కరోనా గుప్పిట్లో రష్యా | COVID-19: Russia registers Coronavirus record rise in cases | Sakshi
Sakshi News home page

కరోనా గుప్పిట్లో రష్యా

Published Fri, May 8 2020 1:37 AM | Last Updated on Fri, May 8 2020 1:39 AM

COVID-19: Russia registers Coronavirus record rise in cases - Sakshi

చైనా సరిహద్దుగా ఉండడంతో   అందరి కంటే ముందే స్పందించింది. అంతర్జాతీయ సరిహద్దుల్ని మూసేసింది. అంతా ప్రశాంతం అనుకున్నారు.  కానీ నివురు గప్పిన నిప్పులా వైరస్‌ కమ్మేసింది. ఇప్పుడు కరోనా గుప్పిట్లో విలవిలలాడుతోంది.  రష్యాకి ఎందుకీ దుస్థితి ?  

కరోనా వైరస్‌ ప్రపంచ దేశాలను భయపెట్టిన తొలి రోజుల్లో చైనాకు సరిహద్దుగా ఉన్నప్పటికీ రష్యాలో పెద్దగా కేసులు నమోదవలేదు. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో వైరస్‌ తగ్గుముఖం పడుతూ ఉంటే రష్యాలో కేసులు భయపెడుతున్నాయి. గత వారం పది రోజులుగా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. రష్యా ప్రధానమంత్రి మిఖాయిల్‌ మిషూస్టిన్, సాంస్కృతిక మంత్రి ఓల్గా లూంబిమోవాస్, గృహనిర్మాణ మంత్రి వ్లాదిమర్‌ యకుషేవ్‌లు వైరస్‌ సోకి ఆస్పత్రి పాలయ్యారు.  

లాక్‌డౌన్‌ ఆలస్యమే కొంప ముంచుతోందా ?
కరోనా వైరస్‌ తీవ్రతని ప్రపంచ దేశాలు గుర్తించక ముందే రష్యా గుర్తించింది. తొలి కేసు కూడా నమోదు కాకుండానే జనవరి 30న చైనాతో సరిహద్దుల్ని మూసేసింది. జనవరి 31న రష్యాలో రెండు కేసులు నమోదయ్యాయి. మార్చి 13 తర్వాత ఐరోపా దేశాలతో కూడా రాకపోకలు నిలిపివేసింది. కానీ దేశంలో లాక్‌డౌన్‌ అమలు చేయడంలో ఆలస్యం చేసింది. మార్చి 28 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించలేదు. ప్రకటించిన తర్వాత కూడా కఠినంగా అమలు చేయడంలో విఫలమైంది. ప్రజలు బయటకొచ్చి ఇష్టారాజ్యంగా తిరగడం, ప్రజల్లో ఈ వైరస్‌ ఎంత ప్రమాదకారో పూర్తిగా అవగాహన కొరవడడం వంటి కారణాలతో కేసులు పెరిగిపోయాయి. ఇప్పుడు జర్మనీ, ఫ్రాన్స్‌ను కూడా దాటేసి ప్రపంచంలో అత్యధిక కేసులు నమోదైన దేశాల్లో అయిదో స్థానానికి ఎగబాకింది.  

ఆరోగ్య వ్యవస్థ మేడిపండేనా ?
రష్యాలో ఆరోగ్య వ్యవస్థకి కోవిడ్‌ను  ఎదుర్కొనే సామర్థ్యం లేదేమోనన్న అనుమానాలైతే ఉన్నాయి. ప్రతీ వెయ్యి మందికి ఎనిమిది కంటే ఎక్కువ ఆస్పత్రులు ఉన్నప్పటికీ సదుపాయాలు అరకొరగా ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. 40 లక్షలకి పైగా పరీక్షలు చేశామని అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ చెబుతున్నారు. కానీ అన్ని పరీక్షలు జరగలేదని యూరప్‌ మీడియా కథనాలు రాస్తోంది. చైనా బాటలోనే నడుస్తూ తన అధ్యక్ష స్థానాన్ని పదిలపరుచుకోవడం కోసం రాజ్యాంగ సవరణలకు వీలుగా రిఫరెండం చేపట్టాలన్న ఏర్పాట్లలో ఉన్న పుతిన్‌కు కరోనా రూపంలో ఎదురుదెబ్బ తగిలింది.

2036 వరకు అధ్యక్షుడిగా తానే కొనసాగాలన్న ఆరాటంలో రాజ్యాంగ సవరణ చేపట్టే ప్రయత్నాల్లో ఉన్న పుతిన్‌ పాలనాపరమైన అంశాలన్నీ గాలికి వదిలేశారన్న విమర్శలున్నాయి. కోవిడ్‌ కారణంగా రిఫరెండంను వాయిదా వేసినప్పటికీ వైరస్‌ను ఎదుర్కొనే సన్నద్ధత లేకపోవడంతో ఒక్కసారిగా కేసులు విజృంభించాయి. దీంతో వైద్య విద్యనభ్యసిస్తున్న విద్యార్థులే వైద్య సేవలు అందిస్తున్నారు. వారికి పీపీఈ కిట్లు, మాస్కులు, శానిటైజర్ల కొరత ఉండడంతో విధులు నిర్వహించడానికి భయపడుతున్నారు.   

మాస్కో నుంచి 10 లక్షల మందికి పైగా వలస
దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగానికిపైగా రాజధాని మాస్కోలోనే ఉన్నాయి. దీంతో మాస్కో నుంచి 10 లక్షల మందికి పైగా వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు. కరోనా ముప్పుకి ముందే దేశం ఆర్థికంగా ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటోంది. జీడీపీ 5 శాతానికి పడిపోయింది. రాజకీయ, ఆర్థిక ఒడిదుడుకుల్లో ఉన్న రష్యా ఆరోగ్యపరమైన సంక్షోభాన్ని గుర్తించలేకపోవడంతో కరోనా కోరల్లో చిక్కుకొని విలవిలలాడుతోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement