శ్రీరామ్ లైఫ్ నుంచి 3 కొత్త పథకాలు
- కొత్తగా 2,000 మంది ఏజెంట్ల నియామకం
- వచ్చే ఏడాది 55 శాఖల ఏర్పాటు
- బీమా బిల్లుతో పరిశ్రమ వేగంగా విస్తరిస్తుంది
- శ్రీరామ్ లైఫ్ సీఈవో మనోజ్ కుమార్ జైన్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఈ ఏడాదిలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా 30 శాతం వృద్ధిని నమోదు చేయగలమన్న ధీమాను ప్రైవేటురంగ జీవిత బీమా కంపెనీ శ్రీరామ్లైఫ్ ప్రకటించింది.
ఫిబ్రవరి నాటికి రూ. 415 కోట్ల కొత్త ప్రీమియం వసూళ్లు చేయడం ద్వారా వ్యాపారంలో 26 శాతం వృద్ధిని నమోదు చేశామని, కొత్తగా ప్రవేశపెట్టిన మూడు పథకాలతో పూర్తి ఏడాదికి రూ. 490 కోట్ల మార్కును చేరుకోగలమన్న ధీమాను శ్రీరామ్ లైఫ్ సీఈవో మనోజ్ కుమార్ జైన్ తెలిపారు. గతేడాది కంపెనీ రూ. 395 కోట్ల కొత్త ప్రీమియాన్ని వసూలు చేసింది. శుక్రవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనవరి వరకు జీవిత బీమా పరిశ్రమలో తొమ్మిది శాతం నెగిటివ్ వృద్ధి నమోదైనప్పటికీ, శ్రీరామ్లైఫ్ మాత్రం 26 శాతం అనుకూల వృద్ధిని నమోదు చేయగలిగిందన్నారు.
గత రెండేళ్ళలో కొత్తగా 250 శాఖలను ఏర్పాటు చేశామని, వచ్చే ఏడాది మరో 50 శాఖలను ఏర్పాటు చేయడంతో పాటు కొత్తగా 2,000 మంది ఏజెంట్లను నియమించుకునే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం శ్రీరామ్ లైఫ్ 414 శాఖలను, 5,000 మంది ఏజెంట్లను కలిగి ఉంది.
త్వరలో వాటా పెంపు
బీమా చట్ట సవరణ బిల్లుతో జీవిత బీమా రంగం వేగంగా విస్తరిస్తుందన్న నమ్మకాన్ని జైన్ వ్యక్తం చేశారు. విదేశీ భాగస్వామ్య కంపెనీ సన్లామ్ వాటాను 49 శాతం పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం వాటా పెంపు అంశం ఇంకా చర్చల దశలో ఉందని, బిల్లును పూర్తిగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.
కొత్త పథకాలు
శ్రీరామ్ లైఫ్ కొత్తగా మూడు పథకాలను ప్రవేశపెట్టింది. సింగిల్ ప్రీమియం పాలసీ గ్యారంటీడ్ ప్రిజర్వ్ వెల్త్ప్లాన్, ఐదేళ్ళ కాలపరిమితి ఉండే ఈజీ లైఫ్ కవర్ పాలసీలతో పాటు, కంపెనీల గ్రాట్యూటీ ఫండ్ నిర్వహణ కోసం గ్రూపు ఎంప్లాయీ బెనిఫిట్ పథకాలను ప్రవేశపెట్టింది. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ పథకాలను ప్రవేశపెట్టామని, త్వరలో మరో రెండు కొత్త పథకాలను ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.