో ఆటోమొబైల్స్ షాపు నిర్వహిస్తుంటాడు. రెండున్నరేళ్ల కిందట బంటుమిల్లి మండలం నీలిపూడికి చెందిన శాంతిప్రియ (23)తో అతనికి వివాహమైంది. వివాహ సమయంలో ప్రియ కుటుంబసభ్యులు నరేష్ కుటుంబానికి లాంఛనాలు భారీగానే కట్టబెట్టారు. వీరి వివాహమైన కొద్ది రోజులకు నరేష్ తండ్రి అప్పారావు మృతిచెందారు. దీంతో ఆమె అడుగుపెట్టిన వేళావిశేషం మంచిది కాదంటూ అవమానించి సూటిపోటి మాటలతో వేధించేవారు. ఈ నేపథ్యంలో పెద్దలు జోక్యం చేసుకొని నచ్చచెప్పారు. అప్పటి నుంచి తన తండ్రి తన కొడుకు రూపంలో పుడతాడని నరేష్‌బాబు అంటుండేవాడు. అయితే ఏడాది తర్వాత నరేష్ దంపతులకు ఆడపిల్ల పుట్టింది. దీంతో శాంతిప్రియకు అత్తింటివారి వేధింపులు ఎక్కువయ్యాయి. నరేష్ అత్తింటి వారితో సంబంధాలు నెరపడం కూడా పూర్తిగా మానేశాడు. పండగలకు, పబ్బాలకు కూడా భార్యను ఒంటరిగానే పంపేవాడు. అనేకమార్లు అత్తింటివారు బతిమిలాడినా నరేష్ ప్రవర్తనలో మార్పు రాకపోగా.. తల్లి ఇందుమతితో కలిసి వేధింపులు ఎక్కువ చేశాడు. ఈ క్రమంలో శాంతిప్రియ గురువారం విగతజీవురాలై కనిపించింది. మధ్యాహ్నం సమయంలో శాంతిప్రియ ఉరేసుకుందని చెప్పి ఇరుగు పొరుగును పిలిచారు. వారు వచ్చిన తర్వాత కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు చెప్పడంతో ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆమె పుట్టింటికి కబురు చేశారు. ఆమె మృతి సమాచారం తెలిసిన వెంటనే హుటాహుటిన తల్లిదండ్రులు, బంధువులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈలోగా సమాచారం అందుకున్న మాచవరం సీఐ సీహెచ్ మురళీకృష్ణారెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విచారణ కోసం మృతురాలి భర్త, అత్తను అదుపులోకి తీసుకున్నారు. చంపేశారు... తొలి నుంచి శాంతిప్రియను అనేక ఇబ్బందులు పెట్టారని, ఆడపిల్ల పుట్టడంతో ఆమెను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి బంధువులు ఆరోపించారు. గతంలో కూడా వీరు పెట్టే వేధింపులు పలుమార్లు తమ దృష్టికి తీసుకొచ్చినా నచ్చచెప్పి పంపామని, ఇంతటి అఘాయిత్యం జరుగుతుందనుకుంటే పంపేవాళ్లం కాదని వారు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ‘పోస్టుమార్టం’ ఆధారంగా చర్యలు... ప్రాథమికంగా సేకరించిన సమాచారం మేరకు అనుమానాస్పద కేసుగా నమోదు చేశాం. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. - సీహెచ్.మురళీకృష్ణారెడ్డి, సీఐ, మాచవరం పోలీస్‌స్టేషన్ -
అచ్చు బొమ్మలు
అమ్మాయిలను ‘అచ్చు బొమ్మ’లా ఉన్నావంటూ... రకరకాల పోలికలు చెబుతుంటారు.చీరలపై ‘అచ్చు’తో అందమైన బొమ్మలు వేస్తే... చూపరులు సైతం బొమ్మల్లా ఉండిపోవాల్సిందే! ఆ చీరలను కట్టుకున్న అతివలు... కుందనపుబొమ్మల్లా మెరిసిపోవాల్సిందే!హ్యాండ్లూమ్, సిల్క్, పట్టు... మెటీరియల్ ఏదైనా...వేసే డిజైన్‌లో సృజన ఉంటే బామ్మనైనా భామనైనా ‘అచ్చు’ చీరలే ఆకట్టుకుంటాయి. కుచ్చిళ్ల భాగంలో మల్టీకలర్ ఇక్కత్, ఓణీ భాగంలో పసుపురంగు కోటా, అంచుగా బ్లాక్ సీక్వెన్స్ మెటీరియల్‌ను జత చేశారు. దీంతో అటు సంప్రదాయం, ఇటు ఆధునికతల సమ్మేళనంతో చీర ఆకర్షణీయంగా మారింది. ఓణీ భాగంలో జత చేసిన వస్త్రానికి పసుపు రంగును అద్ది,పువ్వులను ‘అచ్చు’గా వేశారు. ఆకుపచ్చ, వంగపండు రంగుల కలయికతో రూపుదిద్దుకున్న హ్యాండ్లూమ్ శారీ ఇది. టెంపుల్ డిజైన్ వచ్చిన బార్డర్ పైన అద్దిన ఆకుపచ్చని ‘అచ్చు’తో ఈ చీర మరింత గ్రాండ్‌గా మారింది. సాదా క్రీమ్ కలర్ టస్సర్ సిల్క్ చీరపై కేరళ మురుగ ఆర్ట్ కనువిందు చేస్తోంది. పెన్ కలంకారి డిజైన్ అనిపించేలా ‘అచ్చు’ వేసి, ఈ డిజైన్‌ను శోభాయమానంగా రూపుకట్టారు. నలుపు, ఎరుపు మేళవింపుతో ఉన్న కోటా చీరపై తెల్లని నెమళ్ల ప్రింట్ ఆకట్టుకుంటుంది. కథాకళి నాట్య భంగిమలను ‘అచ్చు’గా రూపుకట్టి ఈ చీరను అందంగా తీర్చిదిద్దారు. లేత ఆకు పచ్చరంగు చీరకు కనకాంబరపు అంచును జత చేసి, ఆకుపచ్చని లతలు, పువ్వుల శోభ వచ్చేలా ‘అచ్చు’ వేశారు. వేసవిని కూల్ చేసే ఇలాంటి చీరలు ఆధునిక యువతులకు అందమైన అలంకరణ. డ్రెస్ కర్టెసీ: అనుపమ స్నేహాస్ కలర్స్ అండ్ ప్రింట్స్, సిద్ధార్థనగర్, హైదరాబాద్ మోడల్స్: క ల్పన, శాంతిప్రియ ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్