ఉన్నతాధికారినంటూ ఘరానా మోసం
‘మీ ఉన్నతాధికారిని మాట్లాడుతున్నాను. మా బంధువు పరీక్ష రాసేందుకు వస్తే బ్యాగ్ కొట్టేశారు. హాల్ టికెట్, నగదు పోయింది. కాలేజీ నిర్వాహకులతో మాట్లాడి పరీక్ష రాయించే ఏర్పాట్లు చేయండి’ అంటూ..తానే కాలేజీ ప్రిన్సిపాల్ అవతారం ఎత్తి సెక్యూరిటీ డిపాజిట్ పేరిట నగదు గుంజుతున్న ఓ ఘరానా మోసగాడు సీసీఎస్ పోలీసులకు చిక్కాడు.
* నిందితుడి అరెస్టు
* రూ.50 వేల నగదు, సిమ్ కార్డులు స్వాధీనం
* సమాచారం ఇవ్వండి: ఏడీసీపీ
విజయవాడ సిటీ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు శాఖల ఉన్నతాధికారి పేరిట పలువురిని మోసగించి నగదు గుంజే తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన మాచిరాజు బాలత్రిపుర సుందరరావు అలియాస్ సుధీర్(30)ను సీసీఎస్(సెంట్రల్ క్రైం స్టేషన్) పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.50వేల నగదు, నేరం చేసేందుకు ఉపయోగించిన రెండు సిమ్‌కార్డులు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
అదనపు డీసీపీ(క్రైమ్స్) జి.రామకోటేశ్వరరావు శనివారం వన్‌టౌన్ పోలీసు స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ(క్రైమ్స్) గుణ్ణం రామకృష్ణతో కలిసి ఇందుకు సంబంధించిన వెల్లడించారు. అదనపు డీసీపీ కథనం ప్రకారం.. సుధీర్ సమాచార హక్కు చట్టం వెబ్సైట్ ద్వారా ఉన్నతాధికారులు, ఆయా శాఖలకు సంబంధించిన జోనల్, రీజినల్ అధికారుల వివరాలు, ఫోన్ నంబర్లు సేకరించి మోసాలకు పాల్పడుతున్నాడు. గత ఏడాది కాలంగా విజయవాడ, విజయనగరం, చిత్తూరు, కృష్ణాజిల్లా నందిగామ సహా ఎనిమిది చోట్ల అధికారులను మోసగించి సొమ్ము చేసుకున్నాడు. ముందస్తు సమాచారంతో నిందితుడు పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో ఉండగా సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకొని అరెస్టు చేశారు.
మోసగించేది ఇలా
ముందుగా తానుండే ప్రాంతంలో ఆటో డ్రైవర్, లాడ్జి నిర్వాహకులను పరిచయం చేసుకొని తన వాళ్లు డబ్బులు పంపుతారని చెప్పి బ్యాంక్ అకౌంట్ నంబరు తీసుకుంటాడు. అనంతరం ముందుగా సేకరించుకున్న నంబర్లలో ఏదైనా ప్రభుత్వ శాఖ ఉన్నతాధికారి పీఏ(సహాయకుడు) లాగా దిగువస్థాయి అధికారులతో మాట్లాడతాడు. తన బాస్ మాట్లాడతాడని చెప్పి..తానే ఫోన్ వెనక్కి తిప్పి మాట్లాడుతూ తమ బంధువును కాలేజీ ప్రిన్సిపాల్ పరీక్ష రాయనీయడం లేదని చెప్పి మాట్లాడమంటూ తనకే చెందిన మరో ఫోన్ నంబర్ ఇస్తాడు.
అటునుంచి ఫోన్ రాగానే తనను తాను ప్రిన్సిపల్‌గా చెప్పుకొని హాల్ టికెట్టు లేకుండా పరీక్ష రాయడం కుదరదని, కావాలంటే రూ.20వేలు సెక్యూరిటీ డిపాజిట్‌గా చెల్లిస్తే అవకాశం కలిపిస్తామని చెపుతాడు. బాస్ తాలూకు బంధువును పరీక్ష రాయించాలనే నిర్ణయంతో కాలేజీ ప్రిన్సిపాల్ పేరిట ఇచ్చే అకౌంట్లో డబ్బు జమ చేస్తాడు.
ఆ డబ్బు జమ అయిన వెంటనే ముందుగానే చెప్పినట్టు వారిని కలిసి డబ్బులు డ్రా చేయించుకొని ఉడాయిస్తుంటాడు. నగరంలోని కాలుష్య నియంత్రణ మండలి(పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) అధికారిని ఇలానే బురిడీ కొట్టించి డబ్బు గుంజినట్టు పోలీసుల విచారణలో నిందితుడు అంగీకరించాడు. ఇప్పటి వరకు 11 వరకు ఈ తరహా మోసాలు చేశాడని డీసీపీ తెలిపారు.
సమాచారం ఇవ్వండి
ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అదనపు డీసీపీ(క్రైమ్స్) జి.రామకోటేశ్వరరావు తెలిపారు. ఇలాంటి నేరాల గురించి తెలిసినా, అనుమానం వచ్చినా తన మొబైల్ నంబరు 94406 27057, ఏసీపీ(క్రైమ్స్) నెం. 94409 06871 లేదా 100, 1090కి తెలియపరచాలన్నారు. విలేకరుల సమావేశంలో ఎస్సైలు కె.శ్రీధర్, వి.అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.