mgm government hospital
-
హెల్త్ సిటీ పేరుతో ఆస్పత్రి అభివృద్ధిని ఆపేశారు! కానీ.. : మంత్రి కొండా సురేఖnews
వరంగల్: గత ప్రభుత్వ హయాంలో ఎంజీఎం ఆస్పత్రిలో పెద్ద ఎత్తున సమస్యలు పేరుకుపోయాయి.. హెల్త్ సిటీ పేరుతో ఆస్పత్రి అభివృద్ధిని ఆపేశారు.. పేద ప్రజలకు సేవలందించే ఆస్పత్రి పాలన ప్రక్షాళనకు శ్రీకారం చుడతామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుతున్న క్రమంలో ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు.. పేద రోగులకు మరింత మెరుగైన సేవలు ఎలా అందించాలనే దానిపై ఆదివారం ఆస్పత్రి పరిపాలనాధికారులు, టీఎస్ఎంఎస్ఐడీసీ, ఎన్పీడీసీఎల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో రోగులకు సదుపాయలు అందుతున్నాయి.. గత ప్రభుత్వం హయాంలో నిధులు కేటాయించక మిగిలిన పనులు ఏమిటి.. ప్రస్తుతం కరోనా వార్డుల పరిస్థితిపై సమీక్షించిన అనంతరం మంత్రి వివరాలను విలేకరులకు వెల్లడించారు. కరోనా రోగులకు మెరుగైన సేవలు ఎంజీఎంలో కరోనా రోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.. జిల్లాలో గత నెల 21 నుంచి ఇప్పటి వరకు 25 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం ఏడుగురు మాత్రమే ఎంజీఎంలో చికిత్స పొందుతున్నట్లు మంత్రి తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉందన్నారు. కరోనా జేఎన్–1 వేరియంట్ విస్తరిస్తున్న కారణంగా రోగుల సంఖ్య పెరిగినా.. సేవలందించేందుకు ఆస్పత్రిలో 1,200 ఆక్సిజన్ పడకలు అమర్చే సామర్థ్యం ఉందన్నారు. 24 గంటలు ఆక్సిజన్ సరఫరా చేసేలా 3 ట్యాంక్‌లు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. నిధుల లేమితో నిలిచిన పనులు ఆస్పత్రిలో గత ప్రభుత్వ హయాంలో రూ.1.03 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు టెండర్ పిలువగా కాంట్రాక్టర్ రూ.12 లక్షల పనులు మాత్రమే చేపట్టారని, పనులు పూర్తి చేసేలా సదరు కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే ఆస్పత్రిలో ఫైర్ సెఫ్టీ కోసం రూ.35 లక్షల నిధులతో చేపట్టిన పనులకు నిధులు మంజూరు చేయకపోవడంతో చివరి దశలో ఆగిపోయాయని, వీటిని ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామన్నారు. అధికారిక నంబర్లు ప్రదర్శించాలి ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ఆర్‌ఎంఓలు, పరిపాలనాధికారుల నంబర్లు ప్రజలకు తెలిసేలా బోర్డులపై ప్రదర్శించాలని చెప్పారు. ఆర్‌ఎంఓలు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూపరింటెండెంట్‌ను మంత్రి ఆదేశించారు. రోగుల అటెండెంట్లకు ప్రత్యేక షెడ్డు ఎంజీఎంలో ప్రస్తుతం 14 ఆపరేషన్ థియేటర్లు వినియోగిస్తున్నారు.. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మూడు అపరేషన్ థియేటర్లు పనికిరాని స్థితికి చేరాయి.. వాటిని తొలగించి ఆ స్థానంలో రోగుల సహాయార్థం వచ్చే అటెండెంట్లకు ప్రత్యేక షెడ్డు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో హెచ్‌డీఎస్ సమావేశం.. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం త్వరలో ఏర్పాటు చేస్తామని మంత్రి సరేఖ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో డీజిల్ కొనేందుకు కూడా ప్రత్యేక నిధులు లేని పరిస్థితి నెలకొందన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలోని దుకాణాదారులు సరిగ్గా కిరాయి చెల్లించడం లేదని, వారికి నోటీసులు జారీ చేసి నిబంధనలను ఉల్లంఘిస్తే తొలగించాలని ఆదేశించారు. అలాగే ఆస్పత్రికి ఆదాయ వనరులు సమకూరేలా రోడ్డు వైపున ప్రత్యేక షెడ్లు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలోని ఖాళీ ప్రదేశాల్లో అటవీ శాఖ సిబ్బంది సహాయంతో ప్రత్యేకంగా గార్డెనింగ్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఆస్పత్రి పరిపాలనాధికారుల పనితీరు మెరుగుపరిచేందుకు భవిష్యత్‌లో ఆకస్మిక తనిఖీలు చేపడతామని, వైద్యులు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. సమీక్ష సమావేశంలో ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, ఆర్‌ఎంఓలు మురళి, శ్రీనివాస్, రోషన్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎస్ఈ దేవేంద్రకుమార్, డీఈ మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: అప్పులున్నా.. ఆరు గ్యారంటీలు మాత్రం ఆగవు : మంత్రి పొన్నం ప్రభాకర్ -
మెడికో ప్రీతి కేసు.. ఆ రిపోర్ట్‌లో సంచలన విషయాలు
మెడికో ప్రీతి మృతి కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్‌లో ఎలాంటి విషపదార్థాలు డిటెక్ట్ కాలేదని రిపోర్ట్‌లో వెల్లడైంది. ప్రీతి బాడీలో ఎలాంటి విష రసాయనాలు లభ్యం కాలేదని టాక్సికాలజీ రిపోర్ట్ స్పష్టం చేసింది. గుండె, కాలేయం, రక్తంతో పాటు పలు అవయవాల్లోనూ ఎలాంటి విషపదార్థాలు దొరకలేదని రిపోర్ట్‌లో తేలింది. ఇప్పటికే ప్రీతి టాక్సికాలజీ రిపోర్ట్ వరంగల్ సీపీ రంగనాథ్ సీపీ చేతికి చేరింది. దీంతో ఆత్మహత్యాయత్నం కేసును అనుమానాస్పద మృతి కేసుగా మార్చే యోచనలో పోలీసులు ఉన్నారు. ప్రీతిది హత్యా, ఆత్మహత్యా తేల్చుకోలేక పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రీతిది ముమ్మాటికీ హత్యేనని ఆమె కుటుంబసభ్యులు, విపక్షాలు ఆరోపిస్తున్నాయి. హైదరాబాద్‌కు వరంగల్ సీపీ ప్రీతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి రావడంతో వరంగల్ పోలీస్ కమిషనర్ సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు. ఇప్పటికే డీజీపీ వరంగల్ సీపీ రంగనాథ్‌కు ఫోన్ కూడా చేశారు. ప్రీతి కేసు కొత్త మలుపు మెడికల్ విద్యార్థిని ప్రీతీ ఉదంతం కొత్త మలుపు తిరగబోతోంది. సైఫ్ హోమ్ మంత్రికి సమీప బంధువు అంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ కేసు మరిన్నీ మలుపులు తిరగనుంది. తాజా నివేదికతో ఆత్మహత్య కేసును అనుమానాస్పద మృతి గా కేసు మార్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
మృత్యు ఘోష.. 52 మంది చిన్నారుల మృతి
జంషెడ్పూర్: గోరఖ్‌పూర్ పిల్లల మరణాల ఘటన ఇంకా కళ్ల ముందు మెదులుతుండగానే మరో ఘోర కలి వెలుగు చూసింది. జార్ఖండ్ లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో 52 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. జంషెడ్‌పూర్‌లోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ ఆస్పత్రిలో నెల రోజుల వ్యవధిలో 52 మంది పిల్లలు చనిపోయినట్లు తెలుస్తోంది. చిన్నారుల మరణాలు ధృవీకరించిన ఆస్ప్రతి సూపరిండెంట్ పౌష్టికాహార లోపంతోనే వారంతా మరణించినట్లు చెబుతున్నారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
కమీషన్ల కక్కుర్తి
ఎంజీఎంలో అత్యవసర ఔషధాల కొరత తేలుకాటు, గుండెజబ్బు మందుల్లేవ్ బయట షాపుల్లో కొనుగోలు చేస్తున్న రోగులు సాధారణ మందులకూ ఇదే పరిస్థితి సాక్షి, హన్మకొండ : ఉత్తర తెలంగాణలో పెద్దదిగా గుర్తింపు పొందిన మహాత్మాగాంధీ స్మారక ఆస్పత్రి(ఎంజీఎం)లో అత్యవసర మందుల కొరత నెలకొంది. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగులకు అందించే అత్యవసర ఔషధాలు(లైఫ్ సేవింగ్ డ్రగ్స్) లేక ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. ఈ మందులు ప్రైవేట్ షాపుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోంది. కమీషన్ల వేట.. జిల్లా ఔషధ నియంత్రణ కేంద్రం నుంచి సరఫరా లేని మందుల కొనుగోలుకు ఎంజీఎం ఆస్పత్రికి ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించింది. ఈ డబ్బుతో అత్యవసర మందులు కొనుగోలు చేయాల్సి ఉండగా.. ఎంజీఎం స్టోర్స్ సిబ్బంది కమీషన్లు వచ్చే ఔషధాల కొనుగోళ్లపైనే శ్రద్ధ చూపిస్తున్నారు. ఫలితంగా అత్యవసర మందులు ఎల్లవేళలా అందుబాటులో ఉండటం లేదు. తేలుకాటు, పాముకాటు, గుండేపోటు తదితర అత్యవసర పరిస్థితులలో రోగులకు అందించే ఔషధాలను కమీషన్లతో ముడిపెట్టడం ఇక్కడి స్టోర్సు విభాగం సిబ్బంది పనితీరును తెలియజేస్తోంది. చిన్నపిల్లలకు తేలు కుడితే అత్యవసరంగా ప్రొజోసిన్ ఔషధాన్ని ఇవ్వాలి. కానీ ప్రస్తుతం ఈ ఔషధం ఎంజీఎంలో లేదు. ఈ మందు కావాలంటే బయట మెడికల్ షాపుల నుంచి తెచ్చుకోవాలని సిబ్బంది చెపుతున్నారు. ఇటీవల వర్థన్నపేట మండలానికి చెందిన ఓ బాలుడు తేలుకాటుకు గురవడంతో ఎంజీఎంకు తరలించారు. అప్పటికే బాలుడి పల్స్రేట్ పడిపోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రొజోసిన్ ఔషధం కోసం బాలుడి బంధువులు నానా ఇబ్బందులు పడ్డారు. ఇలా అత్యవసర ఔషధాలు అందుబాటులో లేకపోవడంతో రోగుల ప్రాణాలు గాల్లో కలిసే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుండె జబ్బుతో బాధపడుతున్న వారికి అత్యవసరంగా అందించే టీపీఏ(టిష్యూ ప్లాస్టిమీనోజన్ యాక్టివేటర్) ఇంజక్షన్లు, హిమోఫిలియా రోగులకు అందించే ఫ్యాక్టర్ ఇంజక్షన్ వంటి మందులు ఎప్పుడూ అందుబాటులో ఉండడం లేదు. సాధారణ మందులూ లేవు.. ఎంజీఎం ఆస్పత్రికి నిత్యం వచ్చే వేలాది రోగులు సరైన ఔషధాలు లభించక ఇబ్బంది పడుతున్నారు. జలుబు, జ్వరం, దగ్గుకు అవసరమైన ఆమాక్సిక్లో, మలేరియా జ్వరానికి వాడే క్లోరోక్విన్, ఫిట్స్ రోగులకు అందించే క్లోబోజామ్ వంటి ఔషధాలు సైతం అందుబాటులో లేవు. దీంతో పేద రోగులు వందల రూపాయలు వెచ్చించి బయటి షాపుల్లో కొనుగోలు చేస్తున్నారు. కనీసం నొప్పుల ఉపశమనానికి అందించే డ్రేమడాల్, థైరాయిడ్ టాబ్లెట్లు లేక రోగులు ఇబ్బంది పడుతున్నారు. వివిధ జిల్లాల నుంచి ఈ ఆస్పత్రికి వచ్చే వారికి అవసరమైన మందులు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా చూడాలని ఉన్నతాధికారులను పలువురు కోరుతున్నారు. -
ఎంజీఎంలో జేసీ హల్చల్
ఎంజీఎం, న్యూస్‌లైన్ : నాలుగు జిల్లాలకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజీఎం ధర్మాస్పత్రిలో జిల్లా జాయింట్ కలెక్టర్ పౌసుమిబసు హల్చల్ చేశారు. ఈనెల 19న(ఆదివారం) హెచ్‌డీఎస్ సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆమె ఆస్పత్రిని శుక్రవారం సందర్శించారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆస్పత్రికి చేరుకున్న జేసీ ముందుగా అత్యవసర వార్డు, తర్వాత ఓపీ విభాగం, బ్లడ్‌బ్యాంక్, ఏఆర్టీ సెంటర్, ఏపీఎంఎస్ఐడీసీ నిర్వహిస్తున్న అభివృద్ధి పనులు, మెడల్ డయాగ్నస్టిక్ సెంటర్‌ను పరిశీలించారు. అనంత రం రోగులకు అందిస్తున్న భోజనాన్ని స్వయంగా రుచి చూశారు. సాయంత్రం 6.00 గంటల తర్వాత సూపరిం టెండెంట్ చాంబర్లో సూపరింటెండెంట్ మనోహర్, ఆర్ఎంఓ నాగేశ్వర్రావు, హేమంత్, శివకుమార్, హెచ్ఓడీ కరుణాకర్‌రెడ్డి, బలరాం, డైటీషియన్ వీరమల్లు తదితరులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పలు అంశాలపై చర్చించారు. ఏపీఎంఎస్ఐడీసీ అధికారులపై ఆగ్రహం ఆస్పత్రిలో 1.10 కోట్లతో ఏపీఎంఎస్ఐడీసీ అధికారు లు చేపట్టిన నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించడంపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం ఆస్పత్రిని సందర్శించినప్పుడు చేపట్టిన పనుల వివరాలు తెలుపాలని కోరారు. ఓపీ విభాగంలో రోగుల సౌకర్యార్థం రక్త సేకరణ గదిలో చేపట్టిన టాయ్లెట్ల నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించిన విషయాన్ని గ్రహించిన ఆమె ఈఈ దేవేందర్‌పై మండిపడ్డారు. నాసిరకంగా పనులు నిర్వహిస్తే ఊపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆస్పత్రిలో చేపట్టిన నిర్మాణాలపై సూపరింటెండెంట్‌తో చర్చించి తుది నివేదికను సమర్పించాలని ఆదేశించారు. ఆస్పత్రిలో ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన మెడల్ డయాగ్నస్టిక్స్ నిర్వహణపై జేసీ నిప్పులు చెరిగారు. ఇన్‌పేషంట్ల రిపోర్టులు సెంటర్లోనే దర్శనమివ్వడం, ఈనెల 7న తీసిన స్కానింగ్ రిపోర్టులు వార్డుకు చేరకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. ప్రైవేట్ రోగులకు ఇచ్చిన ప్రాధాన్యం ఎంజీఎం ఇన్పే షంట్లకు ఇవ్వడం లేదని పలువురు రోగులతోపాటు వైద్యసిబ్బంది సైతం ఆమెకు వివరించారు. మెడల్ నిర్వహణతీరును పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని ఏర్పాటు చేసి ప్రభుత్వ పరంగా ఎన్ని స్కానింగ్‌లు తీస్తున్నారో పరిశీలించాలని చెప్పారు. వేయ్యి పడకల ఆస్పత్రిలో రోగులకు అందిస్తున్న డైట్(భోజనాన్ని) ఎలా ఉంటుందని జేసీ పౌసుమిబసు సూపరింటెండెంట్ మనోహర్, ఆర్ఎంఓ నాగేశ్వర్రావు, హేమంత్, శివకుమార్లతోకలిసి రుచిచూశారు. డైట్లో అందుబాటులో ఉంచిన సరుకులను సైతం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఏడీ తీరుపై అసహనం ఆస్పత్రి అసిస్టెండ్ డెరైక్టర్ విధులు నిర్వహిస్తున్న తీరుపై జేసీ అసహనం వ్యక్తం చేశారు. అతను పలువురు సిబ్బం దికి సంబంధించిన సెలవులు, ఆయ సంతోషమ్మ వేతన చెల్లింపు విషయంలో అతడి ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. అనాథ శిశువుల తరలింపు కోసం ఐసీడీఎస్ పీడీకి ఆదేశాలు ఎంజీఎంలో 9 మంది అనాథ శిశువులు చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్యం మెరుగుపడడంతోపాటు సుమారు ఆరు నెలలుగా ఎంజీఎంలోనే ఉండడంతో ఆస్పత్రి సిబ్బందికి ఇబ్బంది మారింది. ఆ చిన్నారులను శిశు గృహాలకు తరలించాలని ఏన్నిమార్లు చెప్పినా పట్టించుకోవడంతో సంబంధిత సిబ్బంది జేసీకి వివరిం చారు. దీంతో ఆమె అనాథ పిల్లలను తరలించాలని ఐసీడీఎస్ పీడీని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.