‘సమాచారచట్టం’తోనే పారదర్శకత : పీకే మహంతి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం సమాచార హక్కు చట్టం కీలక పాత్ర పోషిస్తోందని, అటువంటి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరముందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే మహంతి పేర్కొన్నారు. ప్రభుత్వ సంస్థలు, అధికారులందరూ ప్రజలకు జవాబుదారీలేనని, ప్రజలకు సమాచారం ఇవ్వడం వారి బాధ్యతని గుర్తుచేశారు. గురువారం జూబ్లీహాల్లో నిర్వహించిన సమాచారహక్కు చట్టం సెమినార్లో మహంతి పాల్గొన్నారు.
సమాచార కమిషనర్లు, ప్రజా సమాచార అధికారులు, అప్పీలేట్ అథారిటీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. సాధారణ పరిపాలన ముఖ్య కార్యదర్శి ఎస్.కే సిన్హా మాట్లాడుతూ... పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతి నిర్మూలనకే ప్రభుత్వం సమాచార చట్టాన్ని తెచ్చిందని, నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరేందుకు ప్రభుత్వం, సమాచార కమిషన్ మరింత శ్రమపడాల్సిన అవసరం ఉందని సూచించారు.
ప్రజలకు సమాచారం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించబోమని ప్రధాన సమాచార కమిషనర్ జన్నత్ హుస్సేన్ హెచ్చరించారు. కార్యక్రమంలో సమాచార కమిషనర్లు సి. మధుకర్రాజ్, ఎస్. ప్రభాకర్ రెడ్డి, పి. విజయబాబు, ఎం. రతన్, వర్రె వెంకటేశ్వర్లు, తాంతియా కుమారి, ఇంతి యాజ్ అహ్మద్, విజయ నిర్మల సమాచారహక్కుచట్టం ఆవశ్యకతను వివరించారు.