అచ్చు బొమ్మలు | Today Fashion Mold toys | Sakshi
Sakshi News home page

అచ్చు బొమ్మలు

Published Wed, Feb 19 2014 10:41 PM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM

Today Fashion Mold toys

అమ్మాయిలను ‘అచ్చు బొమ్మ’లా ఉన్నావంటూ... రకరకాల పోలికలు చెబుతుంటారు.చీరలపై ‘అచ్చు’తో అందమైన బొమ్మలు వేస్తే... చూపరులు సైతం బొమ్మల్లా ఉండిపోవాల్సిందే! ఆ చీరలను కట్టుకున్న అతివలు... కుందనపుబొమ్మల్లా మెరిసిపోవాల్సిందే!హ్యాండ్లూమ్, సిల్క్, పట్టు... మెటీరియల్ ఏదైనా...వేసే డిజైన్‌లో సృజన ఉంటే బామ్మనైనా భామనైనా ‘అచ్చు’ చీరలే ఆకట్టుకుంటాయి.
 
కుచ్చిళ్ల భాగంలో మల్టీకలర్ ఇక్కత్, ఓణీ భాగంలో పసుపురంగు కోటా, అంచుగా బ్లాక్ సీక్వెన్స్ మెటీరియల్‌ను జత చేశారు. దీంతో అటు సంప్రదాయం, ఇటు ఆధునికతల సమ్మేళనంతో చీర ఆకర్షణీయంగా మారింది. ఓణీ భాగంలో జత చేసిన వస్త్రానికి పసుపు రంగును అద్ది,పువ్వులను ‘అచ్చు’గా వేశారు.
 
 ఆకుపచ్చ, వంగపండు రంగుల కలయికతో రూపుదిద్దుకున్న హ్యాండ్లూమ్ శారీ ఇది. టెంపుల్ డిజైన్ వచ్చిన బార్డర్ పైన అద్దిన ఆకుపచ్చని ‘అచ్చు’తో ఈ చీర మరింత గ్రాండ్‌గా మారింది.
 
 సాదా క్రీమ్ కలర్ టస్సర్ సిల్క్ చీరపై కేరళ మురుగ ఆర్ట్ కనువిందు చేస్తోంది. పెన్ కలంకారి డిజైన్ అనిపించేలా ‘అచ్చు’ వేసి, ఈ డిజైన్‌ను శోభాయమానంగా రూపుకట్టారు.
 
 నలుపు, ఎరుపు మేళవింపుతో ఉన్న కోటా చీరపై తెల్లని నెమళ్ల ప్రింట్ ఆకట్టుకుంటుంది. కథాకళి నాట్య భంగిమలను ‘అచ్చు’గా రూపుకట్టి ఈ చీరను అందంగా తీర్చిదిద్దారు.
 
 లేత ఆకు పచ్చరంగు చీరకు కనకాంబరపు అంచును జత చేసి, ఆకుపచ్చని లతలు, పువ్వుల శోభ వచ్చేలా ‘అచ్చు’ వేశారు. వేసవిని కూల్ చేసే ఇలాంటి చీరలు ఆధునిక
 యువతులకు అందమైన అలంకరణ.
 
 డ్రెస్ కర్టెసీ: అనుపమ
 స్నేహాస్ కలర్స్ అండ్ ప్రింట్స్, సిద్ధార్థనగర్, హైదరాబాద్
 మోడల్స్: క ల్పన, శాంతిప్రియ
  ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement