మంటపుట్టిస్తాయి.. పారిపోయేలా చేస్తాయి
► భూత్ ఝలోకియా మిరపకాయలతో బాంబులు
► గుంపులు చెదరగొట్టేందుకు, మహిళల రక్షణకు ఉపయోగం
► డీఆర్డీవో శాస్త్రవేత్త శశి బాలా సింగ్
తిరుపతి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అల్లర్ల సమయంలో పోలీసులు, పారామిలటరీ దళాలు భాష్పవాయు గోళాలు వాడటం, పరిస్థితి చేయి దాటితే బుల్లెట్లు ప్రయోగించడం గురించి మనకు తెలుసు. కానీ ఇకపై ఆందోళనకారులను చెదరగొట్టేందుకు మిర్చిబాంబులు వాడనున్నారు. అసోంలో పండే భూత్ ఝలోకియా రకం మిరపకాయలతో డీఆర్డీవో వీటిని తయారు చేస్తోంది. ఈ బాంబులను జమ్మూ కశ్మీర్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ల్లో గుంపులను చెదర గొట్టేందుకు ఉపయోగించినట్లు డీఆర్డీవో లైఫ్ సైన్సెస్ విభాగం డైరెక్టర్ జనరల్ డాక్టర్ శశి బాలా సింగ్ తెలిపారు. సైన్స్ కాంగ్రెస్‌లో బుధవారం జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న శశి బాలాసింగ్ ‘సాక్షి’తో మాట్లాడారు. భూత్ ఝలోకియా ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిర్చి అని, దాని ఘాటుకు కారణమైన రసాయనాలను వేరు చేసి ఈ బాంబులు తయారుచేసినట్లు ఆమె తెలిపారు. ఈ బాంబుల నుంచి వచ్చే ఘాటుతో పాటు మంట వల్ల గుంపును చెల్లాచెదురు చేయవచ్చన్నారు.
ఈ రసాయనాలను పెప్పర్ స్ప్రేల రూపంలో వాడేందుకూ అవకాశముందని, మహిళలు స్వీయ రక్షణకు ఈ పెప్పర్స్ప్రేలను వినియోగించుకోవచ్చ న్నారు. హిమాలయాలతో పాటు సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉండే ప్రదేశాల్లో సాధారణ పంటలు పండించేందుకు కొన్ని పద్ధతులను అభివృద్ధి చేసినట్లు తెలిపారు. సియాచిన్ తో పాటు హిమాలయ పర్వత ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే సైనికులు ప్రాణవాయువు కోసం ఇబ్బంది పడుతుంటారని, ఈ సమస్యను అధిగమించేందుకు సరికొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసినట్లు డాక్టర్ శశి బాలా సింగ్ తెలిపారు. ఆక్సిజన్ తక్కువగా ఉండే అలాంటి ప్రాంతాల్లో సైనికులకు ప్రాణవాయువు అందించేందుకు గానూ సోలార్ చాంబర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు.