షేర్ఖాన్లో బీఎన్పీ పారిబా మరిన్ని పెట్టుబడులు
ముంబై: ఫ్రాన్స్ ఆర్థిక దిగ్గజం బీఎన్పీ పారిబా ఇటీవలే కొనుగోలు చేసిన రిటైల్ బ్రోకింగ్ సంస్థ షేర్ఖాన్లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నది. ఐదేళ్లలో షేర్ఖాన్లో 7 కోట్ల యూరోల (సుమారుగా రూ.449 కోట్ల)పెట్టుబడులు పెడతామని బీఎన్పీ పారిబా తెలిపింది. బ్రోకరేజ్ సంస్థ జియోజిత్ నుంచి వైదొలగడం లేదని స్పష్టం చేసింది.
షేర్ఖాన్ డిజిటల్ ప్లాట్ఫార్మ్ను అప్గ్రేడ్ చేయడం కోసం 1.5–2 కోట్ల యూరోలు(రూ.105–140 కోట్లు) ఖర్చు చేయనున్నామని బీఎన్పీ పారిబా గ్రూప్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు టెర్రీ లబొర్డే చెప్పారు. డిజిటల్ ప్లాట్ఫార్మ్ అప్గ్రేడ్ కారణంగా ప్రస్తుతం 14 లక్షలుగా ఉన్న వినియోగదారుల సంఖ్య రెట్టింపై 29 లక్షలకు చేరగలదని పేర్కొన్నారు. షేర్ఖాన్ కొనుగోలు చేసినప్పటికీ, తమకు ప్రస్తుతం 32.6 శాతం వాటా ఉన్న జియోజిత్ నుంచి వైదొలగబోమని బీఎన్పీ పారిబా ఇండియా సీఈఓ, కంట్రీ హెడ్ జోరిస్ డెరిక్స్ తెలిపారు.