శ్రేయా గరం మసాలా.. ఒబామా ఫ్యామిలీ ఫిదా
వాషింగ్టన్: శ్రేయా పటేల్.. తొమ్మిదేళ్ల ఈ ఇండియన్ అమెరికన్ చిన్నారి చేతి వంటకు ఒబామా ఫ్యామిలీ మొత్తం ఫిదా అయింది. అంతేకాదు.. తమతో డిన్నర్ చేయాల్సిందిగా అమెరికా ప్రధమ మహిళ నుంచి ఆహ్వానం అందుకుంది. ఇంతకీ ఒబామా, మిచెల్లీలను లొట్టలేసేలా చేయించిన ఆ వంటకం ఏదంటే.. పక్కా ఇండియన్ గరం మసాలా బర్గర్!
అమెరికాలో స్కూళ్లకు వెళుతోన్న 8 నుంచి 12 ఏళ్ల చిన్నారుల్లో ఎంతమందికి గరిటె తిప్పడం వచ్చు? పదార్థాల తయారీలో అమ్మలకు సహాయం చేసేవాళ్లు ఎంతమంది? అనే వివరాలు సేకరించి వాళ్లలో కొద్దిమందితో ప్రతిఏటా 'కిడ్స్ స్టేట్ డిన్నర్' అనే కార్యక్రమాన్ని నిర్వహించడం ఆ దేశంలో ఆనవాయితీ. ఈ ఏడాది పోటీల్లోనూ 55 మంది చిన్నారులు పాల్గొన్నారు. ప్రతివారు వంటకాన్ని తమ స్వహస్తాలతో తయారుచేయాల్సి ఉంటుంది. అవసరమైతే పెద్దల సాయం కూడా తీసుకోవచ్చు. అలా తన బామ్మ సహాయంతో శ్రేయా చేసిన గరం మసాలా బర్గర్‌ను ఒబామా, ఆయన భార్య రుచి చూశారు.
అంతే.. ఆ అదిరిపోయే రుచికి ఫిదా అయిపోయి శ్రేయాను పొగడ్తలతో ముంచెత్తారు. వారి ఆహ్వానం మేరకు శ్రేయా జులై 10న వైట్‌హౌస్‌కు వెళ్లి డిన్నర్ చేసొచ్చింది. కూరలు తరగడం, పాత్రలు తోమడం, వంట పనుల్లో అమ్మకు సహాయం చేయడం తనకు ఇష్టమైన పనులని, ఆ ఆసక్తితోనే గరం మసాలా బర్గర్ చేయడం నేర్చుకున్నానని చెప్పింది చిన్నారి శ్రేయ. అయితే పెద్దయ్యాక మాత్రం తన తండ్రిలానే ఫార్మసిస్టు కావాలని ఉందని చెప్పింది.