టెన్త్ పేపర్ లీక్ పెద్ద గేమ్‌ప్లాన్
సాక్షిప్రతినిధి, వరంగల్/వరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో హిందీ ప్రశ్నపత్రం లీక్, కాపీ కుట్ర పెద్ద గేమ్‌ప్లాన్ అని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన రేపి ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతోనే ఈ కుట్రకు పాల్పడ్డారని తమ విచారణలో తేలిందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో బండి సంజయ్‌ది ప్రధాన పాత్ర అని తేలడంతోనే ప్రథమ నిందితుడిగా చేర్చామన్నారు.
దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని, కొత్త అంశాలు బయటికొస్తే సెక్షన్లు మారుతాయని వివరించారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో సీపీ ఏవీ రంగనాథ్ వివరాలను వెల్లడించారు. ఈ కేసులో 10 మందిని నిందితులుగా చేర్చామని.. ఏ1 బండి సంజయ్, ఏ2 బూర ప్రశాంత్, ఏ3 గుండెబోయిన మహేశ్, ఏ5 మౌటం శివగణేశ్‌లను అరెస్టు చేశామని, ఏ4గా ఉన్న బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించామని తెలిపారు. పరీక్షల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఇన్వి జిలేటర్లపై విద్యాశాఖ చర్యలు తీసుకుందని చెప్పారు.
సంజయ్ ఆదేశాలతోనే లీక్
ఈ కేసులో నిందితుడైన బూర ప్రశాంత్ జర్నలిస్ట్ కాదని, చాలా మందికి వాట్సాప్‌లో ప్రశ్నపత్రాన్ని పంపించాడని.. బండి సంజయ్ ఆదేశాల మేరకే ప్రశాంత్ కుట్రలో భాగస్వామి అయ్యాడని విచారణలో తేలిందని సీపీ వెల్లడించారు.
‘‘రెండు రోజుల క్రితం సాయంత్రం బండి సంజయ్‌తో ప్రశాంత్ వాట్సాప్ చాటింగ్ చేశాడు. ప్రశాంత్ చాటింగ్‌లో పేర్కొన్న అంశాలనే బండి సంజయ్ ప్రెస్మీట్లో మాట్లాడాడు. తర్వాతిరోజు బండి సంజయ్‌తో ప్రశాంత్ వాట్సాప్ కాల్ మాట్లాడాడు. దీనికి సంబంధించి 76800 06600 నంబర్‌తో కూడిన ఫోన్ ఇవ్వాలని అడిగినా బండి సంజయ్ ఇవ్వలేదు. ఆ ఫోన్ ఇస్తే మాకు కీలక సమాచారం వస్తుంది’’ అని సీపీ వెల్లడించారు.
ఇంకా కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్‌ల వివరాలు రావాల్సి ఉందని చెప్పారు. ప్రశాంత్‌పై కేవలం మెసేజ్ షేర్ చేసినందుకు మాత్రమే కేసు బుక్ చేయలేదని.. బీజేపీ మానిటరింగ్ చేస్తున్న నమో టీంలో వరంగల్ లోక్‌సభ పరిధిలో ప్రశాంత్ పనిచేస్తున్నాడని తెలిపారు. ప్రశాంత్ ఈ హిందీ పేపర్‌ను ఈటెల రాజేందర్, ఆయన పీఏ నరేందర్‌లతోపాటు పలువురు బీజేపీ నేతలకు పంపాడని చెప్పారు.
చట్టప్రకారమే అరెస్టులు
బండి సంజయ్ అరెస్టు చట్టప్రకారమే జరిగిందని, 41 సీఆర్పీసీ కింద నోటీసులు ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేయొచ్చని, దీనికి తగిన కారణాలున్నాయని సీపీ రంగనాథ్ వివరించారు. సంజయ్ అరెస్టుకు ముందు లోక్‌సభ స్పీకర్‌కు సమాచారం ఇచ్చామని చెప్పారు. తమపై ఎవరి ఒత్తిళ్లు లేవని, వరంగల్‌లో ఎక్కువగా అరెస్ట్ చేసింది బీఆర్ఎస్ వారినేనని పేర్కొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మను అరెస్టు చేయడంపై జాతీయ మహిళా కమిషన్ అడుగుతున్న ప్రశ్నలకు కూడా చట్టపరిధిలో సమాధానం ఇస్తామన్నారు. ఈ కేసులో నేరం రుజువైతే సంజయ్, ఇతర నిందితులకు మూడేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలుశిక్షపడే అవకాశం ఉందన్నారు.
రిమాండ్ రిపోర్టు: అరెస్టులకు కారణాలివీ..
హిందీ పేపర్ లీక్ కేసులో మొత్తం 10 మందిని నిందితులుగా పేర్కొన్న పోలీసులు.. బండి సంజయ్ సహా నలుగురి అరెస్టుకు కారణాలను రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అర్ణేష్ కుమార్ వర్సెస్ బీహార్ రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన నియమాలకు లోబడి.. నోటీసులు ఇవ్వకుండా నేరుగా నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్టు పేర్కొన్నారు. ఆ అంశాలు, కారణాలివీ..
♦ఎస్సెస్సీ పబ్లిక్ పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు పరీక్ష కేంద్రం నుంచి హిందీ ప్రశ్నపత్రాన్ని తీసి, దాని ఫోటోలను వాట్సాప్/సోషల్ మీడి యాలో షేర్ చేయడం హేయమైన నేరం. ఇంకా పరీక్షల ప్రక్రియ కొనసాగుతోంది. నిందితులు రిమాండ్ కాకుంటే పరీక్షల నేరాలకు మరింతగా పాల్పడి.. తెలంగాణ విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేసే అవకాశం ఉంది.
♦ నిందితులు రిమాండ్‌కు వెళ్లకుంటే.. రాష్ట్రంలోని చిత్తశుద్ధి గల విద్యార్థులు సీరియస్‌గా తీసుకుని, నిందితులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయతి్నస్తే.. అది శాంతిభద్రతల సమస్యకు దారితీయవచ్చు.
♦ఈ కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. చాలా సాక్ష్యాలను సేకరించాలి. నిందితులు బయట ఉంటే.. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు, తదుపరి దర్యాప్తు సరైన విధంగా జరగకుండా ఆటంకం కలిగించేందుకు అవకాశం ఉంది.
♦ ఇది చాలా తీవ్రమైన కేసు, ముందస్తు ప్రణాళికతో చేసిన నేరపూరిత కుట్ర. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశంతో చేశారు. మరికొందరు నేరస్తులను ఇంకా పట్టుకోవాల్సి ఉంది. లోతైన దర్యాప్తు అవసరం. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని నిందితులను రిమాండ్‌కు పంపాలి.