హెచ్‌సీఎల్ టెక్ లాభం 1,783 కోట్లు
- 3 శాతం క్షీణత
- ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్
న్యూఢిల్లీ: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కంపెనీ ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు రూ.1,783 కోట్ల నికర లాభం(కన్సాలిడేటెడ్) ఆర్జించింది. అంతకు ముం దటి ఏడాది ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ.1,834 కోట్లు)తో పోల్చితే 3 శాతం క్షీణత నమోదైందని కంపెనీ పేర్కొంది. విక్రయ, సాధారణ, నిర్వహణ వ్యయాలు అధికంగా ఉండడం వల్ల నికర లాభం తగ్గిపోయిందని వివరించింది. గత ఏప్రిల్-జూన్ క్వార్టర్లో రూ.8,424 కోట్లుగా ఉన్న ఆదాయం(కన్సాలిడేటెడ్) ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు 16 శాతం వృద్ధితో రూ.9,777 కోట్లకు పెరిగిందని ప్రెసిడెంట్, సీఈఓ అనంత్ గుప్తా చెప్పారు.
ఈ కంపెనీ జూలై-జూన్ ఆర్థిక సంవత్సరాన్ని పాటిస్తోంది. ఇక డాలర్ రూపేణా కంపెనీ నికర లాభం 9 శాతం క్షీణించింది. గత ఏప్రిల్-జూన్ క్వార్టర్లో 31 కోట్ల డాలర్లుగా ఉన్న నికర లాభం ఈ ఏడాది ఏప్రిల్-జూన్ క్వార్టర్‌కు 28 కోట్ల డాలర్లకు తగ్గిందని అనంత్ గుప్తా తెలిపారు. ఆదాయం 140 కోట్ల డాలర్ల నుంచి 9 శాతం వృద్ధితో 153 కోట్ల డాలర్లకు పెరిగిందని తెలిపారు. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం 12 శాతం వృద్ధితో 116 కోట్ల డాలర్లకు, ఆదాయం 11 శాతం వృద్ధితో 595 కోట్ల డాలర్లకు పెరిగాయని వివరించారు.
రెండంకెల్లో వృద్ధి
2014-15లో తమ కంపెనీ అన్ని విభాగాల్లో రెండంకెల వృద్ధిని సాధించిందని గుప్తా పేర్కొన్నారు. కొత్తగా చేరిన 9,448 మంది ఉద్యోగులతో మొత్తం సిబ్బంది సంఖ్య 1,06,107కు పెరిగిందని తెలిపారు. జూన్ 30, 2015తో ముగిసిన పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికర లాభం రూ.6,369 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ.7,254 కోట్లకు, ఆదాయం రూ.32,917 కోట్ల నుంచి 13 శాతం వృద్ధితో రూ.37,061 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. కాగా కంపెనీ ఒక్కో షేర్‌కు రూ.5 డివిడెండ్‌ను ప్రకటించింది. కంపెనీ డివిడెండ్ ప్రకటించడం వరుసగా 50వ క్వార్టర్.
ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడంతో కంపెనీ షేర్ ఎన్ఎస్ఈలో 6 శాతం క్షీణించి రూ.939 వద్ద ముగిసింది.