సిస్మిక్ సర్వే అడ్డుకున్న మత్స్యకారులు
30 బోట్లలో వెళ్లి ఓడను చుట్టుముట్టి నిరసన
కరవాక (మామిడికుదురు):
ఓఎన్జీసీ కరవాక సముద్ర జలాల్లో చేపట్టిన సిస్మిక్ సర్వేతో తాము ఉపాధి కోల్పోతున్నామంటూ మత్య్సకారులు సోమవారం తీవ్రస్థాయిలో నిరసన తెలిపారు. కరవాక, గోగన్నమఠం గ్రామాలకు చెందిన సుమారు 200 మంది మత్స్యకారులు 30 బోట్లలో సముద్ర జలాల్లోకి వెళ్లి సిస్మిక్ సర్వే చేస్తున్న ఓడ వద్ద నిరసన తెలిపారు. సర్వేకు వినియోగిస్తున్న ఓడల వల్ల వేటకు ఉపయోగించే లక్షల రూపాయలు విలువైన వలలు పాడైపోతున్నాయని, సముద్రపు చేపలు చనిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు నెలలుగా ఇదే పరిస్థితి నెలకొని ఉందన్నారు. తమ ఆవేదనను ఓఎన్జీసీ అధికారులకు తెలియజేసినా వారు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉపాధికి ఆటంకంగా మారిన సర్వేను తక్షణం నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఓడపైకి ఎక్కి ఓఎన్జీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో కరవాక, గోగన్నమఠం సర్పంచ్లు సిర్రా శ్రీనివాస్, లంకే శ్రీనివాస్, మత్స్యకార సంఘాల నాయకులు రేకాడి శ్రీరామ్మూర్తి, పెసంగి భైరవస్వామి, కొల్లు లక్ష్మణరావు, రేకాడి చంద్రశేఖర్, ఓలేటి దుర్గారావు, కర్రి వీరన్న, రేకాడి సుబ్బారావు, కొల్లు రాంబాబు, రేకాడి ఆదినారాయణ, భర్రే కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.