shortage of essential drugs
-
కరోనా గుప్పిట్లో రష్యా
చైనా సరిహద్దుగా ఉండడంతో అందరి కంటే ముందే స్పందించింది. అంతర్జాతీయ సరిహద్దుల్ని మూసేసింది. అంతా ప్రశాంతం అనుకున్నారు. కానీ నివురు గప్పిన నిప్పులా వైరస్ కమ్మేసింది. ఇప్పుడు కరోనా గుప్పిట్లో విలవిలలాడుతోంది. రష్యాకి ఎందుకీ దుస్థితి ? కరోనా వైరస్ ప్రపంచ దేశాలను భయపెట్టిన తొలి రోజుల్లో చైనాకు సరిహద్దుగా ఉన్నప్పటికీ రష్యాలో పెద్దగా కేసులు నమోదవలేదు. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో వైరస్ తగ్గుముఖం పడుతూ ఉంటే రష్యాలో కేసులు భయపెడుతున్నాయి. గత వారం పది రోజులుగా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. రష్యా ప్రధానమంత్రి మిఖాయిల్ మిషూస్టిన్, సాంస్కృతిక మంత్రి ఓల్గా లూంబిమోవాస్, గృహనిర్మాణ మంత్రి వ్లాదిమర్ యకుషేవ్లు వైరస్ సోకి ఆస్పత్రి పాలయ్యారు. లాక్డౌన్ ఆలస్యమే కొంప ముంచుతోందా ? కరోనా వైరస్ తీవ్రతని ప్రపంచ దేశాలు గుర్తించక ముందే రష్యా గుర్తించింది. తొలి కేసు కూడా నమోదు కాకుండానే జనవరి 30న చైనాతో సరిహద్దుల్ని మూసేసింది. జనవరి 31న రష్యాలో రెండు కేసులు నమోదయ్యాయి. మార్చి 13 తర్వాత ఐరోపా దేశాలతో కూడా రాకపోకలు నిలిపివేసింది. కానీ దేశంలో లాక్డౌన్ అమలు చేయడంలో ఆలస్యం చేసింది. మార్చి 28 వరకు లాక్డౌన్ ప్రకటించలేదు. ప్రకటించిన తర్వాత కూడా కఠినంగా అమలు చేయడంలో విఫలమైంది. ప్రజలు బయటకొచ్చి ఇష్టారాజ్యంగా తిరగడం, ప్రజల్లో ఈ వైరస్ ఎంత ప్రమాదకారో పూర్తిగా అవగాహన కొరవడడం వంటి కారణాలతో కేసులు పెరిగిపోయాయి. ఇప్పుడు జర్మనీ, ఫ్రాన్స్‌ను కూడా దాటేసి ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో అయిదో స్థానానికి ఎగబాకింది. ఆరోగ్య వ్యవస్థ మేడిపండేనా ? రష్యాలో ఆరోగ్య వ్యవస్థకి కోవిడ్‌ను ఎదుర్కొనే సామర్థ్యం లేదేమోనన్న అనుమానాలైతే ఉన్నాయి. ప్రతీ వెయ్యి మందికి ఎనిమిది కంటే ఎక్కువ ఆస్పత్రులు ఉన్నప్పటికీ సదుపాయాలు అరకొరగా ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. 40 లక్షలకి పైగా పరీక్షలు చేశామని అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ చెబుతున్నారు. కానీ అన్ని పరీక్షలు జరగలేదని యూరప్ మీడియా కథనాలు రాస్తోంది. చైనా బాటలోనే నడుస్తూ తన అధ్యక్ష స్థానాన్ని పదిలపరుచుకోవడం కోసం రాజ్యాంగ సవరణలకు వీలుగా రిఫరెండం చేపట్టాలన్న ఏర్పాట్లలో ఉన్న పుతిన్‌కు కరోనా రూపంలో ఎదురుదెబ్బ తగిలింది. 2036 వరకు అధ్యక్షుడిగా తానే కొనసాగాలన్న ఆరాటంలో రాజ్యాంగ సవరణ చేపట్టే ప్రయత్నాల్లో ఉన్న పుతిన్ పాలనాపరమైన అంశాలన్నీ గాలికి వదిలేశారన్న విమర్శలున్నాయి. కోవిడ్ కారణంగా రిఫరెండంను వాయిదా వేసినప్పటికీ వైరస్‌ను ఎదుర్కొనే సన్నద్ధత లేకపోవడంతో ఒక్కసారిగా కేసులు విజృంభించాయి. దీంతో వైద్య విద్యనభ్యసిస్తున్న విద్యార్థులే వైద్య సేవలు అందిస్తున్నారు. వారికి పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్ల కొరత ఉండడంతో విధులు నిర్వహించడానికి భయపడుతున్నారు. మాస్కో నుంచి 10 లక్షల మందికి పైగా వలస దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగానికిపైగా రాజధాని మాస్కోలోనే ఉన్నాయి. దీంతో మాస్కో నుంచి 10 లక్షల మందికి పైగా వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు. కరోనా ముప్పుకి ముందే దేశం ఆర్థికంగా ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటోంది. జీడీపీ 5 శాతానికి పడిపోయింది. రాజకీయ, ఆర్థిక ఒడిదుడుకుల్లో ఉన్న రష్యా ఆరోగ్యపరమైన సంక్షోభాన్ని గుర్తించలేకపోవడంతో కరోనా కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. -
కమీషన్ల కక్కుర్తి
ఎంజీఎంలో అత్యవసర ఔషధాల కొరత తేలుకాటు, గుండెజబ్బు మందుల్లేవ్ బయట షాపుల్లో కొనుగోలు చేస్తున్న రోగులు సాధారణ మందులకూ ఇదే పరిస్థితి సాక్షి, హన్మకొండ : ఉత్తర తెలంగాణలో పెద్దదిగా గుర్తింపు పొందిన మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రి(ఎంజీఎం)లో అత్యవసర మందుల కొరత నెలకొంది. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగులకు అందించే అత్యవసర ఔషధాలు(లైఫ్ సేవింగ్ డ్రగ్స్) లేక ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ మందులు ప్రైవేట్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. కమీషన్ల వేట.. జిల్లా ఔషధ నియంత్రణ కేంద్రం నుంచి సరఫరా లేని మందుల కొనుగోలుకు ఎంజీఎం ఆస్పత్రికి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించింది. ఈ డబ్బుతో అత్యవసర మందులు కొనుగోలు చేయాల్సి ఉండగా.. ఎంజీఎం స్టోర్స్ సిబ్బంది కమీషన్లు వచ్చే ఔషధాల కొనుగోళ్లపైనే శ్రద్ధ చూపిస్తున్నారు. ఫలితంగా అత్యవసర మందులు ఎల్లవేళలా అందుబాటులో ఉండటం లేదు. తేలుకాటు, పాముకాటు, గుండేపోటు తదితర అత్యవసర పరిస్థితులలో రోగులకు అందించే ఔషధాలను కమీషన్లతో ముడిపెట్టడం ఇక్కడి స్టోర్సు విభాగం సిబ్బంది పనితీరును తెలియజేస్తోంది. చిన్నపిల్లలకు తేలు కుడితే అత్యవసరంగా ప్రొజోసిన్ ఔషధాన్ని ఇవ్వాలి. కానీ ప్రస్తుతం ఈ ఔషధం ఎంజీఎంలో లేదు. ఈ మందు కావాలంటే బయట మెడికల్ షాపుల నుంచి తెచ్చుకోవాలని సిబ్బంది చెపుతున్నారు. ఇటీవల వర్థన్నపేట మండలానికి చెందిన ఓ బాలుడు తేలుకాటుకు గురవడంతో ఎంజీఎంకు తరలించారు. అప్పటికే బాలుడి పల్స్రేట్ పడిపోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రొజోసిన్ ఔషధం కోసం బాలుడి బంధువులు నానా ఇబ్బందులు పడ్డారు. ఇలా అత్యవసర ఔషధాలు అందుబాటులో లేకపోవడంతో రోగుల ప్రాణాలు గాల్లో కలిసే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుండె జబ్బుతో బాధపడుతున్న వారికి అత్యవసరంగా అందించే టీపీఏ(టిష్యూ ప్లాస్టిమీనోజన్ యాక్టివేటర్) ఇంజక్షన్లు, హిమోఫిలియా రోగులకు అందించే ఫ్యాక్టర్ ఇంజక్షన్ వంటి మందులు ఎప్పుడూ అందుబాటులో ఉండడం లేదు. సాధారణ మందులూ లేవు.. ఎంజీఎం ఆస్పత్రికి నిత్యం వచ్చే వేలాది రోగులు సరైన ఔషధాలు లభించక ఇబ్బంది పడుతున్నారు. జలుబు, జ్వరం, దగ్గుకు అవసరమైన ఆమాక్సిక్లో, మలేరియా జ్వరానికి వాడే క్లోరోక్విన్, ఫిట్స్ రోగులకు అందించే క్లోబోజామ్ వంటి ఔషధాలు సైతం అందుబాటులో లేవు. దీంతో పేద రోగులు వందల రూపాయలు వెచ్చించి బయటి షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. కనీసం నొప్పుల ఉపశమనానికి అందించే డ్రేమడాల్, థైరాయిడ్ టాబ్లెట్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. వివిధ జిల్లాల నుంచి ఈ ఆస్పత్రికి వచ్చే వారికి అవసరమైన మందులు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చూడాలని ఉన్నతాధికారులను పలువురు కోరుతున్నారు.