అతివేగం తెచ్చిన తంటా
చౌడేపల్లె: అతివేగం రెండు ప్రాణాలను బలి గొంది. మరొకరిని తీవ్ర గాయాలపాలు చేసిం ది. ఈ ఘటన చౌడేపల్లె-పుంగనూరు మార్గం లోని ఠాణా కొత్తయిండ్లు సమీపంలో గురువారం చోటుచేసుకుంది. రామసముద్రం మం డలం కొండూరు గ్రామానికి చెందిన సీఆర్.నారాయణరెడ్డి, అతని భార్య శశికళ ఏపీ03 బీజే909 నంబరు గల బొలేరో వాహనంలో తిరుపతిలోని కొడుకు కూతురును చూసేందుకు బయలుదేరారు.
అక్కడ మధ్యాహ్నం వరకు గడిపి కొండూరుకు చౌడేపల్లె మీదుగా తిరుగు ప్రయాణమయ్యారు. వాహనం వేగంగా వస్తుండడం, చిన్నపాటి వర్షం పడుతుండడంతో ఠాణాకొత్తయిండ్లు సమీపంలోని మలుపు వద్ద అదుపు తప్పింది. డ్రైవర్ వాహనాన్ని అదుపు చేయలేకపోయాడు. రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొన్న వాహనం అదే వేగంతో లోతైన ప్రదేశంలోకి దూసుకెళ్లింది. పెద్ద శబ్దం రావడంతో అక్కడికి చేరుకున్న స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు.
వారు వెళ్లి వాహనంలోని ముగ్గురిని బయటకు తీశారు. శశికళ(48) అప్పటికే మృతిచెందింది. తీవ్రగాయాలపాలైన నారాయణరెడ్డి, డ్రైవర్ మాలేనత్తంకు చెందిన సురేంద్రను పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డ్రైవర్ మృతిచెందాడు. నారాయణరెడ్డిని మెరుగైన వైద్యం కోసం కోలారు మెడికల్ కళాశాలకు తరలించారు.
డ్రైవర్‌కు నెలుగు నెలల క్రితం వివాహమైంది. అతని మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి సాగరంలో మునిగి పోయారు. నారాయణరెడ్డి కుదురుచీమనపల్లె సర్పంచ్‌గా పనిచేశారు. వైఎస్సార్ సీపీలో కొనసాగుతున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు.