కమీషన్ల కక్కుర్తి
- ఎంజీఎంలో అత్యవసర ఔషధాల కొరత
- తేలుకాటు, గుండెజబ్బు మందుల్లేవ్
- బయట షాపుల్లో కొనుగోలు చేస్తున్న రోగులు
- సాధారణ మందులకూ ఇదే పరిస్థితి
సాక్షి, హన్మకొండ : ఉత్తర తెలంగాణలో పెద్దదిగా గుర్తింపు పొందిన మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రి(ఎంజీఎం)లో అత్యవసర మందుల కొరత నెలకొంది. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగులకు అందించే అత్యవసర ఔషధాలు(లైఫ్ సేవింగ్ డ్రగ్స్) లేక ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ మందులు ప్రైవేట్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది.
కమీషన్ల వేట..
జిల్లా ఔషధ నియంత్రణ కేంద్రం నుంచి సరఫరా లేని మందుల కొనుగోలుకు ఎంజీఎం ఆస్పత్రికి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించింది. ఈ డబ్బుతో అత్యవసర మందులు కొనుగోలు చేయాల్సి ఉండగా.. ఎంజీఎం స్టోర్స్ సిబ్బంది కమీషన్లు వచ్చే ఔషధాల కొనుగోళ్లపైనే శ్రద్ధ చూపిస్తున్నారు. ఫలితంగా అత్యవసర మందులు ఎల్లవేళలా అందుబాటులో ఉండటం లేదు. తేలుకాటు, పాముకాటు, గుండేపోటు తదితర అత్యవసర పరిస్థితులలో రోగులకు అందించే ఔషధాలను కమీషన్లతో ముడిపెట్టడం ఇక్కడి స్టోర్సు విభాగం సిబ్బంది పనితీరును తెలియజేస్తోంది. చిన్నపిల్లలకు తేలు కుడితే అత్యవసరంగా ప్రొజోసిన్ ఔషధాన్ని ఇవ్వాలి.
కానీ ప్రస్తుతం ఈ ఔషధం ఎంజీఎంలో లేదు. ఈ మందు కావాలంటే బయట మెడికల్ షాపుల నుంచి తెచ్చుకోవాలని సిబ్బంది చెపుతున్నారు. ఇటీవల వర్థన్నపేట మండలానికి చెందిన ఓ బాలుడు తేలుకాటుకు గురవడంతో ఎంజీఎంకు తరలించారు. అప్పటికే బాలుడి పల్స్‌రేట్ పడిపోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రొజోసిన్ ఔషధం కోసం బాలుడి బంధువులు నానా ఇబ్బందులు పడ్డారు. ఇలా అత్యవసర ఔషధాలు అందుబాటులో లేకపోవడంతో రోగుల ప్రాణాలు గాల్లో కలిసే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుండె జబ్బుతో బాధపడుతున్న వారికి అత్యవసరంగా అందించే టీపీఏ(టిష్యూ ప్లాస్టిమీనోజన్ యాక్టివేటర్) ఇంజక్షన్‌లు, హిమోఫిలియా రోగులకు అందించే ఫ్యాక్టర్ ఇంజక్షన్ వంటి మందులు ఎప్పుడూ అందుబాటులో ఉండడం లేదు.
సాధారణ మందులూ లేవు..
ఎంజీఎం ఆస్పత్రికి నిత్యం వచ్చే వేలాది రోగులు సరైన ఔషధాలు లభించక ఇబ్బంది పడుతున్నారు. జలుబు, జ్వరం, దగ్గుకు అవసరమైన ఆమాక్సిక్లో, మలేరియా జ్వరానికి వాడే క్లోరోక్విన్, ఫిట్స్ రోగులకు అందించే క్లోబోజామ్ వంటి ఔషధాలు సైతం అందుబాటులో లేవు. దీంతో పేద రోగులు వందల రూపాయలు వెచ్చించి బయటి షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. కనీసం నొప్పుల ఉపశమనానికి అందించే డ్రేమడాల్, థైరాయిడ్ టాబ్లెట్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. వివిధ జిల్లాల నుంచి ఈ ఆస్పత్రికి వచ్చే వారికి అవసరమైన మందులు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చూడాలని ఉన్నతాధికారులను పలువురు కోరుతున్నారు.