Singapore Prime Minister
-
Singapore PM: మే 15న పదవి నుంచి తప్పుకుంటా: లూంగ్
సింగపూర్: సింగపూర్ ప్రధానిగా దాదాపు రెండు దశాబ్దాలపాటు కొనసాగిన లీ సీయన్ లూంగ్(72) రిటైర్మెంట్ ప్రకటించారు. మే 15వ తేదీన బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు లూంగ్ సోమవారం తెలిపారు. అదే రోజూన ఉప ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్(51) ప్రధానిగా బాధ్యతలు చేపడతారన్నారు. సింగపూర్ మూడో ప్రధానిగా 2004లో లూంగ్ బాధ్యతలు చేపట్టారు. ఏ దేశానికైనా నాయకత్వ మార్పిడి ఎంతో ముఖ్యమైన విషయమని ఆయన ఫేస్బుక్లో పేర్కొన్నారు. సింగపూర్‌కు మరింత ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు వాంగ్ ప్రభుత్వానికి సహకారం అందించాల్సిందిగా ప్రజలను ఆయన కోరారు. -
బుద్ధి చెప్పువాడు గుద్దిన నేమయా?!
ఇటీవల సింగపూర్ పార్లమెంటులో ఆ దేశ ప్రధాని లీ సీన్ లూంగ్ భారత్ ప్రస్తావన తేవడం మన దేశంలో రాజకీయ దుమారం రేపింది. ఉన్నత విలువలు, ఆదర్శాలతో నెహ్రూ రూపుదిద్దిన ఇండియాలో నేడు సగం మంది పార్లమెంటు సభ్యులు నేర చరిత్ర ఉన్నవారేనని లీ సీన్ అనడంపై భారత ప్రభుత్వ వర్గాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. గౌరవ పార్లమెంటేరియన్ల అవినీతి చర్యల గురించి ఒకటి కాదు, పదుల సంఖ్యలో సాధికారికమైన ఫిర్యాదుల్ని నమోదు చేసి, నివారణ చర్యల్ని నివేదికలు ప్రతిపాదించినా ఫలితం శూన్యం కావడం వల్లనే సింగపూర్ ప్రధాని తమ దేశస్థుల్ని హెచ్చరిస్తూ బహుశా ఆ ప్రకటన విడుదల చేయవలసి వచ్చి ఉంటుంది! ‘బుద్ధి చెప్పువాడు గుద్దిన నేమయా’ అని వేమన అన్నట్లు.. సింగపూర్ ప్రధానిపై మనం ఆగ్రహం వ్యక్తం చేయడం కాదు... ఆయన మాటలపై ఆలోచన సారించాలి. ‘‘భారత పార్లమెంటు సభ్యుల్లో సగం మంది నేర చరితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారని.. ఇండియా, ఇజ్రాయిల్‌లలో నేడు ఇదే పరిస్థితి కొనసాగుతోంద’’ని సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్ తమ పార్లమెంటులో (15.2.2022) ప్రకటించారు. దేశ ప్రధాన ప్రతిపక్షమైన వర్కర్స్ పార్టీ ఉదాహరించిన వివరాల ఆధారంగా ఆయన ఈ ప్రకటన విడుదల చేశారు. అలాంటి దుఃస్థితి వైపు సింగపూర్ ప్రయాణించకుండా జాగ్రత్త పడవలసిన అవసరాన్ని ఆయన గుర్తు చేస్తూ భారతదేశాన్ని ఉదాహరించారు. అందుకు భారత ప్రభుత్వ వర్గాలు తీవ్ర అభ్యంతరం తెల్పాయి. మన ‘భాగోతం’ మనకు తెలుసు కాబట్టి, ‘ఉన్నమాటంటే ఉలుకెక్కువ’. అందుకే వేమన మహాకవి శతాబ్దాల క్రితమే ‘బుద్ధి చెప్పువాడు గుద్దిన నేమయా’ అని హెచ్చరించాల్సి వచ్చింది! అందుకే మన దేశంలో ‘డబ్బున్న వాడి వీపు పుండైనా ప్రపంచానికి వార్తయిపోతుంది, పేదవాడింట్లో పెళ్లయినా లోకానికి తెలియదు’ అంటారు! ఇప్పుడీ నీతి పాఠం ఎకాఎకిన మన ఇంటి ఆవరణలోకే ప్రవేశించాల్సి వచ్చింది. ఏళ్లూ, పూళ్లూగా కరెక్షన్ దూరమై, కరప్షన్‌కు దగ్గరవుతూ వచ్చిన సగంమంది పార్లమెంటు సభ్యుల దుఃస్థితిని దఫదఫాలుగా ఎవరో సింగపూర్ ప్రధానమంత్రి వచ్చి చెప్పకుండానే పలు భారత సాధికార విచారణ సంస్థలు, సంఘాలు, పౌర సమాజాలు బహిర్గతం చేస్తున్నా, శరీరాలతోపాటు మనస్సులూ మొద్దుబారుతూ వస్తున్నాయి. అందుకే ‘బుద్ధి చెప్పేవాడు ఒక గుద్దు గుద్దినా’ లబోదిబోమన కూడదన్నాడు వేమన! నిలవని వాద ప్రతివాదాలు ఇంతకూ ఈ ‘జబ్బు.. వ్యక్తి లోపం వల్ల వచ్చిందా, వ్యవస్థ లోపంవల్ల పుట్టుకొస్తుందా అంటే ‘చెట్టు ముందా, విత్తు ముందా’ అన్న వాదనలోని ఔన్నత్యం వైపు ‘మోరలు’ చాచవలసిందే! ఎందుకంటే తుమ్మ చెట్టుకు ముళ్లు మొక్కతోనే పుడతాయి. దానికి ఆ లక్షణం సహజం. అలాగే వ్యవస్థ, దానిని అనుసరించి వ్యక్తీ! అందుకే, దేశ అత్యున్నత శాసన వేదికగా, దేశానికి దిక్సూచీగా ఉండవలసిన భారత పార్లమెంటరీ వ్యవస్థ, దాని గౌరవ సభ్యులూ గాడి తప్పి వ్యవహరించడానికి అసలు కారణం... ‘భారత పౌరులమైన మేము, మేముగా రచించుకుని, రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకున్నందున అందుకు అనుగుణంగానే’ లౌకిక సెక్యులర్ వ్యవస్థను రక్షించుకుని కాపాడుకునే బాధ్యత కూడా తమపైనే ఉందని ప్రకటించు కోవడమేనని రెండో మాటకు తావు లేకుండా స్పష్టం చేసుకున్నారు. అందువల్ల మరో ‘మడత పేచీ’కి ఇక్కడ ఆస్కారం లేదు! అయినా, నిరంతరంగా గౌరవ పార్లమెంటులలో సగం మందికి పైగా లౌకిక రాజ్యాంగ ఉల్లంఘనలకు, అవినీతికి పాల్పడుతూ ఉండటానికి కారణం వ్యవస్థలోని లొసుగులు, ‘రబ్బరులా’ సాగదీసే పార్ల మెంటేరియన్ల నిలవని వాద ప్రతివాదాలూ! కనుకనే బుద్ధి చెప్పేవాళ్లు ఎవరైనా నాలుగు గుద్దులు వేయడం, మనం భరించాల్సి రావటం సహజం! అనుమానాలకు తావిస్తున్నామా? గౌరవ పార్లమెంటేరియన్ల అవినీతి చర్యల గురించి ఒకటి కాదు, పదుల సంఖ్యలో సాధికారికమైన ఫిర్యాదుల్ని నమోదు చేసి, నివారణ చర్యల్ని నివేదికలు ప్రతిపాదించినా ఫలితం శూన్యం కావడం వల్లనే సింగపూర్ ప్రధాని తమ దేశస్థుల్ని హెచ్చరిస్తూ బహుశా ఆ ప్రకటన విడుదల చేయవలసి వచ్చి ఉంటుంది! చివరికి మన ప్రవర్తన కూడా ఎలా తయారైందంటే.. ఇరుగు పొరుగు సఖ్యతను సదా కోరుకొంటూ ఆసియా దేశాల భద్రతకు అగ్రస్థానంలో ఉండి నాయకత్వం వహిం చాల్సిన మనం ఆ అవకాశాన్ని ఆసియావాసులు కాని వలస సామ్రాజ్య పాలకులైన ఆంగ్లో–అమెరికన్ల చొరవకు మరోసారి మనమే అవకాశం కల్పిస్తోంది. అదే మన ఇరుగుపొరుగు దేశాలలో అనేక అనుమానాలకు దారి తీస్తోందన్న గ్రహింపు మనకు తక్షణం అవసరం. పైగా ఆంగ్లో–అమెరికన్ వలస సామ్రాజ్యవాద వ్యూహా లలో ఆసియా–ఆఫ్రికా ఖండ దేశాల ప్రయోజనాలకు విరుద్ధంగా బాహా టంగా ఇజ్రాయిల్‌తో ‘పెగసస్’ గూఢచర్యంలో పాలుపంచుకుని అభాసుపాలవుతున్న మన రక్షణ వ్యవస్థ ప్రయోజనాలనే మన గౌరవ సుప్రీంకోర్టు ప్రశ్నించి, ఊగించి శాసించవలసిన పరిస్థితి వచ్చింది. అలా చివరకు దేశ పరువు ప్రతిష్ఠలకు ఎంతటి హాని కల్గిందో ప్రశ్నించుకోవలసిన అగత్యంలో మనం ఉన్నాం! గుజరాత్ ఒక ఉదాహరణ సుప్రీం విశిష్ట సలహాదారు రాజూ రామచంద్రన్ గుజరాత్ మైనారిటీ లపై సాగిన ఊచకోతలపై సుప్రీంకోర్టుకు సమర్పించిన సుదీర్ఘ సమగ్ర నివేదిక గతి ఏమైనట్టు? ఎందుకు ఇప్పటిదాకా దాని అతీగతీ తెలి యనివ్వకుండా ‘చెదలు’ పట్టించాల్సి వచ్చింది? ఆ నివేదిక పూర్తి పాఠాన్ని ప్రజలకు అందనివ్వకుండా చేసిందెవ్వరు? నాటి గుజ రాత్లో మైనారిటీలపై జరిగిన దుర్మార్గాలకు బాధ్యులైన పాలకుల్ని ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరాన్ని రామచంద్రన్ తన నివేదికలో సుప్రీంకోర్టుకు ఎందుకు సలహా ఇవ్వవలసి వచ్చింది? అంతటి తీవ్రమైన అభియోగాన్ని గుజరాత్ పాలకులపై మోపి శిక్షార్హులుగా ప్రకటించిన సుప్రీం సలహాదారు నివేదికను చివరికి ఎలా పాలకులు తొక్కిపట్టి ‘చెదలు’పట్టించారు? తుదకు నాటి బీజేపీ గుజరాత్ పాల కులకు అండగా భారత చట్టాలు అమలు జరగాల్సిన తీరుతెన్నుల్ని నిర్ధారించవలసింది, విచారించవలసింది లాయర్లు, సుప్రీం సలహా దారులూ కాదని, విచారణ అనేది పోలీసుల పనిగానీ, లాయర్ల పని కాదని అరుణ్ జైట్లీ లాంటి బీజేపీ నాయకుడు వాదించ సాహ సించారు! చివరికి జరిగిన పని – సుప్రీం విచారించకుండానే రామ చంద్రన్ నివేదికను పక్కన పెట్టించేయడం. ఈ భాగోతాన్ని క్షుణ్ణంగా ఆనాటి ‘ఇండియా’ పత్రికలో (2012 మే 7) రోహిత్ ఖాన్, వైద్య నాథన్ సమగ్రంగా ప్రచురించారు. ఆత్మవిమర్శనంటేనే ఏవగింపా! భారత తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, ఇజ్రాయిల్ మాజీ ప్రధాని బెన్ గురియన్ తమ దేశాలు స్వాతంత్య్రం పొందడానికి చేసిన కృషితో పోలిస్తే ఆ తరువాత దేశాధికారంలోకి వచ్చిన రాజకీయవేత్తల తరం... తరువాతి పాలకుల నైతిక విలువలు క్షీణదశకు దారి తీశాయని సింగపూర్ ప్రధాని వ్యాఖ్యానించడం మన నేటి పాలకుల అసమ్మతికి కారణం అయి ఉంటుంది, అది భారత రాజకీయాలలో ప్రత్యక్ష జోక్యంగా భావించడమూ సహజం. కానీ, ఆత్మవిమర్శన అనేది ఈ తరం భారత నాయకులలో కొందరికి ఏవగింపుగా మారి నందున, సవరణకు వారి మనస్సు ఇష్టపడదు. ఎందుకంటే తుమ్మ చెట్టుకు ముళ్లు మొక్కతోనే పుడతాయి, దానికి ఆ లక్షణం దాని వినాశంతోనే గానీ పోదట! ఎందుకంటే, కనీసం ఎద్దుకు ఏడాదిపాటు నేర్పితే మాట తెలిసి నడుచుకుంటుందటగానీ మూఢునికి ముప్పయ్యే ళ్లయినా, వాడి మూఢత్వం పోదట. కనుకనే ‘బుద్ధి చెప్పేవాడు ఓ గుద్దు గుద్దినా తప్పులేదన్న’ మాటను తన నాటి అనుభవాల్ని బట్టి వేమన ఖరారు చేసి ఉంటాడు! దేశ పౌరహక్కుల చట్టంపై పాలకులు ‘చురకత్తి’ పెట్టి బెదిరిస్తున్నప్పటినుంచీ వేమన్న గుర్తుకు రాని క్షణ మంటూ ఈ రోజు వరకూ లేదు సుమా! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
నెహ్రూస్ ఇండియా, ఎంపీల నేరచరిత్రపై వ్యాఖ్యలు చేసిన సింగపూర్ పీఎం... తప్పుబట్టిన భారత్!
India has slammed the Singapore Prime Minister's comments: సింగపూర్ పార్లమెంట్లో సిటీ-స్టేట్‌లో ప్రజాస్వామ్యంపై ఉద్వేగభరితమైన చర్చ సందర్భంగా ప్రధాని లీ హ్సీన్ లూంగ్ భారతదేశ మొదటి ప్రధానమంత్రి గురించి ప్రస్తావించారు. నెహ్రూస్ భారత్‌లో లోక్‌సభలో దాదాపు సగం మంది ఎంపీలపై అత్యాచారం హత్య ఆరోపణలతో సహా క్రిమినల్ అభియోగాలు పెండింగ్‌లో ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. అంతేకాదు వీటిలో చాలా మటుకు రాజకీయ ఆరోపణలు కూడా ఉన్నాయని లీ అన్నారు. ఈ వ్యాఖ్యలను సింగపూర్ పార్లమెంట్లో ప్రజాస్వామ్యం ఎలా పని చేయాలనే అంశంపై జరిగిన ఉద్వేగభరితమైన చర్చ సందర్భంగా లీ ఈ వ్యాఖ్యలు చేశారు. "చాలా దేశాలు ఉన్నతమైన ఆదర్శాలు. గొప్ప విలువల ఆధారంగా ఏర్పడినవే కానీ ఆ తర్వాత రానురానూ రాజీకీయ ఆకృతి మారుతోంది. చాలా రాకీయ పార్టీలు తమ వ్యవస్థాపక నాయకులను విస్మరిస్తోంది." అని లీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఈ ప్రసంగంలో ప్రధాని లీ భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో సహా వివిధ ప్రధాన మంత్రుల గురించి ప్రస్తావిస్తూ..." చాలా దేశాలు మొదట చాలా ఉద్వేగభరితంగా ఏర్పడ్డాయి. డేవిడ్ బెన్-గురియన్లు, జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్య్రం కోసం పోరాడి సాధించిన గొప్ప నాయకులు. గొప్ప ధైర్యం అపారమైన సంస్కృతి, అద్భుతమైన సామర్థ్యం కలిగిన అసాధారణ వ్యక్తులు. అంతేకాదు వారు అపారమైన వ్యక్తిగత ప్రతిష్టతో, ధైర్యవంతమైన కొత్త ప్రపంచాన్ని నిర్మించడానికి, దేశంలోని ప్రజల కొత్త భవిష్యత్తును రూపొందించడంలోనూ ప్రజల అంచనాలను అందుకోవడానికి సదా ప్రయత్నిస్తారు. కానీ ఈ ప్రారంభ ఉత్సాహాన్ని తరువాత తరాలకు కొనసాగించడం లేదా నడిపించడంలో విఫలమవ్వడం లేదా కష్టమవుతోంది. అలాగే బెన్-గురియన్స్ ఇజ్రాయెల్ రెండేళ్లలో నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ, కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంతోనే సరిపోయిందని, సీనియర్ రాజకీయ నాయకులు అధికారులు నేరారోపణలను ఎదుర్కొన్నారు". అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సింగపూర్‌లో ప్రజాస్వామ్యం ఎలా ? ఉండాలి, ఆ మార్గంలో పయనించకుండా ఉండాలంటే ఏం చేయాలని ప్రశ్నించారు. మనమేమి గొప్ప తెలివైనవాళ్లం, ధర్మాత్ములం కాదు కాబట్టి తరం వెంబడి తరం వ్యవస్థను పర్యవేక్షించి దాని నిర్మాణాన్ని కొనసాగిస్తే సాధ్యమవుతుందని లీ పేర్కొన్నారు. ఈ మేరకు భారత్ సింగపూర్ ప్రధాని లీ నెహ్రూస్ ఇండియా పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిడమే కాక అనవసరమైన వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. అంతేకాదు విదేశాంగ మంత్రిత్వ శాఖ సింగపూర్ హైకమిషనర్‌ను పిలిపించి తమ అభ్యంతరాన్ని తెలియజేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. (చదవండి: ప్రతి సమస్యకు తొలి ప్రధాని నెహ్రునే నిందిస్తున్నారు: మన్మోహన్ సింగ్) -
స్వచ్ఛ భారతానికి ఉమ్మడిగా కృషి
పారిశుభ్రతకు జాతీయప్రాధాన్యం ఇచ్చిన మహాత్ముడి మార్గంలోనే సింగపూర్ ప్రయాణించి లక్ష్య సాధనలో విజయం సాధించింది. నేడు పరిశుభ్ర వాతావరణం సృష్టించి, ప్రజారోగ్యం కాపాడే దిశగా కృషి చేస్తున్న భారత్‌కు సహకరించడానికి సింగపూర్ సిద్ధంగా ఉంది. భారత్‌తో పోల్చితే సింగపూర్ అతి చిన్న దేÔ]lమే అయినా సంపూర్ణ పారిశుద్ధ్యం దిశగా రెండు దేశాల ప్రయాణాల్లో పోలికలున్నాయి. 2019 నాటికి ‘పరిశుభ్ర భారతదేశం’ అనే లక్ష్య సాధనకు స్వచ్ఛ్ భారత్ మిషన్ ఉద్యమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాలుగేళ్ల క్రితం ప్రారంభించారు. 2019 అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ 150వ జయంతి కావడంతో అప్పటికి లక్ష్యం సాధించాలని నిర్ణ యించారు. పారి శుద్ధ్యాన్ని జాతీయ ప్రాధాన్యం గల అంశంగా మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ ప్రోత్సహించారు. గడచిన నాలుగు సంవత్సరాల్లో ఈ విషయంలో భారత్ గొప్ప పురోగతి సాధించింది. దేశంలోని కోట్లాది ప్రజల కోసం ఎనిమిది కోట్ల 60 లక్షలకు పైగా మరుగుదొడ్లు నిర్మించారు. దాదాపు ఐదు లక్షల (4,70,000) గ్రామాలను ఆరు బయలు మల విసర్జన లేని గ్రామాలుగా ప్రకటించారు. సింగపూర్ కూడా ఇదే మార్గంలో నడిచింది. మాకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ మా ప్రజల కోసం పరిశుభ్ర, పచ్చని వాతావరణం కల్పించడానికి మేమెంతో కష్టపడి పనిచేశాం. తొలి రోజుల్లో అనేక ఇళ్లకు మురుగునీటి సౌకర్యాలు లేవు. మలాన్ని బకెట్లతో సేకరించి బాగా చెడు వాసన వచ్చే లారీల్లో దాన్ని మురుగు శుద్ధి ప్లాంట్లకు రవాణా చేసేవారు. అయితే, తరచు మానవ వ్యర్థాలను దగ్గరలోని కాలవలు, వాగులు, నదుల్లో పడేసేవారు. దీంతో వీటి జలాలు కలుషితమయ్యేవి. అపరిశుభ్ర జీవన పరిస్థితులు ఎన్నో ప్రజారోగ్య సమస్యలకు కారణమయ్యాయి. తరచు నీటి వల్ల కలిగే వ్యాధులు ప్రబలడానికి దారితీశాయి. ఈ పరిస్థితుల్లో నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని మా దేశ నిర్మాతలు నిర్ణయించారు. ‘పరిశుద్ధ సింగపూర్’ లక్ష్య సాధనకు వారు జాతీయస్థాయి ప్రచారోద్యమం ప్రారంభించారు. మేం ప్రతి ఇంటినీ శుభ్రం చేసుకున్నాం. మా నదులనూ పరిశుభ్రం చేశాం. ఈ క్రమంలో మేం వేలాది మంది ఆక్రమణదారులను ఖాళీచేయించాం. పెరటి పరిశ్రమలను, పందుల పెంపకం దొడ్లను, ఇంకా నదీపరీవాహక ప్రాంతంలో కాలుష్యానికి కారణమైన ఎన్నింటినో తొలగించాము. ఇంతటి కృషి ఫలితంగా నేడు స్వచ్ఛమైన సింగపూర్ నది నగరం గుండా ప్రవహిస్తూ మరీనా రిజర్వాయర్‌లో కలుస్తోంది. ఈ జలాశయమే మా జాతీయ నీటి సరఫరా వ్యవస్థకు ఆధారం. వైవిధ్యభరిత భారతం! సింగపూర్‌తో పోల్చితే ఎంతో వైవిధ్యభరిత దేశం భారత్. సింగపూర్ నది కంటే గంగా నది దాదాపు వెయ్యి రెట్లు పెద్దది. అయినా, పరశుభ్రత వైపు సాగిన ప్రయాణంలో భారత్, సింగపూర్‌లకు కొన్ని పోలికలున్నాయి. మొదటిది, రెండు దేశాల అనుభవాలు దేశ దార్శనికత, నాయకత్వం ప్రాధాన్యాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. దివంగత సింగపూర్ ప్రధానమంత్రి లీ కాన్ యూ, భారత ప్రధాని నరేంద్రమోదీలు ఇరువురూ తమ దేశాలు పరిశుభ్రంగా, ఆకుపచ్చగా ఉండాలన్నది తమ ప్రాధాన్యతగా పెట్టుకున్నారు. ఈ విషయంలో ప్రజలను సమీకరించి, వారిలో చైతన్యం పెంచడానికి జన చేతన ఉద్యమాలను స్వయంగా నడిపించారు. ప్రజలతో కలిసి ఈ ఇద్దరు నేతలూ చీపుర్లు చేతపట్టి వీధులు ఊడ్చారు. లీ తనకు వ్యక్తిగతంగా ప్రేరణ అనీ, మన జీవనశైలిలో మార్పు ద్వారానే దేశంలో మార్పు మొదలవుతుందనే లీ ఆలోచన నుంచి తాను స్ఫూర్తి పొందానని ప్రధాని మోదీ చెప్పారు. ఈ రకంగా చూస్తే, వాస్తవానికి స్వచ్ఛ భారత ఉద్యమం కేవలం భారతదేశంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమం మాత్రమే కాదు, మన ఆలోచన, మన పని, మన జీవన విధానంలో పరివర్తన తెచ్చే లోతైన సంస్కరణగా పరిగణించాలి. ఇక రెండో విషయం, జాతీయస్థాయిలో దీర్ఘకాలిక నిబద్ధత ఉంటేనే ఏ విషయంలోనైనా విజయం సాధించడం వీలవుతుంది. మా మురుగునీరు, నీటిపారుదల వ్యవస్థలను వేరుచేసి సింగపూర్ సర్కారు సూవరిజ్ మాస్టర్ ప్లాన్‌ను అమలు చేసింది. వర్షపు నీరు కలుషితం కాకుండా నివారించడం, ఈ నీటిని సేకరించి సద్వినియోగం చేసుకోవడమే దీని లక్ష్యం. అదే సమయంలో సింగపూర్‌లో ఒకసారి వాడిన నీటిని మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో శుభ్రం చేసి మళ్లీ ఉపయోగిస్తున్నారు. ఈ నీటిని రివర్స్ ఆస్మాసిస్ పద్ధతి ద్వారా శుద్ధి చేసి మంచి తాగు నీరు ఉత్పత్తి చేస్తున్నారు. ఇది అత్యంత పరిశుభ్రమైన, అత్యున్నత ప్రమాణాలతో కూడిన మంచి నీరు. అయితే, ఒకసారి వాడిన నీటిని ఏం చేయాలనే సమస్య తలెత్తింది. దీనికి పరిష్కారం దొరికింది. ఇది నీటి కొరత అనే మరో సమస్యకు పరిష్కారమార్గమైంది. భారతదేశంలో పారిశ్రామిక సంస్థలు, పాఠశాలలు వంటి వివిధ వర్గాల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ మిషన్ ఉద్యమ రూపంలో ముందుకు సాగడం ఆశాజనకమైన ఫలితాలనిచ్చింది. 2006 నాటికి ఇండియాలో 50 శాతం పాఠశాలల్లో మాత్రమే పారిశుద్ధ్య సౌకర్యాలుండేవి. అయితే, ప్రస్తుతం దేశంలో దాదాపు అన్ని స్కూళ్లలో మరుగుదొడ్లు వంటి అన్ని రకాల పారిçశుద్ధ్య ఏర్పాట్లు ఉన్నాయి. ఈ వివరాలను ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ 2018 సంవత్సరానికి సంబంధించి పాఠశాలల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత అనే అంశాలపై విడుదల చేసిన ప్రపంచ బేస్‌లైన్ నివేదికలో వెల్లడించింది. అంతర్జాతీయ సహకారానికే పెద్ద పీట! ఇక మూడో అంశం ఏమంటే, సింగపూర్, భారతదేశం రెండూ అంతర్జాతీయ సహకారానికి విలువనిస్తాయి. ఒక సమస్యకు ఒక దేశంలో అమలు చేసే పరిష్కారమార్గం మరో దేశంలో పనిచేయకపోవచ్చు. అయితే, మనం ఇతర దేశాల నుంచి విషయాలు నేర్చుకోవడం, వారి అనుభవాలను తెలుసుకోవడం వల్ల మనమంతా ప్రయోజనం పొందవచ్చు. మహాత్మాగాంధీ ప్రారంభ అంతర్జాతీయ పారిశుద్ధ్య సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు భారతదేశాన్ని నేను అభినందిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశుద్ధ్య నిపుణులు, ఉద్యమకారులు, నాయకులను ఈ సదస్సు ఒక చోటకు చేర్చింది. వారంతా తమ అనుభవాల గాథలను పంచుకున్నారు. సింగపూర్ కూడా ప్రపంచ నగరాల ద్వైవార్షిక శిఖరాగ్రసభ, అంతర్జాతీయ జల వారోత్సవం వంటి అంతర్జాతీయ సమావేశాలను నిర్వహిస్తోంది. పారిశుద్ధ్యరంగంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాలుపై అవగాహన కల్పించడానికి ‘అందరికీ పరిశుభ్రత’ అనే సింగపూర్ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి 2013లో ఆమోదించింది. అంటే, నవంబర్ 19ని ప్రపంచ టాయ్‌లెట్ దినంగా పాటించాలనే సింగపూర్ ఆలోచనకు ఐరాస మద్దతు పలికింది. భారత్‌తో అనుభవాలను పంచుకోవడం ఆనందదాయకం భారత్‌తో మరింత మెరుగైన జీవనానికి, దేశవ్యాప్తంగా ప్రగతి సుస్థిరంగా నిలిచే స్మార్ట్ నగరాల అభివృద్ధికి తన కృషి కొనసాగిస్తున్నందున సింగపూర్ తన అనుభవాలను భారత్‌తో పంచుకోవడం ఆనందదాయక అనుభవంగా భావిస్తోంది. నగర ప్లానింగ్, నీటిసరఫరా, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై వందలాది మంది అధికారులకు శిక్షణ ఇవ్వడానికి భారతదేశ టౌన్, కంట్రీ ప్లానింగ్ సంస్థతో కలిసి సింగపూర్ పనిచేస్తోంది. తమ నగరాల అభివృద్ధికి కృషిచేస్తున్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు సహకరించడానికి, పరిష్కారమార్గాలు సూచించడానికి సింగపూర్ సిద్ధంగా ఉంది. స్వచ్ఛ భారత్ విషయంలో భారత ప్రజలకు, నరేంద్రమోదీకి శుభాకాంక్షలు. రాబోయే తరాలకు శుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం అందించాలన్న ఐరాస లక్ష్యాల సాధనలో రెండు దేశాల మధ్య మరింత సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను. లీ సియస్ లూంగ్ సింగపూర్ ప్రధాని -
కాన్వాయ్ వద్దని.. బస్సులో వెళ్లిన ప్రధాని
సింగపూర్ దేశంలో వ్యక్తిగత వాహనాల కంటే ప్రజారవాణా చాలా ఎక్కువ. అక్కడ వ్యక్తిగత వాహనాలు ఉపయోగించడానికి ఉండే అవకాశం చాలా తక్కువ. అందుకేనేమో.. ఆ దేశ ప్రధానమంత్రి లీ సైన్ లూంగ్ భారతదేశంలో ఐదు రోజుల పర్యటన కోసం ఢిల్లీకి వచ్చినా.. ఆయన తన కోసం కేటాయించిన భారీ వీఐపీ కాన్వాయ్ వద్దని.. ఒక ప్రత్యేక బస్సులో తాను బస చేయాల్సిన హోటల్‌కు వెళ్లిపోయారు. దీంతో ఆయనను స్వాగతించేందుకు వచ్చిన అధికారులంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఐదు రోజుల భారతదేశ పర్యటనలో భాగంగా లూన్ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో పాటు పలువురు నేతలతో సమావేశమై చర్చలు జరుపుతారు. ప్రధానంగా భద్రత, వాణిజ్యం, పెట్టుబడుల గురించి ఈ చర్చలు ఉంటాయని అంటున్నారు. పలు ఒప్పందాలపై కూడా ఇరు దేశాల ప్రధానుల సమక్షంలో సంతకాలు జరిగే అవకాశం ఉంది. భారతదేశంలో ఉన్న సింగపూర్ వాసుల గౌరవార్థం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏర్పాటుచేసే విందులో కూడా సింగపూర్ ప్రధాని పాల్గొంటారు. లూంగ్‌తో పాటు ఆయన భార్య హో షింగ్, పలువురు కీలక మంత్రులు, సీనియర్ అధికారులు వచ్చారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో కూడా ఈనెల 5, 6 తేదీలలో సింగపూర్ ప్రధాని పర్యటిస్తారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజె ఆయనకు విందు ఇవ్వనున్నారు. -
'లీ' కి విజయవంతంగా శస్త్ర చికిత్స
సింగపూర్: ప్రోస్టేట్ కేన్సర్‌తో బాధపడుతున్న సింగపూర్ ప్రధానమంత్రి లీ హిజైన్ లూంగ్ కు చేసిన శస్త్రచికిత్స విజయవంతమైందని అక్కడి ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. శస్త్ర చికిత్స అనంతరం తాను పూర్తిగా కోలుకుంటానని లీ ఆశాభావం వ్యక్తం చేశారు. రోబోట్ సహాయంతో శస్త్రచికిత్స ద్వారా కేన్సర్ కణాలను తొలగించినట్టు వైద్యులు సోమవారమిక్కడ తెలిపారు. 63 ఏళ్ల 'లీ' ప్రోస్టేట్ కేన్సర్ గా నిర్ధారణ కావడంతో ఆయన శస్త్రచికిత్స చేయించు కోవాలని నిర్ణయించుకున్నారు. గతనెలలో ఎమ్ఆర్ఐ స్కాన్ ద్వారా కేన్సర్ నిర్ధారక పరీక్షలు నిర్వహించారు. నిర్ధారక పరీక్షల్లో ఒకటి నుంచి 38పైగా ప్రోస్టేట్ కేన్సర్ కారక కణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ప్రొపెసర్ క్రిష్టోపర్ చింగ్ యురాలిజిస్ట్ పర్యవేక్షణలో ప్రధాని 'లీ' కి సింగపూర్ జనరల్ హాస్పిటల్లో సర్జరీ నిర్వహించారు. సర్జరీ విజయవంతంగా పూర్తి అయిందని, త్వరలో లీ పూర్తిగా కోలుకుంటారని చింగ్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రధాని లీ కి కేన్సర్ రావడం ఇది రెండోసారిగా చింగ్ చెప్పారు. లీ కి 1992లో లింఫోమా వచ్చింది. దాంతో ఆయన కెమోథెరఫీ చేయించుకున్నారు. కాగా లీ కి వచ్చిన ప్రోస్టేట్ కేన్సర్‌కు గతంలో వచ్చిన లింఫోమాతో ఎలాంటి సంబంధం లేదని చింగ్ స్పష్టం చేశారు. కాగా, ప్రధాని లీ ఒక వారంపాటు సెలవులో ఉన్నట్టు ప్రధాని కార్యాలయం పేర్కొంది. ప్రధాని కోలుకునేవరకు డిప్యూటీ ప్రధాని టీయో చీ హీన్ ప్రధానిగా విధులు నిర్వర్తించనున్నట్టు తెలిపింది.