జారిపడ్డ విద్యార్థి
♦ నిమజ్జన వేడుకల్లో పాల్గొన్న టెన్త్, ఇంటర్ విద్యార్థులు
♦ ఓ విద్యార్థి రాకుండానే గురుకుల పాఠశాల గేట్లు మూసివేత
♦ ఆలస్యంగా వచ్చి.. పైపు ఎక్కి రూముకు చేరుకునే ప్రయత్నంలో జారిపడ్డ విద్యార్థి
♦ తీవ్ర గాయాలతో ఆస్పత్రిపాలు.. ‘గురుకుల’ నిర్వాహకుల తీరుపై తల్లిదండ్రుల ఆగ్రహం
గురుకుల పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం ఓ విద్యార్థి ప్రాణం మీదకొచ్చింది. డార్మెట్స్ రూమ్ (విశ్రాంతి గది)లో ఎంత మంది విద్యార్థులున్నారు? ఎవరు ఆబ్సెంట్ అయ్యారో చూసి బయటున్న వారిని లోపలికి వచ్చేలా చర్యలు తీసుకోకుండా గేట్లన్నీ క్లోజ్ చేయడంతో.. ఉపాధ్యాయులు ఎక్కడ తిడతారోనన్న భయంతో గోడ దూకిన విద్యార్థి పైప్‌లైన్ ఎక్కి డార్మెట్స్లో ప్రవేశించే ప్రయత్నంలో 10 అడుగుల ఎత్తు నుంచి కాలు జారి కింద పడ్డాడు. తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు. యాజమాన్య నిర్లక్ష్యంపై విద్యార్థి తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన కణేకల్లు మండలం కణేకల్లుక్రాస్‌లోని గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి జరిగింది.
కణేకల్లు:
గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని ఆదివారం నిమజ్జనం చేశారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఇంటర్, పదో తరగతి విద్యార్థులను మాత్రమే అనుమతించారు. సాయంకాలం 6 గంటల సమయంలో వినాయక విగ్రహం ఊరేగింపు జరిగింది. కార్యక్రమం పూర్తయ్యాక పదో తరగతి విద్యార్థి పి.భరత్‌కుమార్ మినహా మిగిలిన వారందరూ క్యాంపస్‌కు చేరుకున్నారు. సరిగ్గా పది గంటలకు గురుకుల పాఠశాల మెయిన్‌గేట్, డార్మెట్స్ గేట్లు క్లోజ్ చేశారు. నిమజ్జనానికి వెళ్లిన వారంతా వచ్చారా? లేదా? అని పరిశీలించకుండానే ఉపాధ్యాయులు గేట్లన్నీ మూసివేయించారు. రాత్రి పది గంటల తర్వాత క్యాంపస్‌కు వచ్చిన భరత్‌కుమార్ మెయిన్‌గేట్ క్లోజ్ అవడం చూసి ఏదోలా గోడ దూకి లోపలికొచ్చాడు. అనంతరం రెండంతస్తులపై ఉన్న డార్మెట్స్ రూమ్‌లోకి వెళ్లేందుకు పైప్ ఎక్కబోయాడు. కొంత ఎత్తు ఎక్కాక కాలుజారి కింద పడ్డాడు.
తీవ్రంగా గాయపడిన విద్యార్థి కదలలేని స్థితిలో రాత్రాంతా అక్కడే మూలుగుతూ ఉండిపోయాడు. సోమవారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో వంట మనుషులు గమనించి పీడీ రాఘవేంద్రకు సమాచారం అందజేశారు. ఆయన వెంటనే విద్యార్థిని కణేకల్లు ఆర్డీటీ ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలపడంతో ప్రిన్సిపల్ ప్రసన్నకుమారి వెంటనే నల్లమాడ మండలం కురుమాలలో ఉంటున్న భరత్‌కుమార్ తల్లిదండ్రులు అనురాధ, మునీంద్రకు సమాచారం చేరవేశారు. వారు హుటాహుటిన వచ్చి కుమారుడిని అనంతపురంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్సచచేయించారు. భరత్‌కుమార్‌కు కాలు విరగడంతో పాటు ముఖం, వీపు, కళ్లకు దెబ్బలు తగిలాయి. విషయం తెలుసుకున్న తహశీల్దార్ వాణిశ్రీ, ఎస్ఐ యువరాజు గురుకుల పాఠశాలకెళ్లి ఘటనపై విచారణ చేశారు.
యాజమాన్య నిర్లక్ష్యం వల్లే ప్రమాదం
గురుకుల పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు పి.భరత్‌కుమార్‌కు ఈ ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు అనురాధ, మునీంద్ర, బాబాయ్ మునిప్రసాద్లు ఆరోపించారు. ఫోన్లో వారు విలేకర్లతో మాట్లాడారు. నిమజ్జన కార్యక్రమానికి ఎంత మంది వెళ్లారు? తిరిగి ఎంత మంది లోపలకొచ్చారు? పరిశీలించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు. ఈ ఘటనపై సాంఘిక సంక్షేమ శాఖ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళుతున్నట్లు వారు చెప్పారు.
ప్రమాదం ఎలా జరిగిందో విద్యార్థే చెప్పాలి : ప్రిన్సిపల్
ఈ ప్రమాదం ఎలా జరిగిందో విద్యార్థి భరత్‌కుమార్ కోలుకుని చెబితే వాస్తవ పరిస్థితి తెలుస్తుందని ప్రిన్సిపల్ అరుణకుమారి పేర్కొన్నారు. డార్మెట్స్ రూమ్ పైప్‌ల వద్ద పడి ఉంటే తమ సిబ్బంది పీడీ రాఘవేంద్రకు తెలిపారని, ఆయన వెంటనే ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారని చెప్పారు. ఆ వెంటనే తల్లిదండ్రులకు కబురందించామన్నారు. ప్రస్తుతం ఆ విద్యార్థి కోలుకుంటున్నట్లు తెలిసిందన్నారు.