యాక్సిడెంట్ కేసులో డ్రైవర్‌కు ఆరు నెలల జైలుశిక్ష
వరంగల్ లీగల్ : అజాగ్రత్తగా వాహనం నడిపి ఒకరి మరణానికి కారణమైన డ్రైవర్‌కు ఆరు నెలల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ బుధవారం కోర్టు తీర్పు వెల్లడించింది. పోలీసుల కథనం ప్రకారం కాజీపేట భవానీనగర్‌కు చెందిన కొంగరి రాందాసు (రైల్వే రిటైర్డ్ ఉద్యోగి) 2013 సెప్టెంబర్ 26న పని నిమిత్తం వరంగల్‌కు వచ్చాడు. పని ముగించుకుని తిరిగి వెళ్లేందుకు పాలిటెక్నిక్ ప్రధాన గేటు దాటుతున్నాడు. ఈ క్రమంలో హన్మకొండ వైపు నుంచి వరంగల్ వైపు వస్తున్న టాటా ఏసీ ట్రాలీ వాహనం అతివేగంగా వచ్చి రాందాసును ఢీకొంది. దీంతో అక్కడికక్కడే రాందాసు మృతిచెందాడు. కేసు నమోదు చేసిన మట్టెవాడ ట్రాఫిక్ పోలీసులు దర్యాప్తు చేయగా ట్రాలీ డ్రైవర్ బూర చిరంజీవి పర్వతగిరి మండలం సోమారం గ్రామస్తుడని నిర్ధారణ అయ్యింది. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో నేరం రుజువు కావడంతో ఆరో మున్సిపాల్ మెజిస్ట్రేట్ కోర్టు జడ్జి ఆర్.రఘునాథ్‌రెడ్డి తీర్పు చెప్పారు. ఆరునెలల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. సాక్షులను కానిస్టేబుల్ సంతోష్ కోర్టులో ప్రవేశ పెట్టగా, ప్రాసిక్యూషన్ తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ ఆర్.శ్రీనివాస్ వాదిం చారు.