వేములవాడ ఫైర్‌స్టేషన్
సాక్షి, వేములవాడరూరల్: ఎలాంటి అగ్ని ప్రమాదం జరిగినా వెంటనే గుర్తుకు వచ్చేది అగ్నిమాపక వాహనం. అదే వాహనానికి నీరు లేకపోతే ఇక ఎలాంటి పరిస్థితి ఉంటుందో చెప్పనక్కర్లేదు. వేములవాడ మండల కేంద్రంలో ఉన్న అగ్నిమాపక కేంద్రంలో నీరు లేక అక్కడ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. ఇది అక్షరాలా సత్యం. గత కొన్ని నెలల క్రితం ప్రారంభించిన ఈ అగ్నిమాపక కేంద్రంలో మంచినీటి కొరకు బోరు వేయగా ప్రస్తుతం ఆ బోరు నీరు లేక అడుగంటుకుపోయింది. ఇక వాహనంలో నీరు నింపడానికి చెరువులు, బావుల వద్దకు పరుగులు తీయాల్సిన పరిస్థితి అక్కడ సిబ్బందికి ఏర్పడుతోంది. అసలే వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో ప్రతీరోజు ఎక్కడో ఒక్కచోట అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి.
అలాంటి సమయంలో ఈ వాహనంలో 24 గంటలు నీరు ఉండాల్సి ఉండగా నీటి సమస్య ఉండడం వల్ల సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. నాంపల్లి చెరువు లేక మల్లారం వెళ్లే బావి వద్ద నీరు తప్పా వారికి ఎలాంటి నీటి సౌకర్యం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి సౌకర్యం కల్పించాలంటూ మున్సిపాలిటీ అధికారులను కోరినప్పటికీ వారు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే ఈ సమయంలో ఇలాంటి కష్టం ఉంటే మరికొన్ని రోజుల్లో ఎండలు తీవ్రత పెరిగిన తరువాత ఇక వారి పరిస్థితి ఎలా ఉంటుందోనని వారు ఇప్పటి నుండి ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు పట్టించుకొని ఆకాశగంగ పైప్ లైన్ సౌకర్యం అగ్నిమాపక కేంద్రానికి కల్పించాలని వారు కోరుతున్నారు.
6 మండలాలకు ఇదే ఆధారం
వేములవాడ ఫైర్ స్టేషన్ వాహనం 6 మండలాలకు ఆధారంగా ఉన్నది. వేములవాడ, వేములవాడ రూరల్, బోయినపల్లి, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి మండలాల్లో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకున్నా వేములవాడ నుండే వాహనం వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి వాహనంలో నీరు అందుబాటులో ఉండాలి. రుద్రంగి మండలంలోని మానాల గ్రామంలో సంఘటన జరిగినా వేములవాడ నుండి వెళ్లాల్సిందే. ఇక్కడ నీరు అందుబాటులో 24 గంటలు ఉండాలి కానీ నీరు లేకపోవడంతో వారు ఉన్న 10 మంది మంది సిబ్బంది కూడా కాలకృత్యాలు తీర్చుకోవడానికి కూడా నీరు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఫైర్‌స్టేషన్ ఇన్‌చార్జి సతీష్‌కుమార్‌ను వివరణ కోరడానికి ప్రయత్నించగా అందుబాటులోకి రాకపోవడంతో అదే కార్యాలయంలో పని చేస్తున్న పవన్‌కుమార్ నీటి సమస్య మాత్రం తీవ్రంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment