వెండి రథంపై వాసవీ మాత
తాడేపల్లిగూడెం రూరల్ : శ్రీ దేవీ శరన్నవరాత్ర మహోత్సవాల ముగింపు సందర్భంగా తాడేపల్లిగూడెంలో వాసవీ మాత రథోత్సవాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు శిరమున కలశాలు ధరించి వెంటరాగా, వాసవీ మాత వెండి రథంపై పుర వీధుల్లో ఊరేగారు. పట్టణంలోని వాసవీ మాత రోథత్సవం గురువారం కనుల పండువగా సాగింది. సాయంత్రం స్థానిక ఏలూరు రోడ్డులోని వాసవి మాత పంచాయతన క్షేత్రం నుంచి పురవీధుల్లోకి రథం బయల్దేరింది. తొలుత రథంలో అమ్మవారిని ఉంచి వేద పండితులు పూజలు నిర్వహించారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామిజీ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, మునిసిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్, ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గమిని సుబ్బారావు వెండి రథాన్ని లాగి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పట్టణ పురవీధుల్లో రథోత్సవం ఉత్సాహంగా సాగింది.