హెల్త్‌ సిటీ పేరుతో ఆస్పత్రి అభివృద్ధిని ఆపేశారు! కానీ.. : మంత్రి కొండా సురేఖnews | - | Sakshi
Sakshi News home page

హెల్త్‌ సిటీ పేరుతో ఆస్పత్రి అభివృద్ధిని ఆపేశారు! కానీ.. : మంత్రి కొండా సురేఖ

Published Mon, Jan 1 2024 1:34 AM | Last Updated on Mon, Jan 1 2024 10:38 AM

- - Sakshi

వరంగల్‌: గత ప్రభుత్వ హయాంలో ఎంజీఎం ఆస్పత్రిలో పెద్ద ఎత్తున సమస్యలు పేరుకుపోయాయి.. హెల్త్‌ సిటీ పేరుతో ఆస్పత్రి అభివృద్ధిని ఆపేశారు.. పేద ప్రజలకు సేవలందించే ఆస్పత్రి పాలన ప్రక్షాళనకు శ్రీకారం చుడతామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుతున్న క్రమంలో ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు.. పేద రోగులకు మరింత మెరుగైన సేవలు ఎలా అందించాలనే దానిపై ఆదివారం ఆస్పత్రి పరిపాలనాధికారులు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ, ఎన్పీడీసీఎల్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో రోగులకు సదుపాయలు అందుతున్నాయి.. గత ప్రభుత్వం హయాంలో నిధులు కేటాయించక మిగిలిన పనులు ఏమిటి.. ప్రస్తుతం కరోనా వార్డుల పరిస్థితిపై సమీక్షించిన అనంతరం మంత్రి వివరాలను విలేకరులకు వెల్లడించారు.

కరోనా రోగులకు మెరుగైన సేవలు
ఎంజీఎంలో కరోనా రోగులకు మెరుగైన వైద్యసేవలందించేందుకు అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు.. జిల్లాలో గత నెల 21 నుంచి ఇప్పటి వరకు 25 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం ఏడుగురు మాత్రమే ఎంజీఎంలో చికిత్స పొందుతున్నట్లు మంత్రి తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగ్గానే ఉందన్నారు. కరోనా జేఎన్‌–1 వేరియంట్‌ విస్తరిస్తున్న కారణంగా రోగుల సంఖ్య పెరిగినా.. సేవలందించేందుకు ఆస్పత్రిలో 1,200 ఆక్సిజన్‌ పడకలు అమర్చే సామర్థ్యం ఉందన్నారు. 24 గంటలు ఆక్సిజన్‌ సరఫరా చేసేలా 3 ట్యాంక్‌లు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

నిధుల లేమితో నిలిచిన పనులు
ఆస్పత్రిలో గత ప్రభుత్వ హయాంలో రూ.1.03 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు టెండర్‌ పిలువగా కాంట్రాక్టర్‌ రూ.12 లక్షల పనులు మాత్రమే చేపట్టారని, పనులు పూర్తి చేసేలా సదరు కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేయాలని మంత్రి ఆదేశించారు. అలాగే ఆస్పత్రిలో ఫైర్‌ సెఫ్టీ కోసం రూ.35 లక్షల నిధులతో చేపట్టిన పనులకు నిధులు మంజూరు చేయకపోవడంతో చివరి దశలో ఆగిపోయాయని, వీటిని ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామన్నారు.

అధికారిక నంబర్లు ప్రదర్శించాలి
ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్న ఆర్‌ఎంఓలు, పరిపాలనాధికారుల నంబర్లు ప్రజలకు తెలిసేలా బోర్డులపై ప్రదర్శించాలని చెప్పారు. ఆర్‌ఎంఓలు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూపరింటెండెంట్‌ను మంత్రి ఆదేశించారు.

రోగుల అటెండెంట్లకు ప్రత్యేక షెడ్డు
ఎంజీఎంలో ప్రస్తుతం 14 ఆపరేషన్‌ థియేటర్లు వినియోగిస్తున్నారు.. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉన్న మూడు అపరేషన్‌ థియేటర్లు పనికిరాని స్థితికి చేరాయి.. వాటిని తొలగించి ఆ స్థానంలో రోగుల సహాయార్థం వచ్చే అటెండెంట్లకు ప్రత్యేక షెడ్డు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

త్వరలో హెచ్‌డీఎస్‌ సమావేశం..
ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం త్వరలో ఏర్పాటు చేస్తామని మంత్రి సరేఖ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో డీజిల్‌ కొనేందుకు కూడా ప్రత్యేక నిధులు లేని పరిస్థితి నెలకొందన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలోని దుకాణాదారులు సరిగ్గా కిరాయి చెల్లించడం లేదని, వారికి నోటీసులు జారీ చేసి నిబంధనలను ఉల్లంఘిస్తే తొలగించాలని ఆదేశించారు. అలాగే ఆస్పత్రికి ఆదాయ వనరులు సమకూరేలా రోడ్డు వైపున ప్రత్యేక షెడ్లు నిర్మించనున్నట్లు పేర్కొన్నారు.

ఆస్పత్రి ప్రాంగణంలోని ఖాళీ ప్రదేశాల్లో అటవీ శాఖ సిబ్బంది సహాయంతో ప్రత్యేకంగా గార్డెనింగ్‌ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఆస్పత్రి పరిపాలనాధికారుల పనితీరు మెరుగుపరిచేందుకు భవిష్యత్‌లో ఆకస్మిక తనిఖీలు చేపడతామని, వైద్యులు నిబద్ధతతో విధులు నిర్వర్తించాలని సూచించారు. సమీక్ష సమావేశంలో ఎంజీఎం సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌, ఆర్‌ఎంఓలు మురళి, శ్రీనివాస్‌, రోషన్‌, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎస్‌ఈ దేవేంద్రకుమార్‌, డీఈ మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవి చ‌ద‌వండి: అప్పులున్నా.. ఆరు గ్యారంటీలు మాత్రం ఆగవు : మంత్రి పొన్నం ప్రభాకర్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement