సీఎం దిష్టిబొమ్మ దహనం
నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్ : తెలంగాణవాదులపై సీమాంధ్రుల దాడికి నిరసనగా తెలంగాణ విద్యార్థి నిర్మాణ సమితి ఆధ్వర్యంలో గురువారం స్థానిక ఎన్జీ కాలేజీ గేటు ఎదుట సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా టీవీఎన్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు అబ్బగోని అశోక్‌గౌడ్ మాట్లాడుతూ సేవ్ఆంధ్రప్రదేశ్ సభపేరుతో సీమాంధ్ర ఉద్యోగులు, రౌడీలు, గుండాలు హైదరాబాద్‌లో తిష్టవేసి శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ర్యాలీగా బయలుదేరిన టీఎస్‌జేఏసీ నేత దూదిమెట్ల బాలరాజు యాదవ్, కానిస్టేబుల్ శ్రీనివాస్‌గౌడ్‌లపై దాడులు చేశారన్నారు.
సీమాంధ్ర అల్లరిమూకను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. సీమాంధ్రులు ఎన్ని సభలు పెట్టినా, ఎన్ని ఆటంకాలు సృష్టించినా హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణను సాధించుకుంటామన్నారు. సీఎం, డీజీపీలు సీమాంధ్రుల పక్షపాతులుగా వ్యవహారిస్తూ తెలంగాణ ప్రజల సహనాన్ని పరీక్షించవద్దని సూచించారు. కార్యక్రమంలో సురేశ్, బీరప్ప, శైలేష్, శివ, రమేశ్, లింగస్వామి, రవి, అరుణ్, వెంకట్, నర్సింహ పాల్గొన్నారు.