'చలో హైకోర్టు '.. ఉద్రిక్తత
సీజేను అడ్డుకున్న న్యాయవాదులు
ఆరో నంబర్ గేట్ వద్ద దీక్షా శిబిరం
న్యాయవాదులను అరెస్ట్ చేసిన పోలీసులు
నిరసనగా నేడు కోర్టుల్లో విధుల బహిష్కరణ
జిల్లాల్లోనూ పలు చోట్ల లాయర్ల అరెస్టులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు తలపెట్టిన చలో హైకోర్టు నినాదాలు, అరెస్టులతో సాగింది. చలో హైకోర్టు సందర్భంగా న్యాయవాదులు గురువారం పెద్ద సంఖ్యలో కోర్టు వద్దకు చేరుకున్నారు. హైకోర్టు ఆరో నంబర్ గేట్ వద్ద దీక్షా శిబిరంలో న్యాయవాదులు బైఠాయించి నినాదాలు చేశారు. హైకోర్టు పరిసర ప్రాంతాల్లో పోలీసులు మోహరించి అడ్డుకున్నారు. దీక్షా శిబిరంలో తెలంగాణ న్యాయవాదుల జేఏసీ చైర్మన్ ఎం. రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర హైకోర్టు ఏర్పాటును కోరుతూ శాంతియుతంగా దీక్ష చేస్తున్న తమను పోలీసులు అన్యాయంగా అడ్డుకుంటున్నారన్నారు.
న్యాయవాదుల అరెస్ట్‌ను నిరసిస్తూ ఆగస్టు 1న తెలంగాణలోని కోర్టుల్లో విధులను బహిష్కరించి కోర్టుల ముందు ప్రధాన న్యాయమూర్తి దిష్టిబొమ్మ దహనం చేయాలని పిలుపునిచ్చారు. హైకోర్టు ఆరో నంబర్ గేట్ వద్ద నిర్వహించిన దీక్షను పోలీసులు అడ్డుకొని న్యాయవాదులను అరెస్ట్ చేశారు. రోడ్డుపై బైఠాయించిన న్యాయవాదులతో పాటు దీక్ష శిబిరంలోకి చొరబడిన పోలీసులు న్యాయవాదులను వాహనంలోకి ఈడ్చుకెళ్లారు. అరెస్టయిన న్యాయవాదులను కంచన్‌బాగ్, ఫలక్‌నుమా పోలీస్స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వం నుంచి హమీ వచ్చేంత వరకు దీక్ష నిర్వహిస్తామని పోలీస్‌స్టేషన్‌లో బైఠాయించారు.
సీజేను అడ్డుకున్న న్యాయవాదులు...
చలో హైకోర్టుపై ఉదయం 10.30 గంటలకే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ప్రధాన న్యాయమూర్తిని కలిశారు. కాగా నిరసనలో భాగంగా జేఏసీ నేతలు ప్రధాన న్యాయమూర్తి కోర్టుకు వెళ్లి విధుల బహిష్కరణకు సహకరించాలని కోరారు. విధులకు ఆటంకం కలిగించడం సరికాదని సీజే స్పష్టం చేశారు. మరికొందరు న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తి కోర్టుకెళ్లి జై తెలంగాణ నినాదాలు చేయడంతో సీజే తన చాంబర్‌కు వెళ్లిపోయారు.
ఇతర కోర్టుల వద్దకూ వెళ్లి ఆందోళనకు మద్దతివ్వాలని న్యాయమూర్తులను కోరగా వారు విధులు బహిష్కరణ సరికాదని తిరస్కరించారు. కోర్టు నిర్వహణకు ఆటంకం ఏర్పడుతుండడంతో వారు కూడా తమ చాంబర్లలోకి వెళ్లిపోయారు. మధ్యాహ్నం తిరిగి విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి కేసులు వాదించేందుకు న్యాయవాదులు రాని కేసుల్లో విచారణను పది, పన్నెండు వారాలకు వాయిదా వేసుకుంటూ వెళ్లారు.
హైకోర్టు వద్ద భారీ బందోబస్తు...
హైకోర్టు ప్రధాన ద్వారాలతో పాటు మదీనా చౌరస్తా, పేట్లబురుజు, పురానాపూల్, సిటీ సివిల్ కోర్టుల వద్ద దక్షిణ మండలం పోలీసుల ఆధ్వర్యంలో భారీ బలగాలను మోహరించారు. నగర పోలీసులతో పాటు ఏపీఎస్పీ, బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఆర్ఏఎఫ్, టాస్క్‌ఫోర్స్‌తో భారీ బందోబస్తును నిర్వహించారు. నగర జాయింట్ కమిషనర్ (సీఏఆర్ హెడ్ క్వార్టర్స్) ఎం. శివ ప్రసాద్, దక్షిణ మండలం డీసీపీ సర్వ శ్రేష్ఠ త్రిపాఠి, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ లింబారెడ్డిలు బందోబస్తును పర్యవేక్షించారు.
ట్రాఫిక్ అంతరాయంతో వాహనదారుల ఇక్కట్లు...
ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో హైకోర్టు నుంచి మదీనా చౌరస్తా, నయాపూల్ వరకు ట్రాఫిక్ ఆగింది. న్యాయవాదులను అరెస్ట్ చేయడంతో ట్రాఫిక్ సమస్య తీరింది.
జిల్లాల్లోనూ ఆందోళనలు, అరెస్టులు.....
ఇదిలా ఉండగా హైకోర్టుకు వచ్చేందుకు బయలుదేరిన వివిధ జిల్లాల్లోని న్యాయవాదులను ఎక్కడికక్కడే పోలీసులు అరెస్టులు చేశారు. రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు గురువారం కోర్టు విధులను బహిష్కరించారు. కోర్టు భవనం ముందుకు చేరుకుని కేంద్ర ప్రభుత్వం, ఏపీ సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.