వైఎస్ఆర్ సీపీ నేతపై వేటకొడవళ్లతో దాడి
గుంటూరు:గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో గురువారం అర్థరాత్రి దారుణం చోటు చేసుకుంది. స్థానిక మహాలక్ష్మీ బార్లో వైఎస్ఆర్ సీపీ సొసైటీ ప్రెసిడెంట్ సీతారామిరెడ్డిపై ఆయన ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేశారు. గాయపడిన ఆయనను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
సీతారామిరెడ్డికి అదే గ్రామానికి చెందిన పందిటి రామిరెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి సీతారామిరెడ్డిపై రామిరెడ్డి వేటకొడవలితో దాడి చేశాడు. అక్కడున్న వారు అడ్డుకోవటంతో సీతారామిరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటన అనంతరం రామిరెడ్డి పరారయ్యాడు. సీఐ సుబ్బారావు సంఘటన స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.