సింహాలై కదలాలి
*రాజన్న రాజ్యం కోసం జగనన్న వెంట నడవాలి: షర్మిల పిలుపు
* రాబోయే ఎన్నికల్లో గెలుస్తున్నాం
* జగనన్న బాణాన్ని..
* ఎంతటి లక్ష్యాన్నైనా పూర్తి చేసుకొస్తా
* జగనన్నపై కక్ష గట్టారు.. బలిపశువును చేయాలనుకున్నారు
* అయినా అన్న ఆత్వవిశ్వాసం కోల్పోలేదు.. బోనులో ఉన్నా సింహం సింహమేనని నిరూపించుకున్నారు
సాక్షి, కడప: ‘‘రాబోయే ఎన్నికలు రాష్ట్రంతో పాటు దేశానికి కీలకం. అందరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారు. ప్రత్యర్థులకు ధన బలం ఉంది. కానీ, వారికి లేనిది మనకు మాత్రమే ఉన్నది ప్రజా బలం. దేవుని దయ. వైఎస్ రెక్కల కష్టంతో వచ్చిన ఈ ప్రభుత్వం ఆయన సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తోంది. ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసింది. అంతేకాదు... తెలుగుజాతి గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టారు. ఈ క్రమంలో అందరూ పిడికిలి బిగించాలి. ఢిల్లీ పెద్దల గూబ గుయ్యిమనేలా తీర్పు చెప్పాలి.
వచ్చే ఎన్నికల్లో మనం తప్పకుండా గెలుస్తున్నాం. ఎందుకంటే నేను పాదయాత్ర చేసే సమయంలో ప్రజల కళ్లలో మాపై ప్రేమే కాదు.. విజయాన్ని కూడా చూశాను. ఈ కీలక సమయంలో జగనన్న వెంట ఒక్కొక్కరూ ఒక్కో సింహమై కదలాలి. జగనన్నను సీఎం చేయాలి. రాజన్న రాజ్యాన్ని తెచ్చుకోవాలి’’ అని షర్మిల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఇడుపులపాయలో ఆదివారం జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రెండో ‘ప్రజాప్రస్థానం (ప్లీనరీ)’లో షర్మిల ప్రసంగించారు. ఆమె మాటల్లోనే.. ‘‘రాజన్నపై అభిమానం, జగనన్నపై నమ్మకం ఉంచి రెండోసారి పార్టీ అధ్యక్షుడిగా జగనన్నను ఎన్నిక చేసిన అందరికీ కృతజ్ఞతలు. నాలుగేళ్లుగా కష్టకాలంలో మా వెంట ఎంతో మంది నడిచారు. మాకు అండగా నిలబడి.. కష్టనష్టాల్లో, బాధల్లో పాలు పంచుకున్నారు. రాజకీయాల్లో నిజాయితీ తేవాలన్న జగన్ ఆశయానికి చేయి కలిపారు. ఇతర పార్టీల బెదిరింపులకు లొంగకుండా వైఎస్సార్సీపీని బలపరిచారు. కులాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఓ కుటుంబంలా పనిచేశారు. మళ్లీ రాజన్న రాజ్యం రావాలని కోరుతున్న అందరికీ అభినందనలు.’’
నాలుగేళ్లలో అమ్మలో ఎంతో మార్పు..
‘‘నాలుగేళ్లుగా అమ్మ (విజయమ్మ) ఎంత నేర్చుకుందో.. తనను తాను ఎంత మలుచుకుందో ఆలోచిస్తే ఆశ్చర్యమేస్తుంది. అసలు అమ్మేనా అనిపిస్తుంది. నాన్న బతికి ఉన్నపుడు ఆమెకు ఇల్లు, మేము, నాన్నే లోకం. కానీ నాన్న దూరమైన తర్వాత అమ్మ ఎంత చేసిందో.. సాధించిందో.. తలుచుకుంటే చేతులు జోడించి నమస్కరించాలనిపిస్తుంది.’’
అన్నలో ఇంత నిబ్బరం ఉందని జైలుకెళ్లాక తెలిసింది...
‘‘జగనన్నను ఎంత ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు. పదవులు ఇస్తామన్నారు. ఓదార్పు యాత్ర ఆపాలన్నారు. కానీ అన్న లొంగలేదు, ప్రజలే ముఖ్యమని భావించారు. దీంతో జగనన్నపై కక్షగట్టారు. సీబీఐని అడ్డుపెట్టుకుని వెంటాడారు. సోదాల పేరుతో కుటుంబాన్ని అవమానించారు. మహానేత పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఆఖరుకు అన్నను జైలుకు పంపారు. భవిష్యత్తును నాశనం చేయాలని చూశారు. బలిపశువును చేయాలనుకున్నారు. వారు ఇంతచేసినా.. జగన్ ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు.
బోనులో ఉన్నా సింహం సింహమే అని నిరూపించుకున్నారు. జగనన్న ఇంత నిబ్బరంగా ఉంటారని అప్పటివరకూ నాకే తెలియదు. దేశంలోనే శక్తివంతమైన వారితో పోరాడుతున్నానని, రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకుని కుట్రలు పన్నుతున్న దుర్మార్గులతో పోరాడుతున్నానని జగన్‌కు తెలుసు. అయినా కుంగిపోలేదు. ఇంత దమ్ము, ధైర్యం, విశ్వాసం ఉన్నవాడు కాబట్టే ప్రజాదరణతో వైఎస్సార్సీపీని ఇంత దూరం తీసుకొచ్చారు.’’
పేదల కళ్లలో నీళ్లు తుడవాలనే తపన..
‘‘రాష్ట్రం చేసుకున్న దురదృష్టం వైఎస్ లేకపోవడం. కానీ, అలాంటి గొప్ప నాయకుడిని జగన్ రూపంలో దేవుడు ఇవ్వడం మన అదృష్టం. త్వరలో జగన్‌లో నాన్నను చూస్తారు. నాన్నలాగా అన్న సంక్షేమ పాలన అందిస్తారు. వైఎస్ రెక్కల కష్టంతో.. రాష్ట్రంలో, దేశంలో రెండుసార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ నాన్న పోయిన తర్వాత సంక్షేమ పథకాలకు తూట్లు పెట్టారు. వైఎస్ అనే మహావృక్షం కూలిపోయి నాలుగేళ్లయింది. ఈ క్రమంలో రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అయింది. మార్పు రావాలి. ఈ కష్టాలకు కారణమైన వారికి గుణపాఠం చెప్పాలి. జగనన్న సీఎం కావాలి. అందుకోసం అందరూ మీలో నిద్రపోతున్న పౌరుషాన్ని తట్టిలేపాలి.
ఒక్కొక్కరూ ఒక్కో సింహమై జగనన్న వెంట కదలాలి. వికలాంగులు, వృద్ధులు, మైనార్టీలు, మహిళలు.. అందరూ సుఖంగా బతికే రోజులు రావాలి. వచ్చే ఎన్నికల్లో రాజన్న రాజ్యం రావాలని కోట్లాది గుండెలు కోరుకుంటున్నాయి. ఈ ఎన్నికలు తొమ్మిది కోట్ల మంది భవితను నిర్దేశించే ఎన్నికలు. మనది ధర్మం, మంచి కోసం చేస్తున్న పోరాటం. నేను జగనన్న చేతిలోని బాణాన్ని.. ఎప్పుడు వదిలితే అప్పుడు ఎందాకైనా దూసుకెళ్తా! ఏదైనా సాధించుకుని వస్తా! అందరం అలుపెరగని పోరాటం చేద్దాం. రాజన్న కలలను సాకారం చేద్దాం. రాజన్న లక్ష్యమే జగనన్న యజ్ఞం. జై జగన్...జై తెలుగుతల్లి.’’
రాధాకృష్ణా.. నైతిక విలువలు లేవా?
ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై షర్మిల నిప్పులు చెరిగారు. ‘‘నాకు, వైవీ సుబ్బారెడ్డికి అన్యాయం జరిగిందని, మమ్మల్ని జగన్ తొక్కేస్తున్నారంటూ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఎల్లో మీడియా కనీస నైతిక విలువలు లేకుండా ఇష్టమెచ్చినట్లు విషప్రచారం చేస్తున్నారు. కానీ, మమ్మల్ని ఎంపీలుగా నిలబడాలని జగనన్న ఎప్పుడో చెప్పారు. మేమే వద్దన్నాం. ఈ విషయాన్ని ఇంటర్వ్యూల్లోనూ స్పష్టంగా చెప్పాం. అయినా ఎల్లో మీడియా చెవికెక్కలేదు. దున్నపోతు మీద వానపడ్డట్లు ప్రవర్తించారు. వాన పడిన విషయం దున్నపోతుకు తెలియదు.. వాస్తవం ఎల్లో మీడియాకు తెలియదు’’ అని మండిపడ్డారు. ఈ విషయాలను వైవీ సుబ్బారెడ్డిని పక్కన పెట్టుకుని షర్మిల చెప్పారు.
చిన్న పిల్లాడినడిగినా చెబుతారు
‘‘సమైక్యాంధ్ర కోసం జగన్ చిత్తశుద్ధితో పోరాటం చేయలేదని ఆరోపిస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం ఎవరు పోరాడుతున్నారో రాష్ట్రంలో చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు. సమైక్యం కోసం వైఎస్సార్సీపీ తరఫున సీమాంధ్రలోని 175 మంది నియోజకవర్గ సమన్వయకర్తలు దీక్షలు చేశారు. ఆర్టికల్-3ని సవరించాలని కోరుతూ జగనన్న అన్ని జాతీయ పార్టీల నేతల ఇళ్ల తలుపులు తట్టారు. రాష్ట్రాన్ని విడదీస్తోంది సోనియా.. అందుకు మార్గం సుగమం చేసింది సీఎం కిరణ్.. విభజించాలని లేఖ ఇచ్చింది చంద్రబాబు.. వీళ్లు కాదా రాష్ట్రాన్ని విడదీసేది.’’
హరీ సిగ్గు లేదా..
‘‘సమైక్యాంధ్రపై జగన్‌కు చిత్తశుద్ధి లేదని సబ్బం హరి కూడా అంటున్నారు. సబ్బం హరీ.. సిగ్గులేదా? విభజనకు పూనుకున్న కాంగ్రెస్‌లో నువ్వు ఎందుకు కొనసాగుతున్నావు. అవాస్తవ ఆరోపణలు చేసే మరో ప్రబుద్ధుడు రఘురామకృష్ణరాజు. రాజూ.. నువ్వు సిగ్గులేకుండా విభజనకు మొగ్గుచూపుతున్న బీజేపీలో ఎందుకు చేరావు?’’