అసెంబ్లీలో సమైక్యాంధ్ర తీర్మానం చేయాలి: సీమాంధ్ర మంత్రులు
హైదరాబాద్: అసెంబ్లీని సమావేశపరచి సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి డిమాండ్ చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
సమైక్యాంధ్ర తీర్మానం వల్ల ఒరిగేదేమీ లేదన్న సీఎం వ్యాఖ్యలతో మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి వ్యతిరేకించారు. అసెంబ్లీని సమావేశపరచి సమైక్యాంధ్ర తీర్మానం చేయాలన్నారు. అలా తీర్మానం చేస్తే ఈ అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పారు. ఏరాసు మాటలను మంత్రులు సమర్ధించారు. మభ్యపెట్టే మాటలు వద్దని మంత్రులు తెగేసి చెప్పారు. సొంత పార్టీలోనే సీఎం పట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జిఓఎంకు నివేదిక ఇస్తే విభజనకు అనుకూలమవుతుందని కొంతమంది అభిప్రాయపడ్డారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని సీమాంధ్రుల తరపున జిఓఎంకు తెలపాలని మంత్రి శైలజానాధ్ చెప్పారు.