వీడియో హల్చల్: పోలీసులపై వేటు
షాజహాన్‌పూర్: యువతితో సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో ఓ యువకుడికి స్థానికుల సాయంతో యాంటీ రోమియో బృందం గుండు గీస్తున్నా అడ్డుకోకుండా చూస్తూ ఉన్నందుకు ముగ్గురు పోలీసులు సస్పెండయ్యారు. ఉత్తరప్రదేశ్ లోని అజీజ్గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎస్పీ కేవీ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక సౌత్‌సిటీ కాలనీలో ఓ యువజంట తిరుగుతున్నట్లు అక్కడి వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఈ మేరకు ముగ్గురు కానిస్టేబుళ్లు, యాంటీ రోమియో స్క్వాడ్ అక్కడికి చేరుకున్నారు. వారు అక్కడికి వెళ్లేసరికే ఆ జంటను స్థానికులు పట్టుకుని బంధించారు.
యువతిని వెంటేసుకుని తిరుగుతున్నావంటూ యాంటీ రోమియో స్క్వాడ్ ఆ యువకుడికి గుండుగీశారు. ఆ కానిస్టేబుళ్లు చూస్తూ ఊరుకున్నారే తప్ప అడ్డుకునే యత్నం చేయకపోగా.. ఓ కానిస్టేబుల్ ఈ దృశ్యాన్ని తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఆ వీడియోను తన ఫ్రెండ్‌కు పంపాడు. ఈ క్రమంలో ఈ వీడియో వైరల్ అయింది. దీంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు రావటంతో సుహేల్ అహ్మద్, లాయక్ అహ్మద్, సోన్పాల్ అనే కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. కానిస్టేబుళ్లను వెనకేసుకొచ్చేందుకు యత్నించిన అజీజ్గంజ్ పోలీస్‌స్టేషన్ ఇన్చార్జి కేకే చౌదరిపై విచారణకు ఆదేశించారు.
ఈ మొత్తం ఘటనపై యూపీ ప్రభుత్వం స్పందించింది. ఈవ్‌టీజింగ్ పేరుతో యువతను ఇబ్బంది పెట్టొందంటూ పోలీసులకు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. యాంటీ రోమియా స్వ్కాడ్ సిబ్బంది మోరల్ పోలిసింగ్ పేరుతో ఇలాంటివి చేయవద్దని హెచ్చరికలు జారీచేసింది.