హీరోలు చితకబాదేవారు, నాపై నాకే అసహ్యం వేసేది: నటుడు
తెలుగు, తమిళ, హిందీ, పంజాబీ, మలయాళ భాషల్లో కలిపి 300కు పైగా చిత్రాల్లో నటించాడు శరత్ సక్సేనా. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా సత్తా చాటిన ఆయన టాలీవుడ్లో ఘరానా మొగుడు, ఎస్పీ పరశురాం, సింహాద్రి, బన్నీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కెరీర్ మధ్యలో బాలీవుడ్‌ను పక్కన పెట్టి సౌత్ ఇండస్ట్రీలో బిజీ అయిన ఆయన అందుకు గల కారణాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.
హీరోల ఇంట్రడక్షన్ సీన్లో కొట్టించుకోవడమే పని..
ముంబైలో నాకు మంచి పని దొరకడం లేదు, అందుకే సౌత్‌లో పని చేస్తున్నాను. అక్కడ నాకు కేవలం ఫైట్ సీన్లు మాత్రమే ఇచ్చేవారు. పొద్దున్నే లేచి అద్దం ముందుకు వెళ్లి చూసుకుంటే నాపై నాకే అసహ్యం కలిగేది. ఎందుకంటే ఇప్పుడు రెడీ అయి సెట్స్‌కు వెళ్లగానే హీరోలతో దెబ్బలు తినాలి. అందుకే నా ముఖం కూడా నాకు నచ్చేది కాదు. చాలామటుకు హీరోలను పరిచయం చేసే సీన్లో మమ్మల్ని ప్రవేశపెడతారు. అప్పుడు అతడు వచ్చి మమ్మల్ని చితకబాది హీరో అవుతాడు. గత 30 ఏళ్లుగా ఇదే నా పని.
చిరంజీవిని కలిశా..
ఒకరోజు నేను హిందీలో సినిమాలు మానేద్దామనుకున్నా.. నా భార్యను మనదగ్గర డబ్బుందా? అని అడిగాను. ఉంది, దానితో ఏడాదిపాటు బతికేయొచ్చు అని చెప్పింది. ఆరోజు నుంచే నేను హిందీ సినిమాలు మానేశాను. కానీ దేవుడి దయ వల్ల నేను ఆ నిర్ణయం తీసుకున్న రెండు, మూడు రోజులకే కమల్ హాసన్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. గుణ(1991) సినిమాలో నాకు మంచి పాత్రతో పాటు అందుకు సరిపోయే డబ్బు కూడా ఇచ్చారు. హిందీలో గూండా రాజ్ సినిమా చేస్తున్నప్పుడు చిరంజీవిని కలిశా. అలా తెలుగులోనూ వర్క్ చేశాను. పది, పదిహేను చిత్రాలు చేశాను. నాగార్జునతోనూ కలిసి పని చేశా. మలయాళంలో ప్రియదర్శన్‌తో కలిసి ఐదారు సినిమాల్లో నటించాను' అని చెప్పుకొచ్చాడు.
చదవండి: హీరో విజయ్‌ది రియల్ హెయిరా? విగ్గా? క్లారిటీ ఇదే!