ఆందోళన.. ఉద్రిక్తత
న్యాయం చేయాలని మృతుని బంధువుల రాస్తారోకో
3 సెంట్ల స్థలం, రూ. 10 లక్షలు చెల్లించాలని డిమాండ్
కంకిపాడు : పునాదిపాడు వద్ద శుక్రవారం రాత్రి జరిగిన స్వల్ప వివాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి శనివారం ఉదయం మృతిచెందాడు. దీందో మృతుని బంధువులు, గ్రామస్తులు కంకిపాడు సెంటర్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వివరాల్లోకి వెళితే.. కోలవెన్ను గ్రామానికి చెందిన కొల్లూరు సాంబశివరావు (38)పై పునాదిపాడుకు చెందిన దేవరపల్లి కిరణ్ శుక్రవారం రాత్రి దాడి చేయడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాంబశివరావు శనివారం ఉదయం మృతిచెందాడు. దీంతో మృతుని బంధువులు తమకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించారు. మూడు సెంట్ల స్థలం, రూ. 10 లక్షలు చెల్లించాలని గ్రామ పెద్దలు పోలీసులకు వివరించారు.
ఈ క్రమంలో మృతదేహాన్ని అతని బంధువులు స్వగ్రామమైన గడ్డిపాడు తీసుకెళ్తున్నారని సమాచారం రావడంతో మృతుడి భార్య బంధువులు, గ్రామస్తులు పోలీసుస్టేషన్‌కు సమీపంలోని జాతీయ రహదారిపై రాస్తారోకోకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయడంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ సీఐ శ్రీధర్, ఎస్ఐ హనీష్లను నిలదీశారు. మృతదేహాన్ని అతని బంధువులే తీసుకెళ్లారని, తిరిగి కోలవెన్ను రప్పించేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట
ఈ క్రమంలో ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మంత్రులు ఘటనాస్థలానికి రావాలని పట్టుబడుతూ గ్రామస్తులు మరోమారు ఆందోళనకు దిగారు. డీసీపీ కోయ ప్రవీణ్, ఏసీపీ విజయభాస్కర్, ఇతర అధికారులు ఆందోళనకారులతో చర్చించారు. చర్చలు జరుగుతున్న తరుణంలోనే డీసీపీ ప్రవీణ్ ఒక్కొక్కరినీ తోసుకుంటూ వెళ్లడం, చేయి చేసుకోవడంతో మిగిలిన పోలీసు సిబ్బంది కూడా రోప్‌ల సాయంతో ఆందోళనకారులను రోడ్డుపై నుంచి తొలగిం చారు. ఈ క్రమంలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. స్పృహ కోల్పోయిన మృతుడి భార్య బుజ్జిని ఆసుపత్రికి తరలించాలనే నెపంతో బాధిత కుటుంబీకులు, గ్రామస్తులు అడ్డుపడుతుండగా బుజ్జిని 108 వాహనంలో తరలించారు. ఖనన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నామని గడ్డిపాడు వాసులు చెప్పటంతో ఎంతో కాలంగా కోలవెన్నులోనే ఉంటున్నారని, భార్య బుజ్జి వచ్చి నిర్ణయం చెప్పాలనడంతో అందరూ సరేనన్నారు. వైద్య చికిత్స చేయించుకుని గ్రామానికి చేరుకున్న బుజ్జి కోలవెన్నులో ఖననం చేయాలని చెప్పడంతో వివాదం సమసింది.
ప్రభుత్వపరంగా ఆదుకుంటాం
ప్రభుత్వ పరంగా మృతుడు సాంబశివరావు కుటుంబాన్ని ఆదుకునేందుకు అన్ని చర్యలూ తీసుకుంటామని డీసీపీ కోయ ప్రవీణ్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేవరపల్లి కిరణ్, సాంబశివరావు మధ్య పునాదిపాడు వద్ద రోడ్డు దాటే క్రమంలో గొడవ జరిగిందన్నారు. మృతుడి పిల్లలను సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చేర్చి ఉన్నత విద్య అందేలా చూస్తామన్నారు. ఆందోళనకారులను ఎమ్మెల్యే బోడె ప్రసాద్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.