Shortage of water
-
ఆపద వాహనానికి నీటి కష్టాలు
సాక్షి, వేములవాడరూరల్: ఎలాంటి అగ్ని ప్రమాదం జరిగినా వెంటనే గుర్తుకు వచ్చేది అగ్నిమాపక వాహనం. అదే వాహనానికి నీరు లేకపోతే ఇక ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పనక్కర్లేదు. వేములవాడ మండల కేంద్రంలో ఉన్న అగ్నిమాపక కేంద్రంలో నీరు లేక అక్కడ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఇది అక్షరాలా సత్యం. గత కొన్ని నెలల క్రితం ప్రారంభించిన ఈ అగ్నిమాపక కేంద్రంలో మంచినీటి కొరకు బోరు వేయగా ప్రస్తుతం ఆ బోరు నీరు లేక అడుగంటుకుపోయింది. ఇక వాహనంలో నీరు నింపడానికి చెరువులు, బావుల వద్దకు పరుగులు తీయాల్సిన పరిస్థితి అక్కడ సిబ్బందికి ఏర్పడుతోంది. అసలే వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో ప్రతీరోజు ఎక్కడో ఒక్కచోట అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. అలాంటి సమయంలో ఈ వాహనంలో 24 గంటలు నీరు ఉండాల్సి ఉండగా నీటి సమస్య ఉండడం వల్ల సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. నాంపల్లి చెరువు లేక మల్లారం వెళ్లే బావి వద్ద నీరు తప్పా వారికి ఎలాంటి నీటి సౌకర్యం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సౌకర్యం కల్పించాలంటూ మున్సిపాలిటీ అధికారులను కోరినప్పటికీ వారు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే ఈ సమయంలో ఇలాంటి కష్టం ఉంటే మరికొన్ని రోజుల్లో ఎండలు తీవ్రత పెరిగిన తరువాత ఇక వారి పరిస్థితి ఎలా ఉంటుందోనని వారు ఇప్పటి నుండి ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకొని ఆకాశగంగ పైప్ లైన్ సౌకర్యం అగ్నిమాపక కేంద్రానికి కల్పించాలని వారు కోరుతున్నారు. 6 మండలాలకు ఇదే ఆధారం వేములవాడ ఫైర్ స్టేషన్ వాహనం 6 మండలాలకు ఆధారంగా ఉన్నది. వేములవాడ, వేములవాడ రూరల్, బోయినపల్లి, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి మండలాల్లో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నా వేములవాడ నుండే వాహనం వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి వాహనంలో నీరు అందుబాటులో ఉండాలి. రుద్రంగి మండలంలోని మానాల గ్రామంలో సంఘటన జరిగినా వేములవాడ నుండి వెళ్లాల్సిందే. ఇక్కడ నీరు అందుబాటులో 24 గంటలు ఉండాలి కానీ నీరు లేకపోవడంతో వారు ఉన్న 10 మంది మంది సిబ్బంది కూడా కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీరు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఫైర్‌స్టేషన్ ఇన్చార్జి సతీష్‌కుమార్‌ను వివరణ కోరడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాకపోవడంతో అదే కార్యాలయంలో పని చేస్తున్న పవన్‌కుమార్ నీటి సమస్య మాత్రం తీవ్రంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. -
ప్రఖ్యాత నగరం.. నీటి సరఫరా అంతంతమాత్రం..
సాక్షి, శంషాబాద్: అంతర్జాతీయ ఖ్యాతిగాంచిన శంషాబాద్ పట్టణంలో తాగునీటి సౌకర్యం లేక పలు కాలనీలు అల్లాడుతున్నాయి. ఔటర్ రింగ్‌రోడ్డు లోపలి గ్రామాలకు నీటి సరఫరా బాధ్యత జలమండలి తీసుకోవడంతో ఇక్కడ పంచాయతీ చేతిలో ఏమీ లేకుండా పోయింది. జలమండలి అన్ని ఆవాసాలకు మంచినీరందించే పనిని చేపట్టడం లేదు. ఫలితంగా శంషాబాద్ పట్టణంలోని మధురానగర్, సిద్దేశ్వరకాలనీ, ఆర్బీనగర్, ఆదర్శనగర్ కాలనీలో నీటి సరఫరా లేక పదిహేను రోజులుగా ప్రజలు అల్లాడుతున్నారు. ఈ విషయమై ఇటీవల ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ జలమండలి అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్య పరిష్కరించాలని సూచించారు. వీలైనంత త్వరగా సంబంధిత కాలనీలకు మంచినీటి సరఫరా చేపట్టేందుకు ఉన్న మార్గాలను అన్వేషించి పనిపూర్తి చేయాలని ఆదేశించారు. అయినా సదరు శాఖ అధికారులు నీటి సరఫరాపై తీవ్ర జాప్యం చేస్తున్నారు. ఎందుకిలా..? శంషాబాద్‌లోని పాత గ్రామానికి నాలుగున్నరేళ్లుగా జలమండలి అధికారులు కృష్ణా నీటిని సరఫరా చేస్తున్నారు. పంచాయతీలోని మిగతా ప్రాంతాలకు పంచాయతీ నుంచి బోరు నీటిని సరఫరా చేసేవారు. అయితే, కొంత కాలంగా ఔటర్ రింగ్‌రోడ్డు లోపు పూర్తి ఆవాసాలకు నీటి సరఫరాను అందించే బాధ్యతను ప్రభుత్వం జలమండలికి అప్పగించింది. దీంతో పంచాయతీ అధికారులు నూతనంగా ఎలాంటి పనులూ చేపట్టడానికి వీలు లేకుండా పోయింది. శంషాబాద్‌లోని జాతీయ రహదారికి అవతల ఉన్న ప్రాంతంలో అర్బన్ మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులు ఇంకా పూర్తి చేయకపోవడంతో ఇక్కడ కృష్ణా నీటి సరఫరా ప్రారంభం కాలేదు. గతంలో ఉన్న బోర్లు పూర్తిగా ఎండిపోవడంతో పంచాయతీ అధికారులు కూడా వాటిని ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. స్థానికంగా నెలకొన్న సమస్యను పంచాయతీ సర్పంచ్ రాచమల్ల సిద్దేశ్వర్ ఆధ్వర్యంలో రెండుమార్లు జలమండలి అధికారులకు విన్నవించారు. అయినా సంబంధిత అధికారులు ఆయా కాలనీలకు మంచినీటి సరఫరాను అందించే ప్రక్రియపై ఇంతవరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. పడిపోయిన నీటిమట్టం శంషాబాద్ పట్టణంలో మధురానగర్, ఆర్బీనగర్, ఆదర్శనగర్ కాలనీల్లో వందల సంఖ్యలో బహుళ అంతస్తుల భవనాలు పుట్టుకొచ్చాయి. అద్దెకు నివాసముండే వారు పెరిగిపోయారు. దీంతో ఇళ్ల యజమానులు 1000 నుంచి 1500 ఫీట్ల వరకు బోర్లు వేశారు. విచ్చలవిడిగా తవ్విన బోర్లతో ఇక్కడ భూగర్భ జలాలు అడుగంటాయియి. ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు బోర్ల వరకు ఉన్నాయి. నివాస ప్రాంతాల్లో సైతం ఎలాంటి అనుమతులు లేకుండా హోటళ్లు, లాడ్జీలు, ప్రైవేటు హాస్టళ్ల నిర్వహిస్తున్నా అడ్డుకునే వారే లేకుండా పోయారు. దీంతో ఇక్కడి జనాభాకు అనుగుణంగా పంచాయతీ నీటి సరఫరాను అందించలేకపోతోంది. మరో వైపు కృష్ణా నీటి సరఫరా చర్యలు కూడా లేకపోవడంతో కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కృష్ణా నీటి సరఫరాకు మార్గం సుగమమం చేయడంతో పాటు అక్రమ బోర్లును అరికట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నీటి ఇబ్బంది చాలా ఉంది స్థానికంగా నీటి ఇబ్బంది చాలా ఉంది. కృష్ణా నీటి సరఫరా చేపట్టాలి. కాలనీలో బోర్లు ఎండిపోయాయి. ప్రభుత్వం వెంటనే సమస్యను పరిష్కరించాలి. సరైన నీటి సరఫరా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం – కె. సత్యనారాయణ– మధురానగర్ స్పందించడం లేదు.. పంచాయతీ పరిధిలోని ఔటర్ లోపలి ప్రాం తాలకు నీటి సరఫరా చేయాల్సిన జల మండలి పట్టించుకోవడం లేదు. పంచాయతీలోని ఔటర్ అవతలి భాగంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సత్వరమే స్పందిస్తున్నారు. పంచాయతీ చేతిలో సమస్యను పరిష్కరించేందుకు అవకాశం లేదు. జలమండలి అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. సత్వరమే కాలనీలకు నీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలి. –రాచమల్ల సిద్దేశ్వర్, శంషాబాద్ సర్పంచ్ -
మంత్రుల టాయిలెట్లకు నీటి కొరత
హైదరాబాద్ : సామాన్యులకే కాదు....మంత్రులకు నీటి కష్టాలు తప్పటం లేదు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మంత్రుల టాయిలెట్లకు నీటి కొరత ఏర్పడింది. సచివాలయంలోని జే బ్లాక్‌లో నీటి సరఫరా నిలిచిపోయింది. జే బ్లాక్ తొమ్మిది మంది మంత్రులతో కొలువు తీరిన విషయం తెలిసిందే. టాయిలెట్లలో నీటి కొరతను అధికారులు పట్టించుకోక పోవటంతో మంత్రులు, షేపీ సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. సాధారణంగా అయితే బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల లాంటి బహిరంగ ప్రదేశాలలో టాయిలెట్లలో నీళ్లు రాకపోవడం సర్వ సాధారణం. కానీ వీఐపీలు, వీవీఐపీలు ఉండే సచివాలయంలోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటే సర్కారు పాలనా తీరు ఎంత గొప్పగా ఉందో అర్థమవుతుంది. సామాన్యులకు సమస్య వస్తే ఏమాత్రం పట్టించుకోని సచివులు.. ఇప్పుడు తమ సమస్య విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి మరి. -
అటకెక్కిన కామినేని విస్తరణ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటూ... పూర్తి సామర్థ్యంలో కనీసం 10-20 శాతం కూడా ఉత్పత్తిని సాధించలేని దశలో కామినేని గ్రూపు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. నీటి విడుదల కోసం ఇప్పటికే ప్రభుత్వాన్ని అభ్యర్థించటంతో పాటు కేంద్రం యాజమాన్యంలోని మానిటరింగ్ గ్రూపు ప్రభుత్వానికి మెమోలు జారీ చేసినా ఫలితం లేకపోవటంతో కంపెనీ ప్రత్యామ్నాయాలపై పడింది. నేరుగా కేంద్రానికి లేఖ రాయటంతో పాటు అవసరమైతే ప్లాంటును ఉత్తరాదికో, మరో చోటికో తరలించే మార్గాన్ని కూడా కంపెనీ పరిశీలిస్తోంది. ప్రస్తుతం కామినేని గ్రూపు ఆధ్వర్యంలో ఆసుపత్రితో పాటు (కేఎస్పీఎల్), యునెటైడ్ సీమ్‌లెస్ ట్యూబ్యులర్(యూఎస్‌టీపీఎల్), ఆయిల్ కంట్రీ ట్యూబ్యులర్ వంటి సంస్థలు కొనసాగుతున్నాయి. ఈ సంస్థలన్నీ నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్దే కేంద్రీకృతమయ్యాయి. వీటిలో ఆయిల్ కంట్రీ ట్యూబ్యులర్ సంస్థ స్టాక్ మార్కెట్లలో లిస్టయింది కూడా. బిల్లెట్ల తయారీలో ఉన్న కేఎస్పీఎల్ 2011 జూన్‌లో కార్యకలాపాలు ఆరంభించింది. అయితే వాణిజ్య కార్యకలాపాలు మాత్రం ఈ నెల్లోనే మొదలయ్యాయి. ఇక్కడ తయారయ్యే బిల్లెట్లను యూఎస్టీపీఎల్కు సరఫరా చేస్తారు. అది ముడి పైపుల్ని ఉత్పత్తి చేస్తుంది. అనంతరం వాటిని ఆయిల్ కంట్రీ ట్యూబ్యులర్ కొనుగోలు చేసి.. తుది మెరుగులు దిద్దుతుంది. ఈ 3 ప్లాంట్లూ దాదాపు నార్కట్ పల్లిలోని 250 ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. వీటికితోడు కేఎస్పీఎల్ ఇక్కడే 220 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. ‘‘18 నెలల్లో ఉత్పత్తి మొదలవుతుంది. దీనిని 500 మెగావాట్ల వరకు విస్తరించే అవకాశం కూడా ఉంది. ఉత్పత్తయ్యే విద్యుత్‌లో సగం మా అవసరాలకు వాడుకుంటాం. మిగిలింది గ్రిడ్‌కు అనుసంధానం చేస్తాం’’ అని కంపెనీ చెబుతోంది. ఇప్పటికే కేఎస్పీఎల్, యూఎస్టీపీఎల్పై గ్రూపు ఇప్పటిదాకా రూ.2,500 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. నీటి కొరతతో తగ్గిన ఉత్పత్తి... నార్కట్ పల్లి ప్లాంట్లకు సరఫరా కావాల్సిన నీటి విషయంలో వివాదం రేగటంతో ఆ ప్రభావం ఉత్పత్తిపై పడుతోంది. యూఎస్‌టీపీఎల్ వార్షిక సామర్థ్యం 3 లక్షల టన్నులైనా ప్రస్తుతం 30వేల టన్నులే ఉత్పత్తవుతోంది. కేఎస్పీఎల్ వార్షిక సామర్థ్యం 3.5 లక్షల టన్నులు కాగా నెలకు 5 వేల టన్నులే ఉత్పత్తవుతోంది. నీరు లేక యూఎస్‌టీపీఎల్ ఉత్పత్తి ఏడాదిన్నర ఆలస్యం కాగా... ప్రస్తుతం భూగర్భ నీటితోపాటు వర్షపు నీటిని నిల్వ చేసి అరకొర ఉత్పత్తి సాగిస్తున్నారు. దీంతో నిర్వహణ వ్యయాలూ భారీగా పెరిగిపోయాయి. నిజానికి 2 ప్లాంట్లూ పూర్తి సామర్థ్యంతో నడిస్తే యూఎస్‌టీపీఎల్ నుంచి 60%, కేఎస్పీఎల్ నుంచి 80% మేర ఎగుమతులకు ఆస్కారం ఉంది. రూ.వెయ్యి కోట్ల పైబడిన ప్రాజెక్టుల అమలును కేబినెట్ కమిటీ ఆన్ ఇన్వెస్ట్మెంట్ సారథ్యంలోని మాని టరింగ్ గ్రూపు పర్యవేక్షిస్తోంది. కేఎస్పీఎల్, యూఎస్‌టీపీఎల్ కూడా దీని పర్యవేక్షణలో ఉన్నాయి. నార్కట్‌పల్లి ప్లాంట్లకు నీటి సరఫరాపై రాష్ట్ర సర్కారుకు ఈ గ్రూపు మెమోలూ జారీ చేసింది. అయి నా లాభం లేకపోవటంతో... రూ.3,000 కోట్లతో ప్రతిపాదించిన విస్తరణను కంపెనీ ప్రస్తుతానికి పక్కనబెట్టింది. విస్తరణ లేనట్టే. బ్యాంకర్లు వద్దన్నా... బిల్లెట్లు, పైపులు రెండూ తయారు చేసే గ్రూపు మాదొక్కటే. కర్ణాటక సర్కారు ఆహ్వానించినా, గుజరాత్ ను పరిశీలించినా... మన ప్రాంతంలో ఏర్పాటు చేయాలన్న మా చైర్మన్ ఆకాంక్ష మేరకు నార్కట్‌పల్లిలో నెలకొల్పాం. బ్యాంకర్లు వద్దన్నా, ప్రభుత్వ సబ్సిడీలు కూడా తీసుకోకుండా సొంత నిధులతో ఏర్పాటుచేశాం. 3,000 మంది ఉద్యోగులున్నారు. ఉదయసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి ఏటా 0.091 టీఎంసీల నీటిని ప్రభుత్వమే కేటాయించినా ప్రస్తుతం అందటం లేదు. ఈ వివాదాన్ని ఊహించి ఉంటే ఇంత పెట్టుబడి పెట్టేవాళ్లం కాదేమో!! నష్టాలతో ఎక్కువకాలం ప్లాంట్లను నడపలేం. - కామినేని శశిధర్, గ్రూప్ డెరైక్టర్