ప్రకృతి భాష... ఋతు ఘోష
తాజా పుస్తకం
కాలాన్ని అనుసరించిన కవి గుంటూరు శేషేంద్ర శర్మ. మారుతున్న చరిత్రకూ, చింతనకూ ఆహ్వానం పలికిన అచ్చమైన కవి ఆయన. ఆయనను రుతువులు ఆకర్షించకుండా ఎలా ఉంటాయి? దాని ఫలితమే ‘ఋతు ఘోష’ పద్యకావ్యం. ఈ కావ్య రచన జరిగి యాభయ్ సంవత్సరాలు పూర్తి కావడం మరో విశేషం. ఆయన పద్య కవిత్వం నుంచి వచన కవిత్వానికి ప్రయాణించారు. ఆయన కథకుడు, నాటక కర్త. గొప్ప వ్యాసకర్త. ఇదంతా కాల ప్రభావం. కానీ ఛందోబద్ధ కవిత్వంలోనూ ఆయన తన గొంతును కాపాడుకున్నారు. ‘ఋతు ఘోష’లో అదే కనిపిస్తుంది.
‘చిక్కని చిగురాకు జీబులో పవళించి యెండు వేణువు కంఠమెత్తి పాడె’
(వసంతరుతువు)
అని చదువుకున్నపుడు ఛందస్సుల సవ్వడులేవీ మనకు అనుభవానికిరావు.
‘నిర్మలాకాశంపు నీలాటి రేవులో
పండువెన్నెల నీట పిండి ఆరేసిన
తెలిమబ్బు వలువలు తేలిపోతున్నాయి’
(శరత్తు)
‘బండలు లాగుచుం బ్రతుకు
భారము మోయు నభాగ్యకోట్లు నా
గుండెలలోన నగ్నదరి
కొల్పుము తీవ్ర నిదాఘవేళన్’
అని కూడా ఎలుగెత్తి చాటగల కలం శేషేంద్రది. ఛందస్సు, భాషల పరిధి దాటి కవిత్వాన్ని ఆస్వాదించగలిగేవాళ్లంతా ‘ఋతు ఘోష’ ను వినగలరు.
ఇది చిన్న కావ్యమే. కానీ శేషేంద్ర
రచనల మీద కొన్ని విశ్లేషణలను కూడా ఇందులో చేర్చారు.
‘ఋతు ఘోష’ /శేషేంద్ర/ నవోదయ, కాచిగూడ, హైదరాబాద్/పే 108, వెల రూ. 100/-
- గోపరాజు