మరోసారి అరెస్ట్ అయిన ఇరోం షర్మిల
ఇంపాల్ : మణిపూర్ హక్కుల కార్యకర్త ఇరోం చాను షర్మిల మరోసారి అరెస్ట్ అయ్యారు. మణిపూర్‌లో అమల్లో ఉన్న వివాదాస్పద సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం (ఏఎఫ్ఎస్పీఏ)పై తన పోరాటాన్ని విస్తృతం చేయడానికి ప్రయత్నిస్తున్న ఆమెను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షర్మిల ఆత్మహత్యకు యత్నిస్తున్నందున అరెస్ట్ చేసినట్లు మణిపూర్ అడిషినల్ డీజీ సంతోష్ తెలిపారు. కాగా కోర్టు ఆదేశాలతో రెండు రోజుల క్రితమే షర్మిల జైలు నుంచి విడుదలయ్యారు.
అమానుష చట్టమైన ఏఎఫ్‌ఎస్‌పీఏకు వ్యతిరేకంగా ఆమె గత 14 ఏండ్లుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఇంఫాల్‌లోని జవహర్లాల్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ హాస్పిటల్‌లోని ఓ గదిని ప్రత్యేక జైలుగా మార్చి.. పోలీసు నిర్బంధంలో ఆమెకు ఇన్నాళ్లు ముక్కు ద్వారా ద్రవ ఆహారాన్ని అందించారు. సాయుధ దళాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని రద్దుచేయాలని కోరుతూ 2000 సంవత్సరం నవంబర్‌లో ఆమె ఈ దీక్ష ప్రారంభించారు.