రజనీకాంత్ 'లింగా' షూటింగ్ వివాదం
బెంగళూరు : కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సాగర తాలూకా లింగనమక్కి జలాశయం వద్ద తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'లింగా' సినిమా షూటింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం వివాదానికి దారితీసింది. రాష్ట్రంలోని అతి పెద్ద జలాశయాలలో ఒకటైన ఈ జలాశయం ఉగ్రవాదుల హిట్‌లిస్టులో ఉంది. దీంతో ప్రభుత్వం ఆ జలాశయం ఉన్న ప్రదేశాన్ని సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించి భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
జలాశయం, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వద్ద ప్రజల ప్రవేశాన్ని ప్రభుత్వం నిషేధించింది. అలాంటి చోట సినిమా షూటింగ్‌కు అనుమతి ఇవ్వడం వివాదానికి దారితీసింది. సినిమా షూటింగ్లో నిత్యం వందలాది మంది పాల్గొనే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులలో సినిమా చిత్రీకరణకు ఎలా అవకాశం ఇచ్చారని పలువురు ప్రశ్నిస్తున్నరాఉ. అనుమతి ఎవరు ఇచ్చారో తెలపాలంటూ కర్ణాటక విద్యుత్ కార్పొరేషన్ (కేపీసీ) అధికారులకు కొందరు సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం కింద దరఖాస్తు చేసుకున్నారు. ఇది స్థానిక కేపీసీ అధికారులకు పెద్ద తలనొప్పిగా తయారైంది.