మౌలిక రంగం స్వల్ప ఊరట...
♦ ఆగస్టులో 3.2% వృద్ధి నమోదు
♦ జూన్‌తో పోల్చితే 20 బేసిస్ పాయింట్లు అధికం
♦ 2015 ఇదే నెలతో చూస్తే... అక్కడక్కడే
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్- ఆగస్టులో స్వల్ప ఊరట నిచ్చింది. వృద్ధి 3.2 శాతంగా నమోదయ్యింది. జూలై నెలతో పోలిస్తే ఇది కేవలం 20 శాతం అధికం. అంటే జూలైలో ఈ వృద్ధి రేటు 3 శాతం మాత్రమే. ఇక 2015 ఆగస్టుతో పోల్చితే ఈ వృద్ధి రేటులో ఎటువంటి మార్పూ లేదు. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో ఎనిమిది పరిశ్రమల వాటా 38 శాతం. ప్రభుత్వం శుక్రవారం నాడు విడుదల చేసిన గణాంకాల ప్రకారం...
క్రూడ్ ఆయిల్: వృద్ధి రేటు 5.6 శాతంగా ఉంది. 2015 ఇదే నెలలో ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా -3.9 శాతం క్షీణత నమోదయ్యింది.
సహజ వాయువు: ఈ రంగం కూడా -5.7 శాతం క్షీణత నుంచి 3.7 శాతం వృద్ధిబాట పట్టింది.
రిఫైనరీ ప్రొడక్టులు: వృద్ధిరేటు 3.5 శాతం నుంచి 5.8 శాతానికి ఎగసింది.
సిమెంట్: ఈ రంగంలో వృద్ధి 3.1 శాతం నుంచి 5.4 శాతానికి చేరింది.
విద్యుత్: 0.1% స్వల్ప వృద్ధి నుంచి 5.6 శాతం లాభాల బాటకు చేరింది.
ఎరువులు: వృద్ధి రేటు భారీగా 5.7% నుంచి 13.8 శాతానికి చేరింది.
బొగ్గు: -9.2% క్షీణత, స్వల్పంగా 0.5% వృద్ధికి మళ్లింది.
మైనస్‌లో ఒకటి...
స్టీల్: ఈ రంగంలో అసలు వృద్ధిలేకపోగా -3.3 క్షీణత నమోదయ్యింది. 2015 ఇదే నెలలో ఈ రంగం 17% వృద్ధిలో ఉంది.